‘భవ్య బాసర’ దిశగా.. | Basara Temple Development Works Begin: Telangana | Sakshi
Sakshi News home page

‘భవ్య బాసర’ దిశగా..

Apr 5 2026 1:00 AM | Updated on Apr 5 2026 1:00 AM

Basara Temple Development Works Begin: Telangana

జ్ఞాన సరస్వతీదేవి కోవెల అభివృద్ధి 

వేములవాడ, భద్రాచలం తరహాలో పనులు 

రెండున్నర రెట్లు పెరగనున్న ఆలయ ప్రాంగణం 

నలువైపులా రాజగోపురాలు, నాలుగు మాడవీధుల నిర్మాణం

నిర్మల్‌: తొలి అక్షరాలను దిద్దించే చదువుల తల్లికి అద్భుతమైన ఆలయం నిర్మాణం కానుంది. రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలో బాసర జ్ఞాన సరస్వతీదేవి కోవెలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నూతన గర్భాలయం, అర్ధమండపం, అనివేటి మండప నిర్మాణాలను కృష్ణశిలలతో చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నదాని కంటే రెండున్నర రెట్లు పెంచనున్నారు. నలువైపులా రాజగోపురాలతో ద్వారాలను నిర్మిస్తారు. ఉత్తరం వైపు తొమ్మిది అంతస్తులతో, మిగిలిన మూడు దిక్కుల్లో ఏడు అంతస్తులతో రాజగోపురాలు నిర్మితం కానున్నాయి. ఆలయానికి నలుదిక్కులా దాదాపు 33 అడుగుల వెడల్పుతో నాలుగు మాడవీధులు నిర్మించనున్నారు.

సుమారు 7 వేల అడుగులతో దాదాపు 6 వేల మంది భక్తులకు అనువుగా క్యూకాంప్లెక్స్‌లు, టాయిలెట్లు, ఫుడ్‌స్టాల్స్‌.. ఇలా అన్నివసతులు సమకూర్చనున్నారు. ఇవేకాక దాదాపు 200 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యానమందిరం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న ప్రసాద పంపిణీ కేంద్రం స్థానంలో 20 వేల అడుగుల విస్తీర్ణంలో ప్రసాద పంపిణీ కేంద్రం, నూతన వంటశాల, భోజనశాలను నిర్మించనున్నారు. ఆలయానికి ఈశాన్యాన నూతన కోనేరు నిర్మాణం, దేవాలయానికి వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్, సోలార్‌ విద్యుత్, ఆహ్లాదకర వాతావరణం కోసం పుష్పవనాలను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement