మహాత్ముడిని తప్పుపట్టడం సరికాదు | Can not fault saint | Sakshi
Sakshi News home page

మహాత్ముడిని తప్పుపట్టడం సరికాదు

Dec 29 2014 12:58 AM | Updated on Sep 2 2017 6:53 PM

మహాత్ముడిని తప్పుపట్టడం సరికాదు

మహాత్ముడిని తప్పుపట్టడం సరికాదు

మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జరిగిన సంవాదం విషయంలో రచయిత్రి అరుంధతీ రాయ్ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని గాంధీ మనవడు...

  • పీవీ స్మారకోపన్యాసంలో రాజ్‌మోహన్‌గాంధీ
  • గాంధీజీపై అరుంధతీరాయ్ రాసినవన్నీ అవాస్తవాలు  
  • చారిత్రక అంశాలను ఆమె వక్రీకరించారని విమర్శ
  • సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రఖ్యాత వ్యక్తుల మధ్య జరిగిన సంవాదం విషయంలో రచయిత్రి అరుంధతీ రాయ్ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని గాంధీ మనవడు, ప్రముఖ రచయిత రాజ్ మోహన్‌గాంధీ ఆరోపించారు. మహాత్ముడిని తప్పుపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఉపన్యాసాల కోసం అంబేద్కర్ తయారు చేసుకున్న ‘కుల నిర్మూలన’ పత్రాన్ని ఈ ఏడాది మార్చిలో ఒక సంస్థ పుస్తకంగా ప్రచురించగా... దానికి అరుంధతీరాయ్ ‘డాక్టర్ అండ్ సెయింట్’ పేరిట 153 పేజీల ముందుమాటను ప్రచురించారు.

    ఈ ముందుమాట వివాదాస్పదమైంది కూడా. ఆ ముందుమాటలోని పలు అంశాలను రాజ్‌మోహన్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ అంశాలనే ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ‘స్వాతంత్య్రం మరియు సామాజిక న్యాయం’ పేరిట జరిగిన పీవీ స్మారకోపన్యాసంలో రాజ్‌మోహన్ ప్రస్తావించారు. పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా.. పత్రికా సంపాదకులు, ప్రముఖులు కె.శ్రీనివాస్, తెలకపల్లి రవి, ఎమ్మెస్కో విజయ్ కుమార్ మాట్లాడారు.
     
    అవి చారిత్రక వాస్తవాలు కావు..

    గాంధీజీలో ద్వంద్వ వైఖరి ఉందంటూ దళితుల హక్కుల పట్ల ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ, దక్షిణాఫ్రికాలో ఉన్నపుడు మహాత్ముడు నల్ల జాతీయుల పట్ల సానుభూతి చూపలేదంటూ.. అరుంధతీరాయ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని రాజ్‌మోహన్‌గాంధీ తెలిపారు. గాంధీజీని చివరిదాకా బిర్లాలే పోషించారని రాయ్ చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవన్నారు. గాంధీజీని అపఖ్యాతి పాలు చేసేందుకు పలు సందర్భాల్లో అంబేద్కర్‌ను అరుంధతీరాయ్ పావుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

    సత్యాగ్రహం విషయంలోనూ తప్పుపట్టడం సరికాదని, 1927లో జరిగిన ఈ సంఘటనలను కావాలనే రాయ్ మార్చారని చెప్పారు. రాయ్ రాతలకు స్ఫూర్తి ఎవరు, ఆమె ఎవరిని హీరోగా చేయాలనుకున్నారు, ఆమె ఆకాంక్ష ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన సంస్కరణలతో గట్టెక్కించిన వ్యక్తిగా పీవీ నర్సింహారావు చిరస్మరణీయుడని రాజ్‌మోహన్‌గాంధీ పేర్కొన్నారు. దక్షిణాది నుంచి కాంగ్రెస్ ప్రధానిగా పీవీ ప్రజలందరి మనసులో ఉంటారని, ఆయన స్మారకంగా ఉపన్యాసం చేసే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
     
    రెండు పుస్తకాల ఆవిష్కరణ..

    రాజ్‌మోహన్ గాంధీ రాసిన ‘ఇండిపెండెన్స్ అండ్ సోషల్ జస్టిస్’ పుస్తకాన్ని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వ్యక్తిత్వం గురించి సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన ‘లో లోపలి మనిషి’ పుస్తకాన్ని రాజ్‌మోహన్‌గాంధీ ఆవిష్కరించారు.
     
    పీవీ సంస్కరణలే ఆదర్శం..

    పీవీ నర్సింహారావు చేపట్టిన సంస్కరణలను కాదన్న వాళ్లు అధికారం నుంచి తప్పుకున్నారని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఆయన సంస్కరణలను కొనసాగిస్తూ.. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఆర్థిక సంస్కరణల ద్వారా సంపదను సృష్టించడాన్ని నేర్పిన, వెనుకబడిన తరగతులకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్న మొదటి వ్యక్తి పీవీ నర్సింహారావు అని ప్రశంసించారు. సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా పీవీ వేసిన బాటనే ఎన్టీ రామారావు కూడా ఎంచుకున్నారని చెప్పారు. దళితులు, బీసీల సంక్షేమం కోసం తన జీవితాన్ని పీవీ నర్సింహారావు ధారపోశారని ఆయన కుమార్తె వాణి అన్నారు. ఆయన సంస్కరణల ఫలితంగానే రైతుకూలీ యజమాని అయ్యాడని వ్యాఖ్యానించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement