ప్లాట్ల వ్యాపారం ఫ్లాప్! | Business plots flops! | Sakshi
Sakshi News home page

ప్లాట్ల వ్యాపారం ఫ్లాప్!

Apr 3 2016 12:58 AM | Updated on Sep 3 2017 9:05 PM

రాష్ట్ర విభజనతో భూములు విలువ భారీగా పెరుగుతుందని భావించారంతా. దీంతో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు,

ఆకివీడు: రాష్ట్ర విభజనతో భూములు విలువ భారీగా పెరుగుతుందని భావించారంతా. దీంతో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, మదుపరులు ఇలా డబ్బున్న ఆసాములంతా భూములపై పెట్టబడులు పెట్టారు. పంట భూములు, ఖాళీ స్థలాలు, ఇతరత్రా భూముల్లో లే అవుట్లు వేశారు. జిల్లాలో 4 వేల ఎకరాలకు పైగా భూములు లేఅవుట్లుగా మారాయి. మున్సిపాల్టీ, కార్పొరేషన్ ప్రాంతాల్లో 200 నుంచి 500 ఎకరాల భూములు, మండల కేంద్రాల్లో 50 నుంచి 200 ఎకరాలు, గ్రామ స్థాయిలో 5 నుంచి 20 ఎకరాల భూముల్ని లేఅవుట్‌లుగా మార్చేశారు.
 
  భూముల విలువకు రెక్కలొస్తున్నాయని బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున  ప్రచారం చేశారు.  రూ.5 లక్షలున్న  ఎకరం భూమి విలువను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పెంచి, ప్లాట్లుగా విభజించి బేరం పెట్టారు. దీంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఈ భూములు కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గతేడాది చివరి నాటికి భూముల కొనుగోళ్లు ఒక్కసారిగా పడి పోయాయి. అమరావతి శంకుస్థాపన, ఆ ప్రాంతంలో భూముల కొనుగోళ్ల వ్యవహారం తదితర అంశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై  ప్రతికూల ప్రభావం చూపాయి.
 
 ఆర్థిక మాంద్యమూ కారణమే!
 ఏడాది నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.      వ్యాపారులు సరిగా సాగక వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైతుల దుస్థితి చెప్పనక్కరలేదు.  ఇవన్నీ పరోక్షంగా భూముల కొనుగోళ్లు స్తంభించటానికి కారణమయ్యాయి.      మున్సిపాల్టీల సరిహద్దు గ్రామాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో భూముల విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటి ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశాలూ కన్పించడంలేదు.
 
 వ్యాపారం పడిపోయింది
 ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది.  ప్రజల వద్ద డబ్బులేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపన, విద్యా సంస్థల స్థాపన, ఇతరత్రా అభివృద్ధి ఏమీ జరగకపోవడం ఈ పరిస్థితికి కారణం. భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. కొనేవారు లేకపోయినా లేఅవుట్‌లు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రిజిస్ట్రేషన్లు  తగ్గిపోయాయి.
 - అంబటి రమేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి
 
 తగ్గిన రిజిస్ట్రేషన్లు, పెరిగిన దస్తావేజులు
 భూముల అమ్మకాల శాతం తగ్గినా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు. భీమవరం జిల్లా రిజిస్టార్ పరిధిలో క్రియ దస్తావేజులు రిజిస్ట్రేషన్లు 1.52 శాతం పడిపోయింది. కొనుగోలు శాతం తగ్గడంతో క్రియ దస్తావేజులు చేయించుకునేవారి శాతం తగ్గింది. గతేడాది 27,541  దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఈ ఏడాది 27,197 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇతర దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. భీమవరం పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.
 - మహ్మద్ సిరాజుల్లా, జిల్లా రిజిస్ట్రార్, భీమవరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement