
తిరుమలలో గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు
తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేది వరకు నిర్వహించనున్నారు.
{బహ్మోత్సవాల్లో భాగంగా అధికారుల చర్యలు
సుప్రభాతం మినహా నిత్య, వారపు ఆర్జిత సేవలకూ ఇదే పద్ధతి
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు వెంకన్నకు బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేది వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని గదుల అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ రద్దు చేశారు. ఆ రోజుల్లో సిఫారసులపై కూడా గదులు మంజూరు చేయకూడదని సోమవారం నిర్ణయం తీసుకున్నారు. దాతలు స్వయంగా వస్తేనే గదులు మంజూరు చేయనున్నారు.
నిత్య, వారపు ఆర్జిత సేవలు రద్దు
వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో సుప్రభాతసేవ మినహా మిగిలిన అన్ని రకాల నిత్య, వారపు ప్రత్యేక ఆర్జిత సేవలను రద్దు చేశారు. సుప్రభాతం తర్వాత తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక కల్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవకు భక్తులకు టికెట్లు కేటాయించకుండా ఏకాంతంగా నిర్వహిస్తారు. వాటితోపాటు విశేషపూజ (సోమవారం), అష్టదళ పాద పద్మారాధన సేవ (మంగళవారం), సహస్ర కలశాభిషేకం(బుధవారం), తిరుప్పావడ (గురువారం), పూర్ణాభిషేకం (శుక్రవారం) వంటి వారపు సేవలను కూడా రద్దు చేశారు. అడ్వాన్స్ బుకింగ్ కింద సుప్రభాతసేవా టికెట్లు కలిగిన భక్తులను మాత్రం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవం నిర్వహించే తేదీల్లో అడ్వాన్స్ బుకింగ్‌లో ఇతర ఆర్జిత సేవా టికెట్లు కలిగి ఉన్న భక్తులు సంప్రదిస్తే, బ్రహ్మోత్సవాల తర్వాత అనుకూల తేదీల్లో ఆయా సేవలను మార్చుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ
శ్రీవారి ఆలయంలో జరిగే దోషాల పరిహరణార్థం నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారం అంకురార్పణతో ఆరంభం కానున్నాయి. స్థానిక వసంతమండపంలో విష్వక్సేనుల వారి సాక్షిగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేశారు. వాటితోపాటు ఆయావారాల్లో నిర్వహించే ప్రత్యేక సేవలైన సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, నిజపాద దర్శనం కూడా రద్దు చేశారు.
భద్రాద్రిలో నేటినుంచి పవిత్రోత్సవాలు
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి జరగబోయే పవిత్రోత్సవాలకు మంగళవారం అంకురార్పణ చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. అంకురార్పణ సందర్భంగా మంగళవారం స్వామివారికి పవళింపు సేవను రద్దు చేశారు. అలాగే 6 నుంచి నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.