breaking news
Venkatesvarlu
-
వృద్ధుడి సజీవదహనం
గూడూరు, న్యూస్‌లైన్ : ఆ నిద్ర ఆ వృద్ధుడికి శాశ్వత నిద్ర అయ్యింది. భార్య, కుమార్తె, మనవళ్లతో కలసి రాత్రి ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేసి నిద్రపోయిన అతను తెల్లారేసరికి మసిబొగ్గుగా మిగిలాడు. గూడూరు మండలం మల్లవోలు పంచాయతీ పరిధిలోని మల్లవోలుగరువు గ్రామంలో సోమవారం వేకువజామున జరిగిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన పేరుమాని వెంకటేశ్వర్లు (62) తన గుడిసెలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో బయటికి రాలేక అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. మంటల వేడికి తట్టుకోలేక, బయటకు రాలేక అతను హృదయవిదారకంగా పెట్టిన కేకలు స్థానికులతో కంటతడి పెట్టించాయి. పండ్లు, ఆకుకూరలు కొని గ్రామాల్లో తిరుగుతూ అమ్మకాలు సాగించే అతని భార్య సుబ్బులు రోజూమాదిరిగా వేకువజామున నాలుగు గంటలకే మచిలీపట్నం వెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. కుమార్తె ఇల్లు కూడా దగ్ధం... ఈ ఘటనలో పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు కుమార్తె సిరివెళ్ల గంటమ్మ ఇల్లు కూడా దగ్ధమైంది. ఆమె భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలసి తల్లిదండ్రుల వద్దకే వచ్చి పక్కనే తాటాకిల్లు వేసుకుని నివసిస్తోంది. మంటల వేడికి గంటమ్మ, ఆమె కుమారులు నాగరాజు, హనుమంతు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. తండ్రి గుడిసె కూడా మంటల్లో కాలిపోతుండటం చూసి తేరుకున్న గంటమ్మ తండ్రిని రక్షించే ప్రయత్నం చేసేలోపే గుడిసె కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. నులకమంచంపై పడుకుని మంటల తాకిడికి గావుకేకలు పెడుతూ వెంకటేశ్వర్లు మృతిచెందాడు. కుమార్తె అపస్మారక స్థితిలో... రాత్రి 10 గంటల వరకు తల్లిదండ్రులతో కుమార్తె, మనుమళ్లు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. తెల్లవారుజామునే గంటల వ్యవధిలో ఇల్లు తగులబడటంతో పాటు తండ్రి మంటల్లో కాలిపోవటం చూసి తట్టుకోలేక కుమార్తె గంటమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమవ్వటంతో ఆమె, ఆమె కుమారులు కట్టుబట్టలతో మిగిలారు. ఆమెను 108 అంబులెన్స్‌లో బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వ్యాపారం కోసం వెళ్లిన సుబ్బులుకు ప్రమాదవార్త తెలియటంతో హుటాహుటిన ఇంటికి తరలివచ్చింది. మంటల్లో కాలి విగతజీవుడైన భర్తను చూసి కన్నీరుమున్నీరుగా విలపించటం స్థానికులను కలచివేసింది. మచిలీపట్నం నుంచి అగ్నిమాపక శకటం వచ్చేలోపే నష్టం జరిగిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై సత్యరమేష్, తహశీల్దార్ స్వర్ణమేరి, ఆర్ఐ నరసింహారావు, వీఆర్వో భాస్కర్ ఘటనాస్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతుని భార్య సుబ్బులు ఇచ్చిన వివరాల ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని మచిలీపట్నం తరలించారు. సహాయ ఏర్పాట్లను మల్లవోలు పీఏసీఎస్ డెరైక్టర్ పర్ణం పెదబాబు, గ్రామపెద్దలు ముదినేని రాధాకృష్ణ, ముదినేని ఏడుకొండలు తదితరులు పర్యవేక్షించారు. -
3నుంచి సీపీఐ సామూహిక దీక్షలు
నయీంనగర్, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో సామూహిక సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ధి వెంకటేశ్వర్లు తెలిపారు. హన్మకొండ బాలసముద్రం లోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుయచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అం తేకాకుండా ఈనెల 10న అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. కాగా, తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రారంభించి 60 రోజులు దాటినా ఇప్పటి వరకు కేబినెట్ ముం దు నోట్ పెట్టకుండా జాప్యం చేడయం తగదన్నారు. సున్నితమైన అంశంపై ఇరువర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలగించడంతో పాటు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలని వెంకటేశ్వర్లు కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ సమితి పిలుపు మేరకు సామూహిక సత్యాగ్రహ దీక్షలను ఈనెల 3న ములుగు, మహబూబాబాద్, 4న జనగామ, నర్సంపేట డివిజన్లలో, 5న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్నామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే పోతరాజు సారయ్యతో పాటు సీపీఐ నాయకులు మేకల రవి, మడత కాళిదాసు, టి.సత్యం, మోతె లింగారెడ్డి పాల్గొన్నారు.