ఇంధన పొదుపుపై ప్రచారం: పనబాక లక్ష్మి | Canvassing on Fuel Thrift, says Panabaka Lakshmi | Sakshi
Sakshi News home page

ఇంధన పొదుపుపై ప్రచారం: పనబాక లక్ష్మి

Oct 4 2013 3:56 AM | Updated on Jul 29 2019 6:10 PM

ఇంధన పొదుపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆయిల్, గ్యాస్ పొదుపుపై భారీ ప్రచార కార్యక్రమాన్ని గురువారం ఆమె హైదరాబాద్‌లో ప్రారంభించి మాట్లాడారు. ‘ఇంధన పొదుపుపై విద్యార్థులతో ప్రచారం చేస్తాం. దేశంలో ఏటా రూ. 5,33,900 కోట్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను వినియోగిస్తున్నాం. ఇది మొత్తం జీడీపీలో 7% సమానం. 25% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 75% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి.
 
 దీనిపై 7 వారాలపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి బుధవారం కార్లను వినియోగించరాదని పెట్రోలియంశాఖ ఉద్యోగులంతా నిర్ణయించారు. ఆ రోజు బస్సుల్లో లేదా నడుచుకుంటూ కార్యాలయాలకు వస్తారు’ అని మంత్రి వివరించారు.  కార్యక్రమంలో గెయిల్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ హరిప్రసాద్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఆధార్ అనుసంధానం కాకున్నా వంట గ్యాస్ సబ్సిడీ
 ఆధార్ అనుసంధానం కాకపోయినా వంటగ్యాస్‌కు సబ్సిడీ వర్తింపజేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పనబాక తెలిపారు. ఆధార్ లేదన్న కారణంతో ప్రజలకు పథకాలను నిలిపివేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మంత్రి ఈ మేరకు వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు ‘నేను సమైక్య వాదిని. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’ అంటూ నిష్ర్కమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement