కొత్తగా 9 ఏకలవ్య మోడల్‌ గురుకులాలు | Central Government has sanctioned nine new Ekalavya Model Residential Schools for AP | Sakshi
Sakshi News home page

కొత్తగా 9 ఏకలవ్య మోడల్‌ గురుకులాలు

Jul 14 2020 4:30 AM | Updated on Jul 14 2020 4:30 AM

Central Government has sanctioned nine new Ekalavya Model Residential Schools for AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా తొమ్మిది ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ (ఈఎంఆర్‌ఎస్‌) స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ స్కూళ్లు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గురుకుల స్కూళ్లు కో–ఎడ్యుకేషన్‌లో పనిచేస్తాయి. 

కొత్త రెసిడెన్షియల్‌ స్కూళ్లకు నిధులు
కొత్తగా మంజూరైన ఈఎంఆర్‌ఎస్‌లను విశాఖజిల్లాలోని పెదబయలు, అనంతగిరి, హుకుంపేట, పాడేరు, జి మాడుగుల, కొయ్యూరు, అరకు, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరంలలో ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణాలకు ప్రభుత్వం సేకరించిన స్థలంలో స్కూల్‌ కాంప్లెక్స్, హాస్టల్‌ భవనాలు, స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మిస్తారు. కనీసం 15 నుంచి 20 ఎకరాల్లో గురుకులం నిర్మిస్తారు. భవన నిర్మాణాలకు నిధులనూ ప్రభుత్వం మంజూరు చేసింది. 

క్రమేణా జూనియర్‌ కాలేజీలు..
ప్రస్తుతం ఉన్న 19 ఈఎంఆర్‌ఎస్‌ల్లో 3,603 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇవి ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. మొదట, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 6వ తరగతిలో మాత్రమే విద్యార్థులను చేర్చుకుంటారు. మొదట చేరిన విద్యార్థులు పై క్లాసులకు వెళుతుంటారు. రెండు సెక్షన్‌లు ఏర్పాటు చేసి ఒక్కో సెక్షన్‌కు 30 మంది చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటారు. 2014లో ప్రారంభమైన నాలుగు స్కూళ్లు ప్రస్తుతం జూనియర్‌ కాలేజీలుగా మారాయి. మిగిలిన 15 స్కూళ్లు ప్రస్తుతం 9వ తరగతి వరకు నడుస్తున్నాయి. బాలుర స్కూలులో 547 మంది, మూడు బాలికల స్కూళ్లలో 1,419 మంది, 15 కో–ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,637 మంది విద్యార్థులు చదువుతున్నారు. 

శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల నియామకం
ఈ స్కూళ్లలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల నియామకాలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎంపిక ఉంటుంది. నిర్వహణ బాధ్యతలు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ చూస్తుంది. కాగా, కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

ఆదర్శ వంతమైన విద్యకు ఈఎంఆర్‌ఎస్‌ 
ఈఎంఆర్‌ఎస్‌ల్లో ఆదర్శవంతమైన విద్యను అందిస్తున్నాం. రాష్ట్రానికి కొత్తగా మరో తొమ్మిది స్కూళ్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికే రెండింటి నిర్మాణాలకు ప్రభుత్వం స్థల సేకరణ పూర్తి చేసింది. కలెక్టర్‌ల ఆధ్వర్యంలో స్థలాల పరిశీలన జరుగుతోంది. 
– ఎస్‌. లక్ష్మణరావు, జాయింట్‌ సెక్రటరీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement