బాబు జమానా.. రైతుకు షాక్‌  | The Chandrababu Government Was Trapped In The Vortex Of Farmers | Sakshi
Sakshi News home page

బాబు జమానా.. రైతుకు షాక్‌ 

Mar 13 2019 9:56 AM | Updated on Mar 13 2019 10:00 AM

The Chandrababu Government Was Trapped In The Vortex Of Farmers - Sakshi

సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్‌): అన్నదాతలు కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయారు. వరుణుడి కరుణ లేక వర్షాధార పంటలన్నీ తుడిచిపెట్టుకుపోగా.. బోరుబావుల్లో వచ్చే అరకొర నీటితోనైనా పంటలు వేద్దామంటే ప్రభుత్వం కరుణ చూపడం లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో వేలాది రూపాయలు ధారబోసి బోర్లు వేయించుకున్న రైతులు పంటలను సాగు చేసుకోలేకపోతున్నారు. ఏళ్ల తరబడి విద్యుత్‌ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. కనెక్షన్లు మాత్రం మంజూరు కావడం లేదు. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
 
కోటా తగ్గించి..రైతులను వేధించి.. 
తమది రైతు ప్రభుత్వమని, వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని చంద్రబాబు తరచూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే..ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరించారు. మరోవైపు అర్హులైన రైతులు ఉన్నప్పటికీ కొత్త వారికి కనెక్షన్లు మంజూరు చేయకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనా కాలమంతా ఇదే పరిస్థితి. దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా విద్యుత్‌ కనెక్షన్‌ రాకపోవడంతో బోరుబావులను నిరుపయోగంగా ఉంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల రైతులు ఇటు పంటలను, అటు ఆర్థికంగాను నష్టపోతున్నారు.  ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35,638 మంది రైతులు విద్యుత్‌ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. 



వైఎస్సార్‌ పథకానికి తూట్లు 
రైతు సంక్షేమం కోసం వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్‌ (త్రీఫేజ్‌) అందించేందుకు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకున్నారు. ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేశారు. మొదటి ఏడాదే జిల్లాకు రూ.39.74 కోట్లతో 5,085 కనెక్షన్లు మంజూరు. తర్వాత ప్రతియేటా కోటా పెంచుతూ వెళ్లారు. వైఎస్సార్‌ పుణ్యమా అని జిల్లాలో ఇప్పటికి దాదాపు 1.50 లక్షల కనెక్షన్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందుతోంది.

అయితే..చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఉచిత విద్యుత్‌ పథకానికి క్రమేణా తూట్లు పొడుస్తూ వచ్చారు. 2018–19 సంవత్సరంలో అర్హులైన  జిల్లా కోటాను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేశారు. సాధారణంగా ఏటా జనవరి– ఫిబ్రవరి మాసాల్లో పెండింగ్‌ దరఖాస్తులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్‌ చేయాల్సిన కోటాను కోరుతూ జిల్లా అధికారులు సీఎండీకి ప్రతిపాదనలు పంపుతారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా మొత్తం కోటా విడుదల చేయాలని సీఎండీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ మాసంలోనే కోటాను విడుదల చేయాలి.అయితే..ప్రభుత్వం మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. 

కనెక్షన్లు ప్రశ్నార్థకమే 
ఎన్నికల కోడ్, సర్కారు నిర్లక్ష్యం కారణంగా  ప్రస్తుతం కొత్త కనెక్షన్ల మంజూరు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు కోటాను, సర్వీసులను సకాలంలో విడుదల చేయకపోవడంతో పెండింగ్‌ దరఖాస్తులు 35,638కి చేరుకున్నాయి. ఇప్పటికే డీడీల రూపంలో 13,553 మంది రైతులు డబ్బు చెల్లించారు. వీరి మొత్తం రూ.7,62,35,625లు ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు చేరింది. డబ్బు చెల్లించినా కనెక్షన్లు రాకపోవడంతో రైతులు వేదన చెందుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement