రేషన్‌షాపుల ద్వారా శానిటరీ నేప్‌కిన్స్‌ విక్రయం

Sanitary Napkins by Ration Shops : CHANDRA BABU - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడి

జమ్మాదేవిపేట గ్రామదర్శినిలో పలు వరాలు

దళితవాడను విస్మరించిన వైనం

లక్కవరపుకోట(శృంగవరపుకోట) : రేషన్‌ డిపోల ద్వారా త్వరలో మహిళలకోసం శానిటరీ నేప్‌కిన్స్‌ అమ్మకాలు చేపట్టనున్నామనీ... ఇందుకోసం రూ. 120కోట్లు కేటాయిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో సోమవారం గ్రామదర్శిని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వీధుల్లో పర్యటించి పింఛన్, రేషన్‌ సక్రమంగా అందుతున్నదీ లేనిదీ అడిగితెలుసుకున్నారు.

తూనికల్లో తేడాలుంటున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రావి, వేప మొక్కలను నాటారు. అనంతరం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రచ్చబండపై నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ రేషన్‌ షాపుల ద్వారా త్వరలో ఆడవారికి సంబంధించిన నేప్‌కిన్స్‌ అందజేస్తాం అమ్మకాలు చేస్తావా అంటూ డీలర్‌ను ప్రశ్నించారు. చంద్రన్నబీమా, సాధికార మిత్ర, ఉపాధిహామీ పథకాల వివరాలపై చర్ఛించారు. సాధికార మిత్రలు ప్రభుత్వ పథకాలపై గ్రామంలో మరింతగా ప్రచారం చేయాలని సూచించారు. 

జమ్మాదేవిపేటకు వరాలు

గ్రామంలో గల రామాలయం పునర్నిర్మాణానికి రూ. 50లక్షలు, కల్యాణ మండపానికి రూ. 50లక్షలు, దళిత వాడలో అంబేడ్కర్‌ భవనానికి రూ. 15లక్షలు, బీసీ కాలనీలో సామాజిక భవనానికి రూ. 10లక్షలు, నంది కళ్లాలవద్ద సామాజిక భవనం నిర్మాణానికి రూ. 10లక్షలు, రంగాపురం–జమ్మాదేవిపేట గ్రామాల అనుసంధానానికి బీటీ రోడ్డు, ఇంటింటికి తాగునీటి కుళాయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

దళిత సర్పంచ్‌పై చిన్నచూపు

కాగా ముఖ్యమంత్రి కార్యక్రమం మొత్తం వైస్‌ సర్పంచ్‌ కొట్యాడ ఈశ్వరరావు అధ్యక్షతనే నిర్వహించారు. వాస్తవానికి దళిత కులానికి చెందిన మెయ్యి కన్నయ్య సర్పంచ్‌ అయినా ఆయన్ను సీఎం పట్టించుకోలేదు. గ్రామ సభలోకి కూడా ఆహ్వానించలేదు. ఇక సీఎం గ్రామ సందర్శనలో అన్ని వీధుల్లోనూ పర్యటించి చివరిలో దళిత వాడలో మాత్రం పర్యటించలేదు.

దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, విజయనగరం ఎంపీ ఆశోక్‌గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top