ఇల్లూ పోయె.. సబ్సిడీ బిల్లూ రాకపోయె

Bills Pending In NTR Housing Scheme in PSR Nellore - Sakshi

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల అవస్థలు

మూడు నెలలుగా     ఒక్క రూపాయి రాక తంటాలు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వ తీరుతో అవస్థలు తప్పడం లేదు. నెల్లూరు నగరంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేద వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా సబ్సిడీ అందిస్తోందని తెలిసి చాలా మంది ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తమ పాత ఇళ్లను కూలగొట్టుకుని గృహ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఉన్న ఇళ్లను కూల్చివేసుకుని ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మూడు నెలలుగా ఒక్క రూపాయి రాక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో అర్బన్‌ ప్రాంతాల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2.5 లక్షలు సబ్సిడీ కింద ఇవాల్సిఉంది. ఈ సబ్సిడీ పలు దఫాలుగా అందించాలి. మొదట లబ్ధిదారుడు బేస్‌మెంట్‌ వరకు నిర్మించుకుంటే రూ.25 వేలు, రూఫ్‌ లెవల్‌కు రూ.75 వేలు, శ్లాబ్‌ వేస్తే రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయితే మిగిలిన రూ.50 వేలు ఇవ్వాల్సిఉంది. బ్యాంకు నుంచి రుణంగా రూ.75 వేలు, లబ్ధిదారుడు రూ.25 వేలు భరించాల్సిఉంటుంది. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని 54వ డివిజన్‌ కు చెందిన పేదవారు పాత పూరిళ్లను, రేకుల ఇళ్లను పగులగొట్టుకుని అప్పు తెచ్చి మరీ బేస్‌మెంట్‌ వరకు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే నిర్మించి 3 నెలలు కావస్తున్నా హౌసింగ్‌శాఖకు సంబంధించిన అధికారులు బేస్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు తీసుకోకపోవడంతో మొదటి విడతగా లబ్ధిదారులకు అందాల్సిన రూ.25 వేలు రాక ఇబ్బందులు పడుతున్నారు.

రేకుల చాటున నివసిస్తున్నాం
స్థలం ఉండి ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ఇంటికి రుణం ఇస్తుందని చెబితే కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేశాను. అ ప్పు తెచ్చి బేస్మెంట్‌ వరకు నిర్మించి మూడు నెలలు కావస్తున్నా ఫొటోలు తీయలేదు. ఫొటోలు తీస్తే రూ.25 వేలు ఇస్తారంట. ప్రస్తుతం ఇల్లు లేక మూడు నెలల నుంచి రేకుల చాటున రోడ్డుపై నివసిస్తున్నాం. –ఎస్‌.కె.బీబీజాన్‌.

54వ డివిజన్, జనార్దన్‌రెడ్డి కాలనీ, నెల్లూరుఇంటి కాగితాలు సరిగా లేవని  బిల్లు ఇవ్వలేదుఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకుని మూడు నెలలయింది. సొంత డబ్బులతో బేస్‌మెంట్‌ వరకు నిర్మించుకున్నా. బిల్లులు రాలేదు. ఇదేమని అడిగితే ఇంటికి సంబం ధించి కాగితాలు సరిగా లేవని, వాటిని తేస్తే చూస్తామని ఇప్పు డు చెబుతున్నారు.
– టి.సుప్రియ, జనార్దన్‌రెడ్డి కాలనీ, నెల్లూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top