
స్వామివారి దర్శనానికి వైఎస్ జగన్ వెళ్తున్న సందర్భంలో సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తారనే సమాచారం అందింది.
సాక్షి, శ్రీకాకుళం : ఇప్పటివరకు దొరికిన ఆధారాలతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం వేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆధారాలు దొరకని అవినీతి ఇంకా లక్షలకోట్లలో ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ఐదేళ్ల బడ్జెట్‌ని మించి టీడీపీ నేతలు దోపిడి చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సహజవనరులైన మట్టి, ఇసుకను కూడా మిగల్చకుండా అమ్ముకున్నారని భూమన నిప్పులు చెరిగారు. పోలవరం, రాజధాని భూముల కేటాయింపులో అంతులేని అక్రమాలు జరిగాయన్నారు. (నాలుగున్నరేళ్లలో చంద్రబాబు దోపిడీ 6.17 లక్షల కోట్లు)
తిరుమలలో ఆధ్యాత్మిక దాడికి టీడీపీ కుట్ర
'వైఎస్ జగన్ సుధీర్ఘ పాదయాత్ర 9న ముగియబోతుంది. పాదయాత్ర ముందు జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయలుదేరారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రజాసంకల్పయాత్ర గొప్ప అధ్యాయంగా మిగిలిపోతుంది. కోటిన్నర మందితో ముఖాముఖి కలిశారు. 9న పాదయాత్ర ముగిసిన వెంటనే ఇచ్చాపురం నుంచి నేరుగా వైఎస్ జగన్ తిరుపతి చేరుకుని కాలినడకన స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తూ అనేక నిందారోపణలు చేస్తున్నారు. పోరాటాల పార్టీగా వైఎస్సార్‌సీపీని జగన్ రూపుదిద్దారు. పాదయాత్ర గురించి చంద్రబాబు, మంత్రులు అనేక ఆరోపణలు చేశారు. అయినా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావొస్తుంది. స్వామివారి దర్శనానికి జగన్ వెళ్తున్న సందర్భంలో సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తారు అనే సమాచారం అందింది.
స్వామివారి దర్శనానికి వెళ్లే సమయంలో హిందుత్వ దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం మాకు వచ్చింది. టీడీపీ కార్యకర్తలతో జై జగన్ నినాదాలు చేపించి, పార్టీ జెండాలు విసిరి నెపం మాపై నెట్టాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి మొక్కులు చెల్లించడానికి వెళ్తుంటే జగన్‌పై ఆధ్యాత్మిక దాడి చేయాలన్న కుట్ర జరుగుతోందని చెప్తున్నాం. చంద్రబాబు చేయబోతున్న కుట్ర ఇది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో స్వామివారికి ఏటా పట్టువస్త్రాలు సమర్పించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కూడా విఫలమైందని ఇప్పుడు హైందవ ద్వేషిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. హిందువులు అందరికి ముందే కుట్ర గురించి చెప్తున్నాం. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాల గురించి ముందే చెప్తున్నాం. చంద్రబాబుకి దేవుడు కూడా రాజకీయ అవసరమే. వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంద్రబాబు కుట్రలు ఎప్పటికప్పుడు ఎండగడతాం' అని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.