నావల్లే మీరంతా అమెరికా వచ్చారు

Chandrababu call to NRIs - Sakshi

     ప్రవాస తెలుగువారితో సీఎం చంద్రబాబు

     ప్రజాసేవకు మేం అవకాశమిస్తాం 

     మీ ఊరు–మీ రాష్ట్రం కోసం పనిచేయండి 

     ఓటు వేయడమే కాదు.. ప్రచార బాధ్యతా తీసుకోండి 

     ప్రవాసులకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి

     అమెరికా కంటే టెక్నాలజీలో ఏపీ ముందుందని వ్యాఖ్య

సాక్షి, అమరావతి : నాడు ఐటీ రంగంపై తాను శ్రద్ధ పెట్టడంవల్లే ఈరోజు ఇంతమంది అమెరికా రాగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాలెడ్జి ఎకానమీకి చిహ్నంగా సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున హైదరాబాద్‌లో సైబర్‌ టవర్స్‌ను ప్రారంభించానని గుర్తుచేశారు. టెక్నాలజీ వినియోగంలో అమెరికా కంటే ఏపీ అనేక రంగాల్లో ముందుందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలోని ‘న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్టూడెంట్‌ సెనేట్‌’లో ఏర్పాటైన సభలో ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

తెలుగు వారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జి ఎకానమీలోనూ ముందుకు రావాలన్నారు. దూరం అనేది సమస్య కాదని, రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగువారు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తున్నారో ప్రవాసులు కూడా అదే తరహాలో సహకారం అందించవచ్చని చెప్పారు. ప్రవాసులు సొంత గ్రామానికి ఏం చేయాలో ఆలోచించాలని సూచించిన సీఎం.. ఆ ఆలోచనలను గ్రామస్తులతో పంచుకోవాలని, ‘గ్రామదర్శిని, వార్డు దర్శని’కి చేయూతనివ్వాలని కోరారు.  

ఓటు, ప్రచారం రెండూ కావాలి 
ఈ ఏడాది ప్రవాసులకు ఓటు హక్కు వస్తుందని ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని, రాజ్యసభ ముందుకు త్వరలోనే రానుందని సీఎం వెల్లడించారు. ఉన్న చోటు నుంచే ఓటు వేసే అవకాశం ప్రవాసులకు వుంటుందని చెప్పిన సీఎం.. టీడీపీకి ఓటు వేయడంతో పాటు ప్రచారం కూడా చేయాలని కోరారు. త్వరలోనే ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన ప్రకటించారు. 

కిడారి, సివేరి హత్య దుర్మార్గం: ప్రజాస్వామ్యంలో హత్యలకు, విధ్వంసానికి తావులేదని, ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్యలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ఈ దుశ్చర్యలను అందరూ ఖండించాలన్నారు. కాగా, వీరిద్దరితోపాటు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నందమూరి హరికృష్ణకు న్యూజెర్సీ టీడీపీ విభాగం నిర్వహించిన సంతాప సభలో సీఎం ప్రసగించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top