అయ్యన్న తీరుపై టీడీపీలోనే అభ్యంతరం | Ayyanna Patrudu Slams DCP Ranga Reddy In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అయ్యన్న తీరుపై టీడీపీలోనే అభ్యంతరం

Sep 25 2019 10:05 AM | Updated on Sep 25 2019 10:06 AM

Ayyanna Patrudu Slams DCP Ranga Reddy In Visakhapatnam - Sakshi

సాక్షి , విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి రేపుతున్నాయి. సహజంగానే నోటిదూకుడు ఉన్న అయ్యన్న ఇప్పుడు శృతిమించి.. ఇంకా చెప్పాలంటే పూర్తిగా స్థాయి దిగజారి చేస్తున్న వ్యాఖ్యలు, వాడుతున్న భాషను టీడీపీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ అర్బన్‌ కమిటీ అధ్యక్షుడు రెహమాన్, ఇతర నేతలతో కలిసి అయ్యన్న మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ప్రభుత్వానికి కులాలను ఆపాదిస్తూ విమర్శలు చేశారు. రౌడీ రాజ్యం.. కడపరెడ్లు.. అంటూ కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టేలా చేసిన  వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అన్ని వర్గాల నుంచి ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. 

డీసీపీ రంగారెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు
నగరంలో జూదం, వ్యభిచారం నియంత్రణలో భాగంగా నగర డిఫ్యూటీ పోలీస్‌ కమిషనర్‌ రంగారెడ్డి తనదైన శైలిలో కాస్త కరకుగానే చర్యలు చేపట్టారు. చిన్నాచితకా లాడ్జీలతో పాటు పేరుమోసిన క్లబ్‌లపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలోనే వాల్తేరు క్లబ్‌లో కూడా సోదాలు నిర్వహించారు. నిబంధనల మేరకే నడుచుకోవాలని స్పష్టం చేశారు. దీనిపైనే అయ్యన్న రాద్ధాంతం చేస్తూ డీసీపీని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడారు. క్లబ్‌ సభ్యులను డీసీపీ దూషించారంటూ పత్రికల్లో రాయలేని భాష వాడారు. బూతులు వల్లించడమే కాకుండా.. తిరిగి మేం ఆయన్ను కొట్ట లేమా.. అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అని కూడా చూడకుండా డీసీపీపై నోరు పారేసుకోవడం  వివాదా స్పదమవుతోంది. పోలీసువర్గాల్లో అయ్యన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

వాకౌట్‌ చేసిన సిటీ అధ్యక్షుడు రెహమాన్‌
అయ్యన్న దారుణమైన భాషను భరించలేక టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయ్యన్న మాట్లాడుతుండగానే వేదిక దిగి వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలుంటే నిరసన గళం విప్పొచ్చు.. కానీ ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదంటూ రెహమాన్‌ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌తో రెహమాన్‌కు పొసగడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. రెహమాన్‌ సిటీ అధ్యక్షుడిగా ఉన్నంతకాలంగా పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టనని శపథం పూనిన వాసుపల్లి అప్పటి నుంచి పార్టీ ఆఫీసుకు రాని విష యం కూడా బహిరంగ రహస్యమే.. వీటిపై విలేకరులు అయ్యన్నను ప్రశ్నించగా వారిద్దరిదీ భార్యాభర్తల గొడవలాంటిదని తేలిగ్గా తీసిపారేయడాన్ని రెహమాన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. 

అయ్యన్నకు ఎందుకింత అసహనం 
పుట్టిన రోజు నాడు లోకేష్‌ను నర్సీపట్నం పిలిచి.. ఘనంగా కార్యక్రమం చేసుకోవాలనుకోవాలని ఉవ్విళ్లూరిన అయ్యన్నకు.. సరిగ్గా అదే రోజు సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడు టీడీపీని వీడి ఊహించని షాక్‌ ఇచ్చారు. అయ్యన్న కంటే కూడా ఆయన కుమారుడి అరాచకాలను తట్టుకోలేక పార్టీ నుంచి బయటకి వచ్చేశారు. ఈ పరిణామాన్ని తీవ్ర అవమానంగా అయ్యన్న భావిస్తూ జీర్ణించుకోలేకున్నారు. అప్పటి నుంచి అసహనంతో ఊగిపోతున్న అయ్యన్న మంగళవారం అదుపు తప్పి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నగర, జిల్లావ్యాప్తంగా పార్టీకి మరింత చేటుచేస్తాయని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement