విడిదిలో వింతలు!

Camp Clerks Behaving Rudely In Krishna District Collector Office  - Sakshi

విడిది కార్యాలయాల్లో ఉద్యోగుల వింత పోకడలు

ఏళ్ల తరబడి పాతుకుపోయి చక్రం తిప్పుతున్న వైనం

కలెక్టరేట్‌లోనూ ఇదే తంతు 

ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న ప్రజలు 

సాక్షి, మచిలీపట్నం(కృష్ణా ): దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదన్న చందంగా మారింది ఉన్నతాధికారుల క్యాంపు కార్యాలయాల పరిస్థితి. కిందిస్థాయి సిబ్బంది వింత పోకడల వల్ల కలెక్టర్, జేసీ క్యాంపు కార్యాలయాలతో పాటు కలెక్టరేట్‌లో పాలన గాడి తప్పుతోంది.  ప్రభుత్వ విడిది కార్యాలయాల్లోని కొందరు సిబ్బంది వింత పోకడలు పోతున్నారు. అధికారులు ఎంత మంది మారినా మేం మాత్రం ఇక్కడే ఉంటామనే రీతిలో తిష్ట వేస్తున్నారు.

ఏళ్ల తరబడి ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న సీసీ (క్యాంప్‌ క్లర్క్‌) లు విధులు నిర్వహిస్తూ అక్కడే పాతుకుపోతున్నారు. దీంతో ఏ అధికారి వచ్చినా, సమస్యలపై వచ్చే ప్రజలైనా ముందుగా సీసీలను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. సీసీల అనుమతి లేనిదే ఉన్నతాధికారిని కలిసే ప్రసక్తే లేదని పలువురు జిల్లా అధికారులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో డీటీ కేడరు, సీనియర్‌ అసిస్టెంట్‌ కేడరులోని సీసీలు ఉన్నప్పటికీ డెప్యూటీ తహసీల్దార్‌ కేడర్‌లో ఉన్న ఓ సీసీ మాత్రం క్యాంపు కార్యాలయానికే పరిమితమై తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్నారు.

జేసీ విడిది కార్యాలయాల్లో ఇద్దరు డీటీలు, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్‌లు సీసీలుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎందరు మారినా వీరు మాత్రం అక్కడే పాతుకుపోయారు. కొత్తగా వచ్చిన అధికారికి, వెళ్లిపోయిన ఆఫీసర్‌తో సిఫార్సు చేయించుకుని తమదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. 

జిల్లా అధికారులకూ తప్పని తిప్పలు.. 
ఉన్నతాధికారులను కలవాలంటే జిల్లా అధికారులైనా ముందుగా సీసీలకు ఫోన్‌ చేసి వారు రమ్మంటేనే వెళ్లి కలవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సీసీలను ప్రసన్నం చేసుకోకపోతే సార్‌ బిజీగా ఉన్నారని సమాధానం చెబుతున్నారు. లేదా మీటింగ్‌లో ఉన్నారనే సమాధానం వస్తోంది. ఆ జిల్లా అధికారికి ముఖ్యమైన సమస్యపై చర్చించాల్సి ఉన్నా వేచి ఉండక తప్పడం లేదు. అంతేకాకుండా క్యాంపు కార్యాలయాల ‘నిర్వహణ’పేరుతో జిల్లా అధికారులకు ‘ఇండెంట్లు’కూడా తప్పటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

కలెక్టరేట్‌లోనూ ఇదే పరిస్థితి.. 
క్యాంప్‌ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్‌లో కీలక విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కొందరు ఏళ్ల తరబడి పాతుకుపోయారు. వీరి వల్ల అధికారులు, ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల పరిపాలన సక్రమంగా నిర్వహించాలంటే వీరి విధి నిర్వహణ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. 

క్యాంప్‌ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పాటు కలెక్టరేట్‌లోని ముఖ్య విభాగమైన ‘ఎ’సెక్షన్‌లో ఎ–3 గా పని చేసి ఎంయూడీఏ కార్యాలయానికి బదిలీ అయినప్పటికీ ఇంకా ఆ సీటుతోనే సంబంధాలు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఉద్యోగపర్వం మొత్తం ఇదే సెక్షన్‌లో కొనసాగటం గమనార్హం. అయితే ఇటీవల బదిలీ అయినప్పటికీ సదరు ఉద్యోగి ఎ–3 సీటు వ్యవహారాలను చక్కబెడుతున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.

అటెండర్, వీఆర్‌ఏ, వీఆర్వో స్థాయి ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఏ–7 సీటులో ఇంత వరకు పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతోనూ ఆయా క్యాడర్‌ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, నూతన జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే మాధవీలత, డీఆర్వో ఎ. ప్రసాద్‌ దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.

మార్పులు చేస్తాం..
ప్రజలు, అధి కారులు వచ్చి ప్రతి సమస్యను నాకు వివరించటం జరుగుతోంది. అయితే కొంత మేర సమస్య ఉన్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. దీనిపై మరింత దృష్టి సారించి త్వరలో మార్పులు చేస్తాను. 
– ఏఎండీ ఇంతియాజ్, జిల్లా కలెక్టర్‌  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top