వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. | busted by the police at the murder mystery case | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

Oct 13 2013 4:07 AM | Updated on Aug 29 2018 4:16 PM

ఈ నెల 8న భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని ఎంబావి వద్ద జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలని తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.

భువనగిరిటౌన్, న్యూస్‌లైన్: ఈ నెల 8న భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని ఎంబావి వద్ద జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలని తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ జె.నరేందర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపల్లి ఆవాసం ఎంబావి గ్రామానికి చెందిన అనిషా(సైదాబీ)తో తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి చెందిన ఎస్‌కె బురాన్(32)కు 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బురాన్ అత్తగారి గ్రామంలోనే బండలు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని దూరపు బంధువైన నమాత్‌పల్లి గ్రామానికి చెందిన ఎస్‌కె జహంగీర్ దగ్గర పనిచేసేవాడు. 2007లో బతకుదెరువు కోసం రామన్నపేటకు వెళ్లారు.
 
 కొంతకాలం తర్వాత తిరిగి ఎంబావికి వచ్చి జహంగీర్ దగ్గరే పనిచేస్తున్నాడు. అర్థిక పరిస్థితి దృష్టా జహంగీర్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. దీంతో జహంగీర్ తరచు బురాన్ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో జహంగీర్‌కు, అనిషాకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గతేడాది ఓ సారి బురాన్ తన ఇంట్లో నుంచి భార్యతోపాటు జహంగీర్ కలిసి రావడం చూశాడు. కొన్నిరోజుల తర్వాత తన భార్య దగ్గర ఉన్న సెల్లో జహంగీర్ నంబర్ ఉండడం గమనించాడు. అప్పటినుంచి భార్యను మందలిస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
 
 నిద్రమాత్రలు ఇచ్చి..
 తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న బురాన్‌ను అడ్డు తొలగించుకోవాలని అనిషా, ప్రియుడు జహంగీర్ కలిసి పథకం వేశారు. మత్తు ఇచ్చి చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అనిషా వలిగొండలోని మెడికల్‌షాపులో నిద్రమాత్రలు కొనుగోలు చేసింది. కొన్నిరోజులపాటు భర్తకు కొద్ది మోతాదులో మాత్రలు ఇస్తూ ఎంత సమయం మత్తులో ఉంటాడో గమనించింది. ఈ నెల 8న రాత్రి 9 గంటలకు సేమియాలో 8 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది.  తాగిన బురాన్ నిద్రలోకి జారుకున్నాడు. అదేరోజు రాత్రి ఒంటి గంట తర్వాత ప్రియుడికి ఫోన్ చేసి రమ్మంది.
 
 అనంతరం మత్తులో ఉన్న బురాన్‌ను ఇద్దరు కలిసి దిండుతో శ్వాస ఆడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించారు. జహంగీర్ దిండుతో శ్వాస అడకుండా చేస్తుండగా కదలకుండా కాళ్లను అనిషా గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో బురాన్ మత్తు నుంచి తేరుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య కొంత పెనుగులాట జరిగింది. పెనుగులాటలో మంచం నుంచి బురాన్ కింద పడిపోయాడు. ఆ శబ్ధానికి నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు లేచి జరుగుతున్న దృశ్యం చూసి భయపడ్డారు. వెంటనే అనిషా పిల్లల దగ్గరికి వెళ్లి ఏదో సైతాన్ వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేసింది. జహంగీర్ పక్కనే ఉన్న ఇనుపరాడుతో బురాన్ తలపై మూడు సార్లు బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
 
 విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు చిత్రీకరణ
 అనంతరం హత్యను పక్కదారి పట్టించేందుకు వెంట తెచ్చుకున్న విద్యుత్ వైరుతో మృతదేహానికి విద్యుత్‌షాక్ పెట్టారు. విద్యుదాఘాతంతో మరణించినట్లుగా చిత్రీకరించారు. ఆ విద్యుత్ వైరును వలిగొండ నుంచి రెడ్లరేపాకకు వెళ్లే దారిలో ఉన్న మూసీ కాల్వలో పడివేశాడు. కొద్దిసేపటి తర్వాత అనిషా తన భర్త విద్యుత్‌షాక్‌తో చనిపోయాడంటూ ఇంటినుంచి బయటికి వచ్చి స్థానికులతో రోదిస్తూ చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి సంఘటనస్థలాన్ని పరిశీలించారు.
 
 వాస్తవం బయటపడిందిలా..
 పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనిషాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుదాఘాతంతో మరణిస్తే తలపై బలమైన గాయాలు ఉండడంతోపాటు ఆమె తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. పిల్లలను విచారణ జరపగా విషయం తెలిపారు. దీంతో అనిషా సెల్‌ఫోన్‌ను పరిశీలించారు.
 
 అందులో జహంగీర్ నంబర్ ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చేసిన నేరం ఒప్పుకుంది. పొలీసులు హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనిషా, జహంగీర్‌లను రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది చంద్రిక, చారి ఉన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement