సం‘జీవన్‌’ కావాలి!

A Boy Facing Kidney Problem In Srikakulam - Sakshi

సరస్వతీ పుత్రుడికి కొండంత కష్టమొచ్చింది. హాయిగా చదువుకుంటున్న సమయంలో కిడ్నీ మహమ్మారి తరుముకొచ్చింది. రెండు కిడ్నీలను కబళించేసింది. అసలే పేదిరకం.. ఆపై వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయాల్సి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడ్ని బతికించేందుకు లక్షలాది రూపాయలు అప్పులు చేశారు. ఇక తమ బిడ్డను దాతలే ఆదుకోవాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

సాక్షి, భామిని(శ్రీకాకుళం) : పోడు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబంపై విధి పగబట్టింది. కిడ్నీ వ్యాధి రూపంలో వారిలో సంతోషం దూరం చేసింది. భామిని మండలం కడంబసింగి కాలనీకి చెందిన ఆదివాసీ దంపతులు ఆరికి డిలో, ఆరికి ఇనత్రోలు పెద్ద కుమారుడు జీవన్‌. ఇటీవలే ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం బైపీసీలో 9.6 జీపీఏ సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. సీతంపేట మండలం మల్లి మల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల/కళాశాలలో రెండో ఏడాది తరగతులకు సిద్ధమవుతున్న తరుణంలో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. ఆరోగ్యం సహకరించక, బలహీనతతో నడవలేని పరిస్థితిలో ఉన్న జీవన్‌ను జూన్‌లో రాగోలు జెమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.

విద్యార్థి రెండు కిడ్నీలు పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎలాగైనా తమ కుమారుడ్ని బతికించుకోవాలనే తాపత్రయంతో లక్ష రూపాయలు వరకు అప్పులు చేసి వైద్యం చేయించారు. డయాలసిస్‌ ప్రక్రియలో భాగంగా పైప్‌(స్టంట్‌)ను రూ.20 వేలు ఖర్చుతో అమర్చారు. అయినా ఫలితం లేకపోయింది. జూలై 15న విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.30 వేలు ఖర్చు చేసి వైద్య పరీక్షలు చేయించారు.  అపోలో నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్‌ స్పెషలిస్టు డాక్టర్‌ ఎస్‌.అనిల్‌ కుమార్‌ పాత్రో కూడా విద్యార్థి రెండు కిడ్నీలు పాడైన విషయాన్ని ధ్రువీకరించారు. అప్పటి నుంచి ప్రతివారం డయాలసిస్‌కు చేయించేందుకు రూ.1500 వెచ్చిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు అప్పులు తేలేక ఐటీడీఏ ద్వారా పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో రెండు సార్లు డయాలసిస్‌ చేయిస్తున్నామని చెబుతున్నారు. భామినిలో ఇటీవల నిర్వహించిన కమ్యూనిటీ పోలీస్‌ క్యాంప్‌లో జిల్లా ఎస్పీ ఏ.ఎన్‌.అమ్మిరెడ్డిని విద్యార్థి ఆరికి జీవన్‌ తన తండ్రితో కలిశాడు. ఆదుకోవాలని మొరపెట్టుకొన్నారు. 

చదువుకోవాలని ఉంది..
తనకు ఉన్నత చదువులు చదవాలని ఆశగా ఉందని కిడ్నీ బాధితుడు ఆరికి జీవన్‌ చెబుతున్నాడు. తన వ్యాధి నయం కావాలంటే కిడ్నీమార్పిడి ఒక్కటే మార్గమని కన్నీటి పర్యంతమవుతున్నాడు. దాతలు సాయం చేయదలిస్తే తన తండ్రి ఆరికి డిలో (ఫోన్‌: 9493510191)ను సంప్రదించాలని జగన్‌ వేడుకుంటున్నాడు. ఆన్‌లైన్‌ ద్వారా సాయం అందించాలనుకునే వారు ఆంధ్రాబ్యాంక్, కొత్తూరు బ్రాంచ్, అకౌంట్‌ నంబర్‌–174710100109645 ద్వారా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top