2019లో నింగికేగిన ప్రముఖులు...

Celebrities In Literary And Social Service Sector Who Died In 2019 - Sakshi

రివైండ్‌- 2019

జీవితమే పోరాటంగా అహర్నిశలు శ్రమించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు 2019లో నింగి కేగిశారు. సాహిత్య​, సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురి ప్రముఖుల మరణాలు అభిమానులను కలచివేశాయి. సాహిత్య రంగంలో సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వా.నా. శాస్త్రి, తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన అబ్బూరి ఛాయాదేవి ఈ ఏడాది కనుమరుగయ్యారు. సామాజిక సేవా రంగంలో అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ ఈ ఏడాది తుదిశ్వాస విడిచారు. కుష్ఠు వ్యాధి బాధితుల కోసం జీవితాంతం కృషి చేసిన దామోదర్‌ గణేష్‌ కన్నుమూశారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టడం విషాదాన్ని నింపింది.

సాహిత్య రంగం..
ద్వానా శాస్త్రి
సాహితీ సవ్యసాచిగా పేరుగాంచిన ద్వా.నా. శాస్త్రి.. విభిన్న పత్రికల్లో వేలాది పుస్తక సమీక్షలు చేసిన ఏకైక వ్యక్తి. వందేళ్లనాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి తెచ్చారు. అంతేకాకుండా సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.కాగా ద్వా.నా.శాస్త్రి అని పిలవబడే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదీన జన్మించారు. శ్వాసకోశ వ్యాధితో ఫిబ్రవరి 25న ఆయన కన్నుమూశారు.

అబ్బూరి ఛాయాదేవి
తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన ఛాయాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి ఛాయాదేవి. 1960 దశకంలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైబ్రేరియన్‌గా ఆమె పనిచేశారు. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. బోన్‌సాయ్ బ్రతుకు కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన 'తన మార్గం' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం, 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్నారు. జూన్‌ 28న ఆమె తుది శ్వాస విడిచారు.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
అభ్యుదయ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ జూలై 26న కన్నుమూశారు. 1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్‌ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు. చిన్నవయసులోనే అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రేడియోలో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకులుగా కూడా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పనిచేశారు. ఇంటిపేరు ఇంద్రగంటి పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు.

రామతీర్థ
వక్తగా, అనువాదకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా గుర్తింపు పొందిన రామతీర్థ మే 30న కన్నుమూశారు. అసలు పేరు యాబలూరు సుందర రాంబాబు. 1960లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్ల నెల్లూరు, ఒడిశాలలో విద్యాభ్యాసం సాగింది. బి.ఎ. తర్వాత 1981లో పారదీప్‌ పోర్టులో కార్మికుల రక్షణ విభాగంలో ఉద్యోగంలో చేరారు. 1985లో బదిలీపై విశాఖపట్నం వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఐదేళ్ళ క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి కాలం సాహితీసేవలో నిమగ్నమయ్యారు.

మహాస్వప్న..
దిగంబర కవిత్వోద్యమానికి శంఖారావం పూరించిన మహాస్వప్న.. జూన్‌ 24న కన్నుమూశారు. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. కమ్మిశెట్టి వెంకయ్య నారాయణమ్మల ఏకైక కుమారుడు. ఆయనకు ఒక చెల్లెలు ఉంది. వృతిరీత్యా వ్యవసాయదారుడు. ఆజన్మ బ్రహ్మచారిగానే జీవితాంతం గడిపారు. ఇంటర్మీడియెట్‌ వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మహాస్వప్న చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లడంతో, ఆయన జీవితం మలుపు తీసుకొంది. అక్కడ వివేకవర్థని కళాశాలలో బీఏలో చేరారు. ఈ క్రమంలో అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యంతో పరిచయం పెంచుకొన్నారు. 1958లో ప్రముఖ సంపాదకుడు నార్ల చిరంజీవి సహకారంతో పద్దెనిమిదేళ్ల వయసులోనే ‘చందమామ’ పేరుతో బాలకవితా సంపుటి వెలువరించారు. 1964లో అగ్నిశిఖలు - మంచు జడులు, స్వర్ణధూళి, కవితా సంపుటిలను ప్రచురించారు.
 
వాసా ప్రభావతి
ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త డాక్టర్‌ వాసా ప్రభావతి అనారోగ్యంతో డిసెంబర్‌ 18న కన్నుమూశారు. ఆమె వాసా ప్రభావతి పలు నవలలు రాశారు. ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కాశీచేనుల సూర్యనారాయణ లక్ష్మీదేవమ్మ దంపతులకు 1940లో ఆమె జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మపై  ‘దేశ బాంధవి’ అనే పుస్తకాన్ని ప్రభావతి రాశారు. వెండి వెలుగులు, హృదయ నేత్రం, పలు పద్య కావ్యాలు, 50కి పైగా లలిత గీతాలు, నవలలు, 20 వరకు నాటకాలు రాశారు. 

కులశేఖర్‌రావు
ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మడుపు ఎం.కులశేఖర్‌రావు మే నెల లో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో జన్మించిన కులశేఖర్‌రావు తెలంగాణలో తొలితరం సాహితీవేత్త. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ తెలుగు చదివారు. ఆంధ్ర వచన వాజ్ఞ్మయ వికాసంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. ఉస్మానియా వర్సిటీ తెలుగు శాఖలో మూడున్నర దశాబ్దాలపాటు లెక్చరర్‌గా, రీడర్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, శాఖ అధిపతిగా సేవలందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పలు రచనలు, పద్య రచనలు సైతం అందించారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆంగ్లంలో రాశారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సాహిత్య బహుముఖి వ్యక్తిత్వంపై ఆంగ్లంలో ఒక గ్రంధాన్ని రచించారు. 

సామాజిక సేవా రంగం..
వి.కోటేశ్వరమ్మ
విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ జూన్‌ 30న కన్నుమూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925, మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్‌ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డ్రన్స్‌ మాంటిస్సోరి స్కూల్‌ను స్థాపించారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి మరీ బాలికలను పాఠశాలలో చేర్పించేవారు. పది మందితో ప్రారంభమైన ఆ పాఠశాల క్రమంగా ప్రాథమికోన్నత, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి. ఆమె విద్యా సంస్థల్లో చదివిన లక్షలాది మంది మహిళలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. తన సేవలకు గుర్తింపుగా కోటేశ్వరమ్మ పలు అవార్డులు పొందారు. 1971లో బెస్ట్‌ టీచర్‌గా జాతీయ స్థాయి అవార్డు, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు 2015లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌లో స్థానం పొందారు. 

రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీఎస్‌ కృష్ణన్‌  
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ కృష్ణన్ నవంబర్‌ 9న కన్ను మూశారు. కేరళకు చెందిన 1956 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణన్‌.. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన అఖిల భారత సర్వీసు అధికారిగా అందరి మన్ననలు పొందారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల్లో ఆయన ముఖ్యభూమిక పోషించారు. వైఎస్సార్‌ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్‌ది ప్రముఖపాత్ర. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా, బీసీ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్‌ కమిషన్‌లోని వివిధ విభాగాల్లో చైర్మన్, సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం-1989, సవరణ చట్టం-2015, సవరణ చట్టం-2018 డ్రాఫ్ట్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడిగా పనిచేశారు.

భాగవతుల వెంకట పరమేశ్వరరావు
గాంధేయవాది,శాస్త్రవేత డాక్టర్‌ భాగవతుల వెంకట పరమేశ్వరరావు జూన్‌ 9న విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం విశాఖ జిల్లా దిమిలి. 1976 నవంబర్‌లో యలమంచిలి సమీప గ్రామం హరిపురంలో బీసీటీ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను భాగవతుల ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై గ్రామాల్లో ప్రచారం చేసి వినూత్న మార్పునకు కృషి చేశారు. గ్రామ స్వరాజ్యం స్థాపన ధ్యేయంగా స్వగ్రామం దిమిలిలో హైస్కూల్ ఏర్పాటు చేసి అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు.  గ్రామీణ ప్రాంతాల్లో విద్య,వైద్యం అందించడానికి చేసిన కృషికి పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆయనను సత్కరించాయి. 

దామోదర్‌ గణేష్‌..
కుష్ఠు వ్యాధి బాధితుల కోసం జీవితాంతం కృషి చేసిన దామోదర్‌ గణేష్‌ బాపట్‌ ఆగష్టు 17న కన్నుమూశారు. తన 87ఏళ్ల జీవితకాలంలో 47ఏళ్ల పాటు కుష్ఠువ్యాధి బాధితులకు సేవలు అందించారు. 1972 నుంచి కుష్ఠువ్యాధిగ్రస్తుల సేవలో ఉన్నారు. కాట్రేనగర్ చంపాలో సొంత ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. సామాజికంగానూ, ఆర్థికంగానూ వారి జీవితాల్లో మార్పుకు కృషి చేశారు. ఆయన సేవలకుగానూ 2018లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top