శాసన మండలి తీరుపై అసెంబ్లీ తీవ్ర ఆగ్రహం

 Assembly Agitated Over Legislative Council Decision - Sakshi

మండలి చైర్మన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపాటు

ప్రజా ప్రయోజనాలకు మండలి విఘాతం కలిగించిందని ఆవేదన

పెద్దల సభ రాజకీయ పునరావాస కేంద్రమా?

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు అడ్డుపడే ప్రమాదం ఉందని రాజ్యాంగ నిపుణులు నాడే హెచ్చరించారు

శాసన మండలిని రద్దు చేయాలని ముక్తకంఠంతో సభ్యుల డిమాండ్‌

సోమవారం శాసనసభ సమావేశం

ఉమ్మడి సమావేశంతో వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించుకునే అవకాశం ఉన్నా సీఎం జగన్‌ గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారన్న డిప్యూటీ సీఎం బోస్‌

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన శాసనమండలి తీరుపై శాసనసభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైంధవ పాత్ర పోషించిన మండలి తీరు ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడింది. ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు, అవినీతిని రక్షించే వేదికగా మండలి వ్యవహరించడాన్ని తూర్పారబట్టింది. రాజ్యాంగ ధర్మం ప్రకారం వ్యవహరించాల్సిన చైర్మన్‌.. చంద్రబాబు రాజకీయ కుతంత్రంలో పావుగా మారడాన్ని తీవ్రంగా ఖండించింది. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఉద్దేశించిన బిల్లులను మండలి నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపడాన్ని గర్హించింది.(శ్రీరాముడి మాదిరిగానే జగన్‌కు జనం పట్టాభిషేకం)

విచక్షణాధికారాల ముసుగులో....
బిల్లులపై చర్చ సందర్భంగా శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలను శాసనసభ తీవ్రంగా పరిగణించింది. ఇదే అంశంపై అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో సభ్యులు సవివరంగా చర్చించారు. శానసమండలిలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన తీరును మంత్రులు, సభ్యులు ఖండించారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతంగా మారిన శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేయడం వారి ఆవేదనకు అద్దంపట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ దీనిపై చర్చను ప్రారంభిస్తూ మండలిలో జరిగిన పరిణామాలను సభకు వివరించారు. అనంతరం మంత్రులు, పలువురు సభ్యులు మాట్లాడుతూ మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిల్లుల రూపకల్పనలో సలహాలు, సూచనలు ఇచ్చేందుకే పరిమితం కావాలి్సన మండలి టీడీపీ కుటిల వ్యూహానికి వేదికగా మారిపోయిందని శాసనసభ ఆవేదన వెలిబుచి్చంది. తప్పు అని చెబుతూ మరీ మండలి చైర్మన్‌ విచక్షణాధికారాల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది.

రాజ్యాంగ నిపుణులు నాడే హెచ్చరించారు..
విధానపర నిర్ణయాలను చర్చించి  అభిప్రాయాలను తెలియజేసేందుకు ఉద్దేశించిన రూల్‌ 71ను మండలిలో దుర్వినియోగం చేశారని సభ్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం మోషన్‌ మూవ్‌ చేయనప్పుడు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన  ప్రభుత్వాలు పనిచేయకుండా శాసనమండలి అడ్డుపడే అవకాశం ఉందని రాజ్యాంగాన్ని రూపొందించిన సమయంలోనే ఎన్‌జీ రంగా లాంటి రాజ్యాంగ నిపుణులు హెచ్చరించిన విషయం శాసనసభలో చర్చ సందర్బంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రజాతీర్పును అపహాస్యం చేసే మండలి అవసరం ఉందా? అని ప్రశ్నించడం శాసనసభ ఎంత కలత చెందిందో తెలియజేస్తోంది. విచక్షణ లేనివారికి విచక్షణాధికారాలు ఉండకూడదని శాసన మండలి చైర్మన్‌ను ఉద్దేశించి శాసనసభ వ్యాఖ్యానించింది. అధికార పార్టీకి శాసనమండలిలో తగినంత బలం లేనందున ఉభయ సభల సమావేశాన్ని నిర్వహిద్దామని తాము సూచించినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమ్మతించలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సభ దృష్టికి తెచ్చారు.

రాజకీయ పునరావాస కేంద్రమా?
రాష్ట్ర ప్రగతికి అడ్డంకిగా మారిన శాసనసమండలి రద్దు చేయాల్సిందేనని అందులోని సభ్యులుగా తాము కోరుతున్నానని మంత్రులు సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు విస్పష్టంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. సంక్షేమ, అభివృద్ధి విధానాలకు అడ్డుపడుతున్న శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని సభ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన, ఎస్సీ ఎస్టీల ప్రయోజనాల కోసం వేర్వేరు కమిషన్ల నియామకాలకు కూడా శాసనమండలి మోకాలడ్డటం ఏమిటని శాసనసభ నిలదీసింది. మూడు ప్రాంతాల అభివృద్ధికోసం ఉద్దేశించిన బిల్లులను అడ్డుకోవడం ద్వారా మండలిలో టీడీపీ సభ్యుల అరాచకం పరాకాష్టకు చేరిందని అభిప్రాయపడింది. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన లోకేశ్, ప్రజల తీర్పు కోరడానికి భయపడి నియోజకవర్గాన్ని వదిలి రాజధానిలో తలదాచుకున్న యనమల రామకృష్ణుడు, దాదాగిరి చేసే కొందరు టీడీపీ నేతలకు పునరావాస కేంద్రంగానే శాసనమండలి మిగిలిపోతోందని ఆవేదనగా వ్యాఖ్యానించింది.(ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?)

అసెంబ్లీలో తీర్మానం ద్వారా అవకాశం ఉన్నా..
శాసనసభలో చర్చ సందర్భంగా పలువురు సభ్యులు శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ శాసనమండలిలో బుధవారం చైర్మన్‌ ప్రకటనల వీడియో ప్రదర్శించారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధమంటూనే తన విచక్షణాధికారాలతో సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్‌ ప్రకటించడాన్ని ఆ వీడియో ద్వారా సభ్యులు, ఇతరులు వీక్షించారు. శాసనసభలో తీర్మానం ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ సభలను గౌరవిస్తూ తాము బిల్లులను పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. 51 శాతం ఓట్లు, 68 శాతం సీట్లు సాధించిన తమ ప్రభుత్వాన్ని నడపకుండా ప్రతిపక్షం రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. విద్యావంతులకు ప్రాతినిధ్యం కోసం శాసనమండలిని ఏర్పాటు చేశారని చెబుతూ ప్రస్తుతం శాసనసభలోనే పీహెచ్‌డీలు చేసినవారు, డాక్టర్లు, లాయర్లు, సివిల్‌ సర్వీస్‌ ఉన్నతాధికారులు, కళాకారులు, రైతులు, ఫారిన్‌ రిటర్న్‌ ప్రముఖులు తదితరులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏటా రూ.60 కోట్ల భారం అవసరమా?
విభజన అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రం శాసనమండలి కోసం ఏటా రూ.60 కోట్లు భరించడం అవసరమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వాదనకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల రీత్యా సరైన నిర్ణయం తీసుకునేందుకు శాసనసభను సోమవారం సమావేశపరచాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. అందుకు స్పీకర్‌ సమ్మతిస్తూ సోమవారం శాసనసభ సమావేశమవుతుందని ప్రకటించారు.

సోమవారం అసెంబ్లీ భేటీపై సర్వత్రా ఆసక్తి
శాసనమండలిలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం రాష్ట్రంలో రాజకీయంగా పలు కీలక పరిణామాలకు దారి తీసింది. మండలి అప్రజాస్వావిుక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజాప్రయోజాలకు విఘాతంగా మారిన శాసనమండలిని కొనసాగించడానికి వీల్లేదని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో శాసనమండలిపై ప్రత్యేకంగా చర్చించేందుకు సోమవారం శాసనసభ సమావేశం కానుంది. ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  

‘శాసన మండలిలో మాకు తగినంత బలం లేదని తెలుసు. కాబట్టి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశం నిర్వహించి వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసుకుందామని నాతోపాటు సీనియర్‌ మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సూచించాం. కానీ ఆయన అందుకు సమ్మతించలేదు. మనం ఫెయిర్‌గా (పారదర్శకంగా) వ్యవహరిద్దాం. వాళ్లు కూడా అలాగే ఉంటారని, నిబంధనల మేరకు వ్యవహరిస్తారేమో చూద్దాం. ఒకవేళ వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకుంటే అడ్డుకోనివ్వండి. మనం మాత్రం నిబంధనలను ఉల్లంఘించవద్దని ముఖ్యమంత్రి జగన్‌ మాతో చెప్పారు. అదీ ఆయన రాజనీతిజ్ఞత’ అని ఉప ముఖ్యమంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై గురువారం శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల కోసం కుతంత్రాలు చేసే నేతలున్న ఈ రోజుల్లో అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి గొప్ప రాజ నీతిజ్ఞతను ప్రదర్శించారని చెప్పారు.( చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!)

తప్పు చేశానంటూ విచక్షణ ఏమిటి?: సుభాష్‌ చంద్రబోస్‌

‘రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజు్ఞడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు. అలాంటి అరుదైన తీరును ముఖ్యమంత్రి జగన్‌ ప్రదర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన రాజకీయ స్వార్థంతో శాసనమండలిని దుర్వినియోగం చేశారు.  ప్రజలు గెలిపించిన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవడానికి మండలిని అడ్డుపెట్టుకోవడం ఏమిటి? నిబంధనల మేరకు వ్యవహరించాలని చైర్మన్‌ను ఎంతగా వేడుకున్నా ఆయన ఖాతరు చేయలేదు. తప్పు చేశానని అంగీకరించిన శాసన మండలి చైర్మన్‌కు విచక్షణాధికా>రాలను వినియోగించే హక్కు ఎక్కడ ఉంటుంది? విచక్షణతో వినియోగించాలి్సన అధికారాలను మండలి చైర్మన్‌ భ్రషు్టపట్టించారు. ఈ పరిస్థితుల్లో శాసన మండలిని కొనసాగించాలి్సన అవసరం ఉందా? మండలిని రద్దు చేయాలని అందులో సభ్యుడిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా’ 

చైర్మన్‌ తీరు దారుణం: బుగ్గన రాజేంద్రనాథ్‌

శాసనసభ సుదీర్ఘంగా చర్చించి ఆమోదించిన పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు విషయంలో మండలి చైర్మన్‌ అనుసరించిన తీరు దారుణంగా ఉందని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌  తప్పుబట్టారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన పరిపాలన – అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తన, చైర్మన్‌ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని గురువారం అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు.

తలెత్తి చంద్రబాబును చూశాక...
చైర్మన్‌ చివరిలో మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధ కలుగుతోంది. సెలక్ట్‌ కమిటీకి పంపడానికి వీల్లేదని చెప్పిన చైర్మన్‌ (పైకి తలెత్తి గ్యాలరీలో ఎదురుగా ఉన్న చంద్రబాబు వైపు చూసి...) ‘నాకున్న విచక్షణాధికారంతో బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించా’ అని ప్రకటించారు.

మేం గౌరవప్రదంగా ఆమోదించాక..
ప్రభుత్వ బిజినెస్‌ నిర్వహణకే ఈనెల 21, 22వ తేదీల్లో మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీఏసీలో ఆమోదించారు. అజెండాలో కూడా అదే ఉంది. టీడీపీ కుట్రపూరితంగా రూల్‌ 71 అంశాన్ని తెరపైకి తెచ్చింది. పాలకపక్షం తరఫున  గవర్నమెంట్‌ బిజినెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. తర్వాత రూల్‌ 71 కింద చర్చ కావాలంటే పెట్టుకోవాలని కోరాం. రూల్‌ 71 కింద మొదట చర్చించి తర్వాత బిల్లులపై చర్చ జరుపుదామంటే గౌరవప్రదంగా ఆమోదించాం. బిల్లులను మేం వివరించి ఆమోదించాలని కోరగానే సెలక్ట్‌ కమిటీని తెరపైకి తెచ్చారు.

అడ్డగించటం సరికాదు
300 పేజీల పుస్తకంలో వెతికి ఏదో ఒక రూల్‌ తెచ్చి చట్టాలు చేయడానికి సహకరించటానికి ఉపయోగిస్తున్నారా? మనం చేసేపనిని అడ్డగించటానికి ఉపయోగిస్తున్నారా? ఆలోచించాలి. చైర్మన్‌తో బీఏసీలో నేను, మంత్రులు  మాట్లాడాం. వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్స్‌తో మాట్లాడాం. రూల్‌ ఎలా ఉంటే అలా చేయాలని వారంతా సలహా ఇచ్చారు. నాలుగు గంటలసేపు ప్రతిపక్షనేత చంద్రబాబు చైర్మన్‌కు ఎదురుగా గ్యాలరీలో కూర్చొని ఆయన్ను ప్రభావితం చేశారు.

మండలిని రద్దు చేయండి: మంత్రి మోపిదేవి వెంకటరమణ

‘నేను మండలి సభ్యుడిని. నా ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల భవిష్యత్తే ముఖ్యం. ప్రజా ప్రయోజనాలను అడ్డుకుంటున్న శాసనమండలిని రద్దు చేయాలి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను శాసనమండలి అడ్డుకోవడం దురదృష్టకరం. మండలి తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవస్థ ఏమీ కాదు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైంది. మండలిలో బిల్లులను ఆమోదించి పంపించాలని కోరినప్పటికీ చైర్మన్‌ వినిపించుకోలేదు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి కొనసాగింది. చైర్మన్‌ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలా వ్యవహరించడం దురదృష్టకరం.

టీడీపీ ఆఫీస్‌లా మార్చారు: అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి

‘శాసన మండలిని చంద్రబాబు టీడీపీ కార్యాలయంలా మార్చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తెచ్చిన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం ఏమిటి? పెద్దల సభ అంటే పెద్ద మనసుతో వ్యవహరించాలిగానీ ఇలా కొందరి రాజకీయ ప్రయోజనాల సాధనంగా మారకూడదు. మండలి చైర్మన్‌ బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపించడానికి చంద్రబాబు ఒత్తిడే కారణం.

గ్యాలరీ’ డైరెక్షన్‌లో నడవడం ప్రమాదకరం: ధర్మాన ప్రసాదరావు

వేగంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పరుగును నిరోధించేందుకు చేసే కుట్రలను ఏమాత్రం సాగనివ్వరాదని సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ‘శాసనాలుచేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న శాసనసభకే ఉంటుంది. వ్యవస్థలను మేనేజ్‌ చేసినట్లుగా చంద్రబాబు మండలిని ప్రభావితం చేసి బిల్లులను అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారు. ఇలాంటి పరిస్థితి రాకూడదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గ్యాలరీలో ఉన్న వారి డైరెక్షన్‌ ప్రకారం నడిచే వ్యవస్థ ప్రమాదకరం. మండలి అవసరమే లేదని ఎన్జీ రంగా నాడే చెప్పారు. పరిగెడుతున్న ప్రభుత్వాన్ని నడవకుండా చేసే ప్రయత్నం తప్ప మరేమీ లేదని కామత్‌ 70 ఏళ్ల క్రితమే ఎగువ సభ గురించి ప్రస్తావించారు.  మండలి అవసరమా? లేదా? అనే అంశంపై సభలో సుదీర్ఘ చర్చ జరిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి్సన అవసరం ఉంది. (వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు)
 
దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: మంత్రి కన్నబాబు

శాసనమండలిలో బుధవారం జరిగిన దారుణమైన పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి్సన అవసరం ఉందని మంత్రి కన్నబాబు చెప్పారు. న్యాయమూర్తిగా ఉండాల్సిన మండలి చైర్మన్‌.. ‘నేను తప్పు చేస్తున్నా. నాతో తప్పు చేయిస్తున్నారు. రూల్స్‌ లేకపోయినా నా విచక్షణాధికారం ప్రకారం సెలక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించా’ అంటూ మరో తప్పు చేశారని కన్నబాబు పేర్కొన్నారు. ‘విచక్షణాధికారంపై చర్చ జరగాలి. ఉన్న విధానాలను, రూల్స్‌ను అతిక్రమించరాదు. రూల్స్‌ లేకుండా ఏదైనా సందిగ్ధత ఉన్నప్పుడే విచక్షణాధికారాల ప్రస్తావన వస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటే అది ప్రజలను అవమానించినట్లే. ప్రజాస్వామ్య లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు నాయుడు నాలుగు నెలల కాలాన్ని మింగేయగలరేమోగానీ అంతకుమించి ఏమీ చేయలేరు. తాగి వచ్చారంటూ మంత్రులను అవమానించిన యనమలపై చర్యలు తీసుకోవాలి. మరో వ్యక్తి మంత్రులకు బ్రీత్‌ ఎనలైజర్లు పెట్టాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించరాదు. ఎమ్మెల్యేలను, మంత్రులను అనడమంటే ప్రజలను అవమానించడమే. శాసన మండలి అవసరమా లేదా అనే దానిపై చర్చ జరగాలి.

పాలన సాగాలా.. వద్దా?: అంబటి రాంబాబు

మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్‌ను ప్రభావితం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాజకీయ స్వార్థం కోసం వ్యవస్థలను ప్రభావితం చేయడంలో చంద్రబాబును మించిన వ్యక్తి దేశంలోనే లేరన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శాసనసభ చేస్తున్న బిల్లులను మండలి అడ్డుకుంటూ ఉంటే ఐదేళ్లపాటు పాలన సాగాలా వద్దా? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో శాసనమండలిని కొనసాగించాలి్సన అవసరం లేదన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై కాలయాపన చేయడం మినహా పూర్తిగా అడ్డుకోలేమని తెలిసినప్పటికీ చంద్రబాబు రైతులను మభ్యపెట్టేందుకే ఈ కుయుక్తి పన్నారని చెప్పారు. రైతులు చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మరిన్ని ప్రయోజనాలు పొందాలని సూచించారు.

ఆరో వేలు అవసరమా?: మంత్రి కొడాలి నాని

ఆరో వేలు లాంటి శాసనమండలి అవసరమా? అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబును మండలి గ్యాలరీ ఎక్కించిన ముఖ్యమంత్రి జగన్‌ను అభినందిస్తున్నాం. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ఇక్కడ (అసెంబ్లీ) గ్యాలరీనే గతి. దివంగత వైఎస్సార్‌ భిక్ష వల్లే పప్పునాయుడు మంత్రి, ఎమ్మెల్సీ అయ్యారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే ఆరో వేలు అవసరం లేదని మండలిని రద్దు చేశారు. మేధావులు ఆలోచించి సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ మండలిని పునరుద్ధరిస్తే పప్పునాయుడు, యనమల లాంటి వారు వస్తున్నారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని సిగ్గు లేకుండా  చైర్మన్‌కు సైగలు చేశారు. మంత్రులు తాగి వచ్చారని యనమల అనడం శోచనీయం. చంద్రబాబు లేదా ఆయనతో ఉన్నవారు తాగి వచ్చారేమో? యనమల నీతులు చెబితే వినాలా? ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది ఎన్టీఆర్‌కు చేసిన మోసమే.

ప్రభుత్వాన్ని కించపరిచేలా దుష్ప్రచారం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

‘నిపుణులతో కూడిన మూడు కమిటీలు సుదీర్ఘ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికలను తులనాత్మకంగా పరిశీలించిన అనంతరం శాసనసభ బిల్లును ఆమోదించి కౌన్సిల్‌కు పంపితే అక్కడ జరగరాని పరిణామాలు జరిగాయి. మంత్రులను, ప్రభుత్వాన్ని అవహేళన చేసేలా, కించపరిచేలా కొన్ని పేపర్లు, టీవీల్లో దుష్ప్రచారం జరుగుతోంది. మండలిలో ఏం జరిగిందో సభ్యులకు, ప్రజలకు తెలియజేయాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా’ అని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top