ఉల్లి ధరల నియంత్రణలో ఏపీ కృషి భేష్‌

Central Economic Survey praised AP Govt About Onion prices - Sakshi

బహిరంగ మార్కెట్‌ నుంచి భారీగా కొనుగోలు చేసింది

సబ్సిడీ ధరలకే ప్రజలకు ఉల్లిని సరఫరా చేసింది

కేంద్ర ఆర్థిక సర్వే 2019–20లో ప్రశంసలు  

సాక్షి, అమరావతి: ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. దేశవ్యాప్తంగా ఇటీవల ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బజార్ల ద్వారా కిలో కేవలం రూ.25 చొప్పున అందించేలా చర్యలు చేపట్టడం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే–2019–20లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ నుంచి భారీ ఎత్తున కొనుగోలు చేసి.. నష్టాలకు వెనుకాడకుండా వినియోగదారులకు సబ్సిడీ ధరకు విక్రయించడం ద్వారా ఉల్లి ధరలను అదుపు చేయడంలో తన వంతు కృషి చేసినట్లు ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలూ ఇదే రీతిలో తక్కువ ధరకే ఉల్లిని సరఫరా చేసినట్లు సర్వే వెల్లడించింది. అకాల వర్షాల వల్ల ఉల్లి పంట భారీగా దెబ్బతినడంతో ఖరీఫ్‌ దిగుబడి బాగా తగ్గిపోయిందని, దీంతో ఉల్లి ధరలు డిసెంబర్, 2019 నాటికి 455.8 శాతం పెరిగినట్టు పేర్కొంది. దేశంలో ఉల్లి సాగు అధికంగా జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో పంట సాగు ఏడు శాతం మేరకు తగ్గిపోయినట్టు తెలిపింది.

ఇదే సమయంలో సెప్టెంబర్‌–అక్టోబర్‌ మాసాల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల ఉల్లి సాగైన మహారాష్ట్రలో 58 శాతం, కర్ణాటకలో 18 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో రెండు శాతం మేరకు పంట దెబ్బతిన్నట్టు పేర్కొంది. పెరిగిన ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని, ఎగుమతులపై ఆంక్షలు విధించడంతోపాటు 57,373 టన్నుల ముందస్తు నిల్వలను బయటకు తీసి విక్రయించినట్లు వివరించింది. వీటితోపాటు ఈజిప్ట్, టర్కీ వంటి దేశాల నుంచి ఎంఎంటీసీ ద్వారా దిగుమతి చేసుకొని నాఫెడ్‌ ద్వారా విక్రయించినట్లు తెలిపింది. ఇలా సరఫరా చేసిన ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్‌ సత్వర చర్యలు చేపట్టినట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top