చట్టం 'దిశ'గా!

Central Home Ministry Exercise on Proposed AP Disha Act - Sakshi

ప్రతిపాదిత దిశ చట్టంపై కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై న్యాయ నిపుణులతో చర్చ

మహిళలపై నేరాల్లో సత్వర న్యాయం కోసం సూచనలు ఇవ్వాలి

ఏపీలో దిశ చట్టం ప్రతిపాదన అనంతరం అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ

సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారుల రక్షణతోపాటు బాధితులకు సత్వర న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ చట్టంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్టరూపం కల్పించే చర్యలను ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందచేసింది. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.  

న్యాయ కోవిదులతో సంప్రదింపులు 
ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడి, వేధింపులను తీవ్ర నేరాలుగా పరిగణిస్తూ ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. నిర్భయ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం రుజువైతే దోషులకు ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా చట్టాల్లో కేంద్రం మార్పులు తెచ్చింది. ఈ కేసుల దర్యాప్తు, విచారణ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019 ద్వారా 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించేలా ప్రతిపాదించింది. అత్యాచారానికి పాల్పడే నిందితులకు ఉరిశిక్ష విధించేలా మార్పులు చేసింది. ఈ క్రమంలో త్వరితగతిన విచారణ, శిక్ష అమలులో వెసులుబాటు, ప్రత్యేక కోర్టులు, యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని కేంద్ర హోంశాఖ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన దిశ బిల్లు, కేంద్ర హోంశాఖ ప్రస్తావించిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలన ప్రక్రియ ప్రారంభించింది. దిశ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలను చట్టపరంగా, న్యాయపరంగా ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై కేంద్ర హోంశాఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మహిళలపై వేధింపులకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో మార్పులు, కొత్తవి రూపకల్పన, అమలు తీరు తదితర అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం గత నెలలో అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఐపీసీ 1860, ఎవిడెన్స్‌ యాక్ట్‌ 1872, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీఆర్‌పీసీ) 1973 చట్టాల్లో మార్పులు తెచ్చి కేసుల దర్యాప్తు,  విచారణ, తీర్పు వేగంగా పూర్తయ్యేలా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది.  

త్వరలోనే చట్టరూపం 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును చట్ట రూపంలోకి తేవటంపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా ఉంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాలు ప్రతిపాదించే సవరణలకు కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం. ఇప్పటికే ఈ బిల్లును పరిశీలించి న్యాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు పంపింది. బిల్లును ఏ సబ్జెక్ట్‌ ప్రకారం ప్రతిపాదించారు? ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లకు సంబంధించి ఏ మార్పులు చేశారు? అనే కొన్ని ప్రాథమిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. దిశ బిల్లు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని ఆశిస్తున్నాం.
    – దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top