ప్రభుత్వం కంటే ‘టాటా’నే నిబద్ధతతో పనిచేస్తోంది

Chandrababu comments on TATA Trust - Sakshi

     సీఎం చంద్రబాబు వ్యాఖ్య

     తిరుపతిలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించబోయే కేన్సర్‌ ఆస్పత్రికి శంకుస్థాపన

     చిత్తూరులో అపోలో నాలెడ్జ్‌ సెంటర్‌ సందర్శన

సాక్షి, తిరుపతి: ప్రభుత్వం కంటే టాటా ట్రస్ట్‌ వారు నిబద్ధతతో పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద టీటీడీ విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కేన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌ రీసెర్చ్‌ (శ్రీకార్‌) సంస్థ నిర్మాణానికి టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి శుక్రవారంఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపిన టాటా ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఏటా 50 వేల మంది కేన్సర్‌ బారిన పడుతున్నారని, 2020 నాటికి ఈ సంఖ్య 1.50 లక్షలకు చేరే ప్రమాదం ఉందన్నారు.

దేశవ్యాప్తంగా 124 ఆస్పత్రులు టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, తిరుపతి ఆస్పత్రి రేడియేషన్‌ థెరపీకి హబ్‌గా మారనుందని చెప్పారు. కేన్సర్‌పై అవగాహన అవసరమని, చివరి దశలో వ్యాధిని గుర్తిస్తుండడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, ముందుగా గుర్తిస్తే జబ్బును నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తిరుపతి మెడికల్‌ హబ్‌గా, సెల్‌ఫోన్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. స్మార్ట్‌ సిటీ కోసం తిరుపతిలో 87 కి.మీ తీసుకోనున్నట్లు వెల్లడించారు. శెట్టిపల్లి వద్ద ఎకనమిక్‌ జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వేను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ పక్కా ఇల్లు వారికి నచ్చిన విధంగా కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని సీఎం చెప్పుకొచ్చారు. పేదలకు నాణ్యమైన కేన్సర్‌ వైద్యం అందించటమే లక్ష్యంగా తిరుపతిలో పరిశోధనతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు రతన్‌ టాటా తెలిపారు. టీటీడీ సహకారంతో పేదలకు సేవలందిస్తామని చెప్పారు. 

అపోలో నాలెడ్జ్‌ సెంటర్‌ సందర్శన
చిత్తూరు సమీపంలో ఆపోలో గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలెడ్జ్‌ సెంటర్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆపోలో చైర్మెన్‌ ప్రతాప్‌రెడ్డి సేవలను ఆయన కొనియాడారు. అపోలో ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలోనే టెలీ మెడిసన్‌ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో అడ్డుపడుతోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో టాటా, అపోలో గ్రూప్‌ ప్రతినిధులతో పాటు మంత్రి నారాయణ, టీటీడీ చైర్మెన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, ఎంపీలు శివప్రసాద్, కేశినేని నాని, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, సత్యప్రభ, శంకర్‌యాదవ్, తలారి ఆదిత్య, తుడా చైర్మెన్‌ నరసింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top