అంతా బాబుకు తెలిసే.. | chandra babu knows everything | Sakshi
Sakshi News home page

అంతా బాబుకు తెలిసే..

Jan 3 2014 1:26 AM | Updated on Mar 28 2019 5:34 PM

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎక్కడికి అనుకూలంగా అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఉద్యమాలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి తెలిసే జరుగుతున్నాయని ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు స్పష్టం చేశారు


 ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలపై టీడీపీ సీమాంధ్ర నేతల వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎక్కడికి అనుకూలంగా అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఉద్యమాలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి తెలిసే జరుగుతున్నాయని ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు స్పష్టం చేశారు. అధినేతకు తెలియకుండా తామేమీ చేయటం లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో ఏపీ జర్నలిస్ట్ ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో యలమంచిలి సత్యనారాయణ చౌదరి, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి, సీఎం రమేష్ హాజరుకాలేదు. హాజరైన ఎంపీలు వివిధ ప్రశ్నలకు ఎంపీలు స్పందిస్తూ... తమ అధినేత అనుమతితోనే లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళన చేస్తున్నామని తెలిపారు.
 
 ఏ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకుంటుందని, అందులో భాగంగానే తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో పాటు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని కొనకళ్ల నారాయణ అన్నారు. కాగా, రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం జరుగుతున్న బంద్‌కు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మీడియాకు సంక్షిప్త సందేశాన్ని పంపింది. టీవీల్లో స్క్రోలింగ్ వచ్చిన తర్వాత సవరణ పంపింది. బంద్‌కు కేవలం సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు తెలుపుతున్నారని అందులో పేర్కొనడం గమనార్హం. సమావేశంలో ఏపీజేఎఫ్ గౌరవ సలహాదారు కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు గౌరవాధ్యక్షుడు కందుల రమేష్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెవుల కృష్ణాంజనేయులు, వంశీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement