రాష్ట్ర విభజన ప్రకటన వెలువడీ వెలువడగానే నూతన రాజధాని ఏర్పాటుకు రూ. నాలుగైదు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన వెలువడీ వెలువడగానే నూతన రాజధాని ఏర్పాటుకు రూ. నాలుగైదు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి 25న ఉదయం ఆయన ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర ’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిదశలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. యాత్ర ఏర్పాట్లపై గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా జనసమీకరణ జరపాలని సూచించారు.
సీమాంధ్రలో జనాగ్ర హం తథ్యం?
చంద్రబాబు బస్సు యాత్రను సీమాంధ్రకు చెందిన మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వెంటనే కొత్త రాజధాని ఖర్చు గురించి మాట్లాడిన చంద్రబాబు సీమాంధ్రలో దేని కోసం యాత్ర చేపడుతున్నారని ప్రజలు నిలదీయడం తథ్యమని నేతలు చెబుతున్నారు. బస్సు చుట్టూ కార్యకర్తలను భారీ సంఖ్యలో పెట్టుకుని యాత్ర చేసి సాధించేదేమీ లేదంటున్నారు. తెలంగాణ ఇవ్వాలని కేంద్రానికి లేఖ ఇచ్చిన రోజున సీమాంధ్ర సమస్యలను విస్మరించి ఇప్పుడు బస్సు యాత్ర చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనల్లో పొల్గొంటున్న టీడీపీ నేతలు కొన్ని చోట్ల బాబు ఫోటోలను పెట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడాన్ని కొందరు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు బస్సు యాత్రలో ప్రజల ఆగ్రహావేశాలకు గురికావలసివస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.