మంత్రి లేకుండానే... | Basavaraju Saraiah tour in adilabad district | Sakshi
Sakshi News home page

మంత్రి లేకుండానే...

Nov 25 2013 2:50 AM | Updated on Sep 2 2017 12:57 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి ఉండగా అదేం చేయకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా ఇన్‌చార్జి మంత్రి బస్వరాజు సారయ్య ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి ఉండగా అదేం చేయకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన స్థానంలో అధికారులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఈ తతంగాన్ని పూర్తి చేశారు.
 
 ఇదీ సంగతి
 మంత్రి బస్వరాజు సారయ్య శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలో అధికారికంగా పర్యటన చేపట్టేందుకు శనివారం జిల్లాకు వచ్చారు. తన పర్యటనలో మొదటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి ఉట్నూర్‌లో బస చేశారు. ఆదివారం ఆయన ఉట్నూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా శనివారం రాత్రే ఉట్నూర్ నుంచి వెళ్లిపోవడంతో సంబంధిత పనులుకు అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయాల్సి వచ్చింది. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జునియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ అహ్మద్‌బాబు, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఎంపీ రాథోడ్మ్రేశ్, స్థానిక ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ హాజరయ్యారు. రూ.4 కోట్ల 60 లక్షల 95 వేల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
 
 పథకాలందేలా చర్యలు
 కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ఏజెన్సీ గ్రామాల ప్రజలకు అందేలా తగు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం ఉట్నూర్‌లో మూడు రూ.కోట్లతో సమీకృత వసతి గృహ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని పలు గిరిజన గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు రూ.80.95 లక్షలు, ఉట్నూర్‌లో వివిధ పనులకు రూ.33.75 లక్షలు, జూనియర్ కళాశాలకు రూ.46.25 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. గిరిజన గ్రామాలకు సురక్షిత నీరు అందించేందుకు కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద చేపట్టిన మొదటి దశ పనులు జనవరిలోగా పూర్తి చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2012-13 ఏజెన్సీ డీఎస్సీ రాసిన గిరిజన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందించేందుకు ఇప్పటికి ఆరుసార్లు అవకాశం కల్పించామని, అయినా అభ్యర్థులు వారి ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని పేర్కొన్నారు.
 
 ఉపాధ్యాయులను నియమించాలి
 అనంతరం ఎంపీ రాథోడ్ రమేశ్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం కోట్లాది రూపాయలతో మౌళిక వసతులు కల్పిస్తున్నా నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత ఉందని అన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సిన మంత్రి చేయకుండానే వెళ్లిపోవడం సరికాదని అన్నారు. మంత్రి ఏజెన్సీ గిరిజన సమస్యలపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్డీవో రాంచంద్రయ్య, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, తహశీల్దార్ చిత్రు, ఇన్‌చార్జి ఎంపీడీవో రమాకాంత్‌రావు, ఉట్నూర్, లక్కారం, వాడ్‌గాం సర్పంచులు బొంత ఆశారెడ్డి, మర్సకోల తిరుపతి, గాంధారి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి హరినాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ హైమద్, టీడీపీ మండల అధ్యక్షుడు సాడిగె రాజేశ్వర్, నాయకులు తుకారం, చంద్రయ్య, రవి, పూజారి శివాజీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement