మాటల కోట్లు! | available government jobs Unemployment above Dodger | Sakshi
Sakshi News home page

మాటల కోట్లు!

Jan 30 2014 1:47 AM | Updated on Sep 2 2018 4:46 PM

బంకా.. బ్యాంకా.. షిప్పా..! ఏది కావాలంటే.. అది. ఇచ్చే సొమ్మును బట్టే ఉద్యోగం.. అని ఒక సినిమాలో నిరుద్యోగుల బృందాన్ని మాయ చేస్తా డో దళారీ

బంకా.. బ్యాంకా.. షిప్పా..! ఏది కావాలంటే.. అది. ఇచ్చే సొమ్మును బట్టే ఉద్యోగం.. అని ఒక సినిమాలో నిరుద్యోగుల బృందాన్ని మాయ చేస్తా డో దళారీ.. అదే సీన్ ఇప్పుడు రాజాంలో రిపీట్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఏ ఉద్యోగమైనా రెడీ.. ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పించేస్తా!.. అయితే దీనికి ఖర్చవుతుంది.. అంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులను మాయ చేసి ఉద్యోగాల మత్తులో ముం చి.. వేలకు వేలు దండుకున్నాడు. ముందస్తు హామీగా బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చేస్తున్నాడు. అతగాడిపై ఆశలు పెంచుకున్న అమాయకులు తమను ముంచేస్తున్నాడన్న విషయాన్ని గుర్తించడం లేదు. అదే ఆశతో అతని వివరాలు గానీ.. తమ పేర్లుగానీ చెప్పేందుకు ఇష్టపడటం లేదు.
 
 రాజాం రూరల్, న్యూస్‌లైన్: ఆలోచించకండి.. ఆలస్యం చేయకండి.. అవకాశాన్ని వదలుకోకండి.. అందుబాటులో బోలెడు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఉద్యోగాన్ని బట్టి రేటు.. ఎవరికి ఏ ఉద్యోగం కావాలంటే అది ఇప్పిస్తాం.. అంటూ ఓ ఘరానా మోసగాడు చేసిన ప్రచారం నిరుద్యోగులను ఆశల మత్తులో ముంచింది. ఆ మాయగాడికి కోట్లు కురిపించింది. నిరుద్యోగులను మోసగిస్తున్న ఉదంతాలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా.. ఉద్యోగాలపై ఉన్న ఆశతో పలువురు అతగాడి మాయమాటలు నమ్మి వేలకు వేలు చేతిలో పెట్టి ఏడాది కాలంగా అతని చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ ఉద్యోగాలు వస్తాయనే ఆశతోనే ఎదురుచూస్తున్నారు. పైగా తమ పేర్లు, వివరాలు చెబితే ఉద్యోగం రాదన్న భయంతో పెదవి విప్పడం లేదు. ఈ ఘరానా ఉదంతంపై ‘న్యూస్‌లైన్’ ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 
 
 మెడికల్ షాపు మూతపడటంతో..
 రాజాం మండలం సోపేరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గతంలో దుబాయ్‌లో ఉద్యోగం చేసి తిరిగి రాజాం వచ్చాడు. శ్రీకాకుళం రోడ్డులోని ప్రశాంతినగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ తనకు బంధువైన ఓ సీనియర్ డాక్టర్‌కు చెందిన నర్సింగ్‌హోమ్ వద్ద మెడికల్ షాపు నిర్వహించేవాడు. కొన్నాళ్ల క్రితం ఆ నర్సింగ్‌హోమ్ మూతపడింది. దాంతోపాటే మెడికల్ షాపునకు బిజినెస్ లేకుండాపోయింది. అప్పట్లో తన షాపులో పనిచేసిన సిబ్బందిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాలు దండీగా ఉన్నాయని, హైదరాబాద్‌లో తన స్నేహితుడు ఉద్యోగాలు వేయించడంలో దిట్ట అని ప్రచారం మొదలు పెట్టాడు. బ్యాంకు పీఓలు, ఫుడ్ కార్పొరేషన్, జుడీషియల్, హెల్త్ తదితర శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇతని మాటలో మాయలో పడి అనేక మంది నిరుద్యోగులు క్యూ కట్టారు. ఇలా రాజాంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన సుమారు 50 మంది యువకుల నుంచి రూ.2 కోట్ల వరకు దండుకున్నట్టు తెలిసింది. 
 
 హైదరాబాద్‌కు మారిన మకాం
 ఇలా దండుకున్న సొమ్ముతో ఇటీవల ఆ మోసగాడు కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కాగా డబ్బు ఇచ్చి ఏడాది అవుతున్నా ఉద్యోగాలు రాకపోవడంతో కొంతమంది యువకులు అతన్ని కలిసి ప్రశ్నించడంతో వారిని మరింత నమ్మించడానికి ఇచ్చిన డబ్బులకు హామీగా తేదీలు వేయని చెక్కులు, బాండ్లు అందజేశాడు. అయితే ఈ చెక్కులపై పేర్కొన్న అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదని తెలుసుకొని మరింత ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కొంతమంది యువకులు హైదరాబాద్ వెళ్లి గట్టిగా నిలదీయడంతో అపాయింట్‌మెంట్ ఆర్డర్ల పేరుతో స్టాంపులు అతికించి, సీల్ చేసిన ఖాళీ కవర్లు వారి చేతిలో పెట్టాడు. ఇళ్లకు వచ్చి కవర్లు తెరిచి చూసి హతాశులయ్యారు. మళ్లీ హైదరాబద్ వెళ్లి నిలదీయగా మూడు వారాల సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఇంత జరిగినా ఆశ చావని నిరుద్యోగులు అతని గురించి బయటకు చెప్పడానికి గానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గానీ ఇష్టపడటం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement