అమర్‌ ప్రసంగం అదుర్స్‌

Best Political Speech By Gudivada-Amarnath-Reddy In AP  Assembly - Sakshi

సాక్షి, అనకాపల్లి(విశాఖపట్నం) : విశాఖకేంద్రంగా ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు. మంగళవారం అసెంబ్లీలో గుడివాడ అమర్‌నాథ్‌ తనదైన శైలిలో 9.35 నిమిషాలు మాట్లాడి ఐటీ ప్రాధాన్యతలు, గత ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో   వివరించారు. విశాఖకేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో ఐటీహబ్‌ ఏర్పాటు కావాలని, 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు  ప్రారంభించారని గుర్తు చేశారు.

అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.   చంద్రబాబు హయాంలో జిల్లాకో ఐటెక్‌ సిటీ, ఎయిర్‌పోర్టు, పోర్టు నిర్మిస్తామని హామీలు గుప్పించి విశాఖలో ఎకో సిస్టమ్‌ బాగోలేదని, అంతర్జాతీయ విమానాశ్రయం లేదని పేర్కొనడం అందరూ గమనించారని తెలిపారు.  తెలంగాణలో ఐటీ మంత్రి పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తుండగా మనరాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి విదేశాలకు చెందిన కంపెనీ ప్రతినిధులతో ఏం మాట్లాడారో ఆయా కంపెనీల ప్రతినిధులకు ఏం అర్ధమైందో గానీ ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగలేదని తెలిపారు.  

ఐదేళ్లలో రాష్ట్రంలో 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 43 లక్షల మందికి ఉపాధి కల్పించామని గత ప్రభుత్వం రికార్డుల్లో పేర్కొందని తెలిపారు. కానీ వాస్తవ గణాంకాలు చూస్తే కేవలం 30 వేల మందికే ఉద్యోగాలు కల్పించినట్టుగా తేలిందన్నారు. 43 లక్షల ఉద్యోగాలు ఎక్కడ 30 వేల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు.  2017–18లో రూ.690 కోట్ల ఐటీ ఎక్స్‌పోర్ట్‌ జరగ్గా 2018–19 అది రూ. 570 కోట్లకు పడిపోయిందన్నారు.   18 శాతం ఐటీ ఎక్స్‌పోర్ట్‌ తగ్గినట్టు చెప్పారు.

గత ప్రభుత్వంలో ఐటీమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లోకేష్‌ విశాఖలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం కష్టమని చెప్పిన నెలరోజుల్లోనే లక్షమందికి ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొనడం బట్టీ ఆయన మాటల్లో ఏమేరకు వాస్తవా లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంలో   ఆడంబరాలు, హడావుడి చేయడానికే మంత్రులు పరిమితమయ్యారని చెప్పా రు. బోగస్‌ కంపెనీలను సృష్టించారని, తద్వారా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నించారన్నారు.

డీటీపీ ఆపరేటర్లు, మీసేవాకేంద్రాల నిర్వాహకులతో ఫొటోలు దిగి, ఐటీ సంస్థల అధికా రులంటూ పేర్కొంటూ  గత ప్రభుత్వం పబ్బం గడుపుకొందన్నారు.  సెల్‌ఫోన్‌ను, కంప్యూటర్‌ను కనిపెట్టానని చెప్పుకొన్న వ్యక్తి గత ప్రభుత్వంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఎంతో సంబరపడ్డామని, కానీ వాస్తవాలు చూస్తే దీనికి విరుద్ధంగా ఉన్నాయన్నారు.  

తన తాతగారు, తండ్రిగారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా వ్యవహరించారని, తనకు కూడా ఎమ్మెల్యేగా  సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించారని అమర్‌నాథ్‌ చెప్పారు.  విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహకరించాలని కోరారు.  అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మాజీ  ముఖ్య మంత్రి చంద్రబాబుపైన, గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్‌పైన సంధించిన వ్యంగ్యాస్త్రాలను  అసెంబ్లీ లో  సభ్యులు ఆసక్తిగా విన్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top