బ్రాహ్మణపల్లెలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 13 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. 15 లక్షల రూపాయలకు పై గానే ఆస్తినష్టం జరిగింది.
గోపవరం : బ్రాహ్మణపల్లెలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 13 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. 15 లక్షల రూపాయలకు పై గానే ఆస్తినష్టం జరిగింది. బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇళ్ల వద్ద ఎవరూ లేకపోవడంతో ఒక్క వస్తువును కూడా కాపాడుకోలేకపోయారు. బాధితులంతా పొలాల్లో ఉండటంతో దారుణం జరిగిపోయింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, లేక గ్యాస్ లీకై ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు.
ముందుగా నల్లగొండుమల్లెం కొండారెడ్డి ఇంటిలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ సమయంలో గాలి బాగా వీస్తుండటం వల్ల ఒక్కసారిగా క్షణాల్లో చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. బద్వేలు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె ఉండటం, ఫైర్‌ఇంజన్ రావడం ఆలస్యం కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్లలో ఉన్న బీరువాలు కాలి బూడిదయ్యాయి. మల్లెంకొండారెడ్డి ఇంట్లో 70 వేల రూపాయల నగదు కాలిబూడిదైంది.
ముప్పురి నాగమ్మ కూతురు పెళ్లి మరో పది రోజులు ఉండటంతో నగదు, బంగారం, బట్టలు తెచ్చి బీరువాలో దాచి ఉంచటంతో అవి పూర్తిగా కాలిపోయాయి. ముప్పురి సంటెయ్య ఇంట్లో పది బస్తాల ధాన్యం, మరో రెండు క్వింటాళ్ల నూగులు బూడిదయ్యాయి. ఇలా ప్రతి ఇంటిలో తిండి గింజల నుంచి కట్టుకునే బట్టల వరకు సర్వం కాలిపోయి బూడిదగా మారాయి. అలాగే ఈ అగ్నిప్రమాదంలో బర్రెలు, మూగజీవాలు కాలిపోయి మృత్యువాత పడ్డాయి.
కళ్ల ముందే పూర్తిగా తమ ఇళ్లు కాలిపోతుండటంతో చూస్తున్న బాదితుల రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఫైర్‌ఇంజన్ వచ్చే లోపు మంటలను అదుపు చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించినప్పటికి ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో మంటలు ఆర్పేందుకు సాహసం చేసి దగ్గరికి వెళ్లలేకపోయారు. దీంతో ఇళ్లలో ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలిబూడిదయ్యాయి. బాధితులు మొండి గోడల మధ్య కూర్చొని విలపిస్తుండటం చూసిన వారికి కంట తడి పెట్టించింది. పగవాళ్లకు కూడా ఇలాంటి సంఘటన జరగకూడదని బాధితులు కోరుకుంటున్నారు.
ఫైర్ ఇంజన్‌కు నీటి కొరత :
అసలే వర్షాలు లేక బావులు, కుంటలు ఎండిపోవడంతో మంటలు అదుపు చేసేందుకు వచ్చిన ఫైర్‌ఇంజన్‌కు నీటి కొరత ఏర్పడింది. బద్వేలు నుంచి లోడింగ్‌తో వచ్చిన ఫైరింజన్‌లో ఉన్న నీళ్లు అయిపోవడంతో తిరిగి మంటలను అదుపుచేసేందుకు చుట్టు పక్కల ఎక్కడా నీరు లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. కాగా ఫైర్‌ఇంజన్ వచ్చే సమయానికే ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దారు
విషయాన్ని తెలుసుకున్న తహశీల్దారు అనురాధ రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. జరిగిన ప్రమాదం చాలా దారుణమని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్లి సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని బాధితులకు తహశీల్దారు హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.


