శ్రీకృష్ణాలయంలో ‘రామయ్య’కు రాపత్తు సేవ | Bhadrachalam Sri Sita Ramachandra swamy Temple | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణాలయంలో ‘రామయ్య’కు రాపత్తు సేవ

Jan 14 2014 1:50 AM | Updated on Nov 6 2018 6:01 PM

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా వైకుంఠ రాముడికి సోమవారం స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో రాపత్తుసేవను ఘనంగా నిర్వహించారు.

భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా వైకుంఠ రాముడికి సోమవారం స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో రాపత్తుసేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేకంగా కృష్ణాలంకరణ చేశారు. పల్లకిలో స్వామి వారిని కొలువుదీర్చి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మహిళల కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియం వద్దనున్న ఆలయానికి తీసుకొచ్చారు.
 
  దారి పొడవునా భక్తులు స్వామి వారికి హారతి ఇస్తూ స్వాగతం పలికారు. కృష్ణాలయంలో స్వామి వారికి విష్వక్సేణ పూజ, పుణ్యాహవచనం, కృష్ణా అష్టోత్తర నామార్చన గావించారు. శేషనాగుపడగపై నాట్యమాడుతూ దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారిని తాతగుడి సెంటర్ మీదుగా ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కాగా, కృష్ణాలయంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాలయ విద్యార్థులు శ్రీకృష్ణుడు, బలరాముడు, భక్తుడు వేషధారణలో చేసిన శాస్త్రీయ నృత్యం పలువురిని అలంరించాయి. ఎమ్మెల్యే కుంజా సత్యవతి కళాకారులను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రామాలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఆర్‌డీవో కాసా వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, పట్టణ ఎస్సై ఎం. అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement