వృద్ధుడి సజీవదహనం | Became a permanent sleep the sleep of the old man | Sakshi
Sakshi News home page

వృద్ధుడి సజీవదహనం

Nov 5 2013 1:47 AM | Updated on Sep 2 2017 12:16 AM

ఆ నిద్ర ఆ వృద్ధుడికి శాశ్వత నిద్ర అయ్యింది. భార్య, కుమార్తె, మనవళ్లతో కలసి రాత్రి ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ...

గూడూరు, న్యూస్‌లైన్ : ఆ నిద్ర ఆ వృద్ధుడికి శాశ్వత నిద్ర అయ్యింది. భార్య, కుమార్తె, మనవళ్లతో కలసి రాత్రి ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేసి నిద్రపోయిన అతను తెల్లారేసరికి మసిబొగ్గుగా మిగిలాడు. గూడూరు మండలం మల్లవోలు పంచాయతీ పరిధిలోని మల్లవోలుగరువు గ్రామంలో సోమవారం వేకువజామున జరిగిన ఘటన గ్రామంలో విషాదం నింపింది.

గ్రామానికి చెందిన పేరుమాని వెంకటేశ్వర్లు (62) తన గుడిసెలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో బయటికి రాలేక అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. మంటల వేడికి తట్టుకోలేక, బయటకు రాలేక అతను హృదయవిదారకంగా పెట్టిన కేకలు స్థానికులతో కంటతడి పెట్టించాయి. పండ్లు, ఆకుకూరలు కొని గ్రామాల్లో తిరుగుతూ అమ్మకాలు సాగించే అతని భార్య సుబ్బులు రోజూమాదిరిగా వేకువజామున నాలుగు గంటలకే మచిలీపట్నం వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది.
 
కుమార్తె ఇల్లు కూడా దగ్ధం...

 ఈ ఘటనలో పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు కుమార్తె సిరివెళ్ల గంటమ్మ ఇల్లు కూడా దగ్ధమైంది. ఆమె భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలసి తల్లిదండ్రుల వద్దకే వచ్చి పక్కనే తాటాకిల్లు వేసుకుని నివసిస్తోంది. మంటల వేడికి గంటమ్మ, ఆమె కుమారులు నాగరాజు, హనుమంతు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. తండ్రి గుడిసె కూడా మంటల్లో కాలిపోతుండటం చూసి తేరుకున్న గంటమ్మ తండ్రిని రక్షించే ప్రయత్నం చేసేలోపే గుడిసె కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. నులకమంచంపై పడుకుని మంటల తాకిడికి గావుకేకలు పెడుతూ వెంకటేశ్వర్లు మృతిచెందాడు.
 
కుమార్తె అపస్మారక స్థితిలో...

 రాత్రి 10 గంటల వరకు తల్లిదండ్రులతో కుమార్తె, మనుమళ్లు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. తెల్లవారుజామునే గంటల వ్యవధిలో ఇల్లు తగులబడటంతో పాటు తండ్రి మంటల్లో కాలిపోవటం చూసి తట్టుకోలేక కుమార్తె గంటమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమవ్వటంతో ఆమె, ఆమె కుమారులు కట్టుబట్టలతో మిగిలారు. ఆమెను 108 అంబులెన్స్‌లో బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వ్యాపారం కోసం వెళ్లిన సుబ్బులుకు ప్రమాదవార్త తెలియటంతో హుటాహుటిన ఇంటికి తరలివచ్చింది.

మంటల్లో కాలి విగతజీవుడైన భర్తను చూసి కన్నీరుమున్నీరుగా విలపించటం స్థానికులను కలచివేసింది. మచిలీపట్నం నుంచి అగ్నిమాపక శకటం వచ్చేలోపే నష్టం జరిగిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై సత్యరమేష్, తహశీల్దార్ స్వర్ణమేరి, ఆర్‌ఐ నరసింహారావు, వీఆర్వో భాస్కర్ ఘటనాస్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతుని భార్య సుబ్బులు ఇచ్చిన వివరాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని మచిలీపట్నం తరలించారు. సహాయ ఏర్పాట్లను మల్లవోలు పీఏసీఎస్ డెరైక్టర్ పర్ణం పెదబాబు, గ్రామపెద్దలు ముదినేని రాధాకృష్ణ, ముదినేని ఏడుకొండలు తదితరులు పర్యవేక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement