బాబు.. డబ్బు లెక్కల డప్పు

Chandrababu Criticising YSRCP MLA Candidates In Campaign - Sakshi

కృష్ణపట్నం పోర్టు నావల్లే వచ్చిందంటూ డప్పు

నెల్లూరు నగరంలో 45 వేల మందికి  ఇళ్లిచ్చానంటూ ప్రచారం

ప్రతి చోట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు

బాబు రోడ్‌షోకు జనాలు కరువు 

సాక్షి , నెల్లూరు:  సీఎం చంద్రబాబు చందమామ కథలు మళ్లీ వల్లించారు. జిల్లాలో ఇంత ఖర్చు చేశానంటూ డబ్బుల లెక్కల డప్పు కొట్టుకున్నారు. కృష్ణపట్నం పోర్టు తన వల్లే వచ్చిందన్నారు. నెల్లూరు నగరంలో 45 వేల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చానన్నారు. ఇక ప్రతి చోట పెన్షన్‌ నుంచి రుణమాఫీ వరకు అన్ని ఈ వారంలో చేస్తానన్నాడు. చివరగా ఎప్పుడూ లేనంతగా వంగి వంగి ఓటర్లకు దండం పెట్టి ఆశీర్వదించమని అభ్యర్థించాడు. వీటన్నింటితో పాటు ప్రతి చోట వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు. ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా ఎన్నికల సభలు, రోడ్‌ షో ఇలా కొనసాగింది. మంగళవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో రోడ్‌షో, ఎన్నికల సభలను చంద్రబాబు నిర్వహించారు.

షెడ్యూల్‌ సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా చంద్రబాబు పర్యటన జిల్లాలో మొదలైంది. నెల్లూరు రూరల్, నగరంలో జరిగిన రోడ్‌షో పూర్తి పేలవంగా సాగింది. పార్టీ కార్యకర్తలు జనాలను సమీకరించినా ఎక్కడా జనాలు అంతగా కనిపించని పరిస్థితి. ఇక అధికార పార్టీ నేతలు, మంత్రుల ఒత్తిడితో రవాణా శాఖ అధికారులు పోలీస్‌ చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేకంగా మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లను తనిఖీల పేరుతో ట్రావెల్స్‌ కార్లను వందల సంఖ్యలో కాన్వాయ్‌ పేరుతో తీసుకున్నారు. కాన్వాయ్‌లో వాహనాలు పెట్టకుండా నేతలకు అప్పగించారు. ఇక ప్రసంగంలో అయితే  ముఖ్యంగా జిల్లాలో చేసిన పనుల గురించి పెద్దగా ప్రస్తావించకుండానే చేయని పనులు అన్ని యథావిధిగా చేసేశానని చెప్పి కార్యకర్తలతో బలవంతంగా చప్పట్లు కొట్టించుకున్నారు. కృష్ణపట్నం పోర్టు తన కృషి వల్లే వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా దూషిస్తూ, అదే సమయంలో తమ పార్టీ నేతలు అత్యంత మంచి వారని పట్టువదలని విక్రమార్కులు మాదిరిగా తనతో పనులు చేయించుకున్నారని ఆత్మస్తుతి పరనింద కార్యక్రమం కొనసాగించారు. నెల్లూరు నగరంలో 45 వేల ఇళ్లు కట్టించి ఇచ్చానని కూడా డప్పు కొట్టుకున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో ఇళ్లు మాత్రమే పూర్తి కాగా మిగిలిన కొన్ని పునాదుల దశ కూడా దాటలేదు. ప్రతి నియోజకవర్గాన్ని వేల రూ.కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. వీటితో పాటు పసుపు–కుంకమ, పెన్షన్, రుణమాఫీ, పంట పెట్టుబడి అన్ని నేను ఇస్తున్నాని ఈ వారంలో అన్ని చేస్తానని మళ్లీ ఎన్నికల హమీలు గుప్పించారు.

నెల్లూరు రూరల్‌ పరిధిలో డైకస్‌రోడ్డు, నెల్లూరు సిటీలోని ఎన్టీఆర్‌ సెంటర్‌లో సభ ముగించుకొని కస్తూరి గార్డెన్స్‌కు రాత్రి బసకు చేరుకున్నారు. జిల్లాలో బరిలో ఉన్న అభ్యర్థులందర్ని కస్తూరి గార్డెన్స్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. రెండు రోజుల కిత్రం సుజానా చౌదరి నగరానికి వచ్చి 10 మంది అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులతో సమావేశం అయి లెక్కల వ్యవహారాలు ప్రాథమికంగా ఖరారు చేసి వెళ్లారు. వీటిని చంద్రబాబు ఖరారు చేస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. బుధవారం జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలో చంద్రబాబు ఎన్నికల సబలు నిర్వహించనున్నారు.

విద్యుత్‌ కొరత లేకుండా చేశా..
ముత్తుకూరు:  రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేసింది తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముత్తుకూరులో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు రూ.1.50 లక్షల చొప్పున రుణమాఫీ చేశామన్నారు. త్వరలో కోటి మంది మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తామన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులకు రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్నామన్నారు. ఈ ఏడు వరుణ దేవుడు కరుణించలేదన్నారు. నెల్లూరుకు గోదావరి నీళ్లు ఇస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top