అవినీతి కొండంత..వసూలు గోరంత | Billion rupees funds by the wayside | Sakshi
Sakshi News home page

అవినీతి కొండంత..వసూలు గోరంత

Mar 25 2016 2:48 AM | Updated on Oct 8 2018 7:16 PM

అవినీతి కొండంత..వసూలు గోరంత - Sakshi

అవినీతి కొండంత..వసూలు గోరంత

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొందరు కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు.

కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి
సామాజిక తనిఖీల్లో తేలిన నిజం
వసూలుపై యంత్రాంగం మీనమేషాలు

 
సాక్షి, కర్నూలు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొందరు  కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపి జేబులు నింపేసుకున్నారు. కొందరు నాయకులు, అధికారులు, సిబ్బంది ఏకమై దోచేశారు. ప్రజాధనం పరుల పాలైందని సాక్షాత్తూ సామాజిక తనిఖీల్లోనే వెల్లడయింది. ఎక్కడ.. ఎవరు.. ఎంత అక్రమాలకు పాల్పడ్డారన్నది నివేదికల సహా నిగ్గు తేల్చారు. అయినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎనిమిదేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా తీవ్రంగా పరిగణించకపోవడం గమనార్హం. ఇంత వరకు ఏడు విడతల సామాజిక తనిఖీలు జరిగాయి.

ఇందులో 12.59 కోట్ల మేర ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని అధికారికంగా తేలింది. ఇంత వరకు వసూలు చేసింది రూ. 3.20 కోట్లకు మించలేదు. మిగిలిన నిధులు రాబట్టడంలో అధికారులు తీవ్రంగా విఫలమవుతున్నారు. ఉపాధి హామీ పథకం 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి జిల్లాలో అమలవుతోంది. ఇంత వరకు రూ. 3293.35 కోట్ల విలువైన 2,84,385 లక్షల పనులు పూర్తి చేశారు. ఇందులో కూలీల వేతనాల కోసమే రూ. 1,435.40 కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. ఈ ఏడాది 1,230.20 కోట్ల విలువైన పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇంత వరకు రూ. 154.45 కోట్ల విలువైన 13,121 పనులు పూర్తి చేసినట్లు నివేదికల్లో చూపుతున్నారు. పేదలకు ‘ఉపాధి’ చూపాల్సిన పథకం కొంత మందికి వరంగా మారింది.

 నిగ్గుతేలుతున్నా!
 పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 16.78 కోట్లు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. అయితే డ్వామా అధికారులు మాత్రం రూ. 12.59 కోట్లు అవినీతి జరిగినట్లు ఆమోదించారు. ఎనిమిదేళ్లుగా అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉంది. చేసిన పనులపై ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చుతున్నారు. వాస్తవానికి సామాజిక తనిఖీల్లో తేలుతున్న అక్రమాలు అంతంతే. ఈ కొద్దిపాటి పరిశీలనలోనే ఇంత భారీ స్థాయిలో తేలితే.. పథకంలో పూర్తి స్థాయి అక్రమార్కులకు అంతే ఉండదన్న వాదన ఉంది. మరి ఇంత స్థాయిలో అవినీతి జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల నుంచి కార్యకర్తల వరకు భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
 అక్రమాలకు అంతేలేదు
 జిల్లాలో ఇప్పటి వరకు రూ. 12.59 కోట్ల ఉపాధి నిధులు పక్కదారి పట్టించారని సామాజిక తనిఖీల్లో గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్న 12 మంది ఎంపీడీఓలపై, 8 మంది ఏపీఓలు, 18 మంది ఈసీలు, 124 మంది టెక్నికల్ అసిస్టెంట్లపై చర్యలకు సిఫార్సు చేశారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా యంత్రాంగం మిన్నకుండిపోయింది. నిధుల వసూలు కూడా నిలిచిపోయింది. ఇప్పటి వరకు రూ. 3.20 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన నిధుల వసూలు మాత్రం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement