కబ్జా ‘రాజు’! | Bapiraji land mafia Allegations | Sakshi
Sakshi News home page

కబ్జా ‘రాజు’!

Apr 9 2014 12:42 AM | Updated on Sep 2 2017 5:45 AM

జిల్లా పరిషత్ టీడీపీ అభ్యర్థిగా ముళ్లపూడి బాపిరాజును ఎంపిక చేయటంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గొడవలు, గందరగోళాలతోపాటు భూకబ్జా

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పరిషత్ టీడీపీ  అభ్యర్థిగా ముళ్లపూడి బాపిరాజును ఎంపిక చేయటంపై ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గొడవలు, గందరగోళాలతోపాటు భూకబ్జా ఆరోపణలున్న వ్యక్తిని జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎలా ప్రకటించారని ఆ పార్టీ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. నల్లజర్లకు చెందిన ముళ్లపూడి బాపిరాజు టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని చూసినా ఆయనకు సీటు దక్కని పరిస్థితి ఏర్పడింది. 
 
 ఎమ్మె ల్యే సీటు ఇవ్వలేదు కాబట్టి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వం ఇవ్వాలని పార్టీలోని మాగంటి బాబు వర్గం అధిష్టానానికి ప్రతిపాదించి ఆమోదించేలా చేసింది. దీంతో తాడేపల్లిగూడెం మండలం నుంచి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన పోటీకి దిగారు.  జిల్లాలోని నాయకుల ఏకాభిప్రాయం మేరకు బాపిరాజును ైచైర్మన్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాల్సి ఉన్నా.. ఎవరితో చర్చించకుండానే నాలుగు రోజుల క్రితం ఆయనే అభ్యర్థి అని నాలుగురోజుల క్రితం ప్రకటించారు. దీనిపై పార్టీలో పెద్ద దుమారమే రేగింది. బాపిరాజు అరాచకాలతోపాటు ఆయనపై గల ఆరోపణల గురించి అధిష్టానానికి ఆయన వ్యతిరేకులు ఫిర్యాదులు కూడా పంపారు. 
 
 భూకబ్జా ఆరోపణలు
 ప్రధానంగా బాపిరాజుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లజర్లలో ఆర్‌ఎస్ నంబర్-554లో 99 సెంట్లలో ఉన్న మోతేవారి ధర్మసత్రాన్ని ఆయన ఆక్రమించుకుని అమ్మినట్లు తెలిసింది. దేవాదాయ 
 శాఖకు చెందిన ఆ భూమిని వేరే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించారు. ఇటీవలే దానిని రూ.4 కోట్లకు ఓ వ్యాపారికి అమ్మినట్లు సమాచారం. కోర్టులో కేసు ఉన్న భూ మిని అమ్మి ఎన్నికల ఖర్చుల కోసం వినియోగించినట్లు గుప్పుమంటోంది. నల్లజర్లలో మైనారిటీలకు చెందిన మూడు ఎకరాల భూమిని బకాయి ఉన్నారనే నెపంతో తమ పేర రిజిస్ట్రే షన్ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. నల్లజర్లలో ఇందిరమ్మ కాలనీ కోసం ప్రభుత్వం తీసుకుంటుందని మభ్యపెట్టి తక్కువ రేటుకు చిన్నరైతుల నుంచి భూములు సేకరించి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసినట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. 
 
 పోలీస్ రికార్డుల్లోనూ..
 మరోవైపు బాపిరాజుపై నల్లజర్ల, తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్లలో 18  కేసులున్నాయి. ఒక దశలో ఆయనపై నల్లజర్ల స్టేషన్‌లో రౌడీషీట్ తెరిచేందుకు అధికారులు సిద్ధపడ్డారు. బాపిరాజు ఎవరితోనే ఒత్తిడి చేయించటంతో వెనక్కుతగ్గారు. భూకబ్జాలు, సెటిల్‌మెం ట్లు, గొడవల్లో నిత్యం తలమునకలై ఉండే బాపిరాజు తనకు నచ్చకపోతే సొంత పార్టీవారినైనా ఇబ్బంది పెడతారనే విమర్శలున్నాయి. ఇందుకు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఉదాహరణ. ప్రస్తుతం వైఎస్సా ర్ సీపీలో ఉన్న ఆమె టీడీపీలో ఉన్నప్పుడు ప్రతిదానికి అవమానించి ఇబ్బంది పెట్టటమే లక్ష్యంగా బాపిరాజు పనిచేసేవారు. దళిత వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమెను ముప్పతిప్పలు పెట్టారనే విమర్శలున్నాయి.
 
 ఆమె టీడీపీని వీడటానికి బాపిరాజు కూడా ఓ కారణమనే అభియోగం ఉంది. టీడీపీ నేత ఇమ్మణ్ణి రాజేశ్వరిని కూడా ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనే కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడారు. అయిన దానికి  కాని దానికి అడ్డగోలుగా మాట్లాడే ఆయన నైజాన్ని పార్టీలోని చాలామం ది జీర్ణించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ పదవీ లేని సమయంలోనే ఇన్ని అరాచకాలు చేసిన బాపిరాజు జెడ్పీ చైర్మన్ అయితే తమ పరిస్థితి ఏమిటని ఆయన వల్ల బాధించబడిన వారు ఆందోళన చెందుతున్నారు. పార్టీలోని ఓ ప్రధాన వర్గం కూడా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. బాపిరాజును జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినా, తాము ఒప్పుకునేది లేదని ఆ పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విషయాలన్నింటినీ అధిష్టానానికి నివేదించి ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement