కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి

Araku MLA Kidari Sarveswara Rao Funeral Completed - Sakshi

పాడేరు/అరకులోయ/పాడేరు/డుంబ్రిగుడ/పెదవాల్తేరు: విశాఖ మన్యంలో మావోయిస్టులు కాల్చి చంపిన ప్రభుత్వ విప్, అరుకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో ముగిశాయి. అరకులోని ప్రాంతీయ ఆస్పత్రిలో సోమవారం ఉదయం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. పాడేరులో కిడారి సర్వేశ్వరరావుకు, అరకులో సోమకు అనుచరులు, బంధువులు కన్నీటి మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. తొలుత కిడారి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి పాడేరు వీధుల్లో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, ఎంపీ శ్రీనివాసరావు, జిల్లా ఎమ్మెల్యేలు, మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ సమీపంలో పట్టుపరిశ్రమశాఖ ప్రదర్శన క్షేత్రం వద్ద ప్రభుత్వ స్థలంలో కిడారి భౌతికకాయానికి  పోలీసులు గౌరవవందనం చేశారు. మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, జవహర్, నక్కా ఆనందబాబు, కళావెంకటరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిడారి భార్య పరమేశ్వరి, పిల్లలు నాని, సందీప్, తనిష్క, ఇతర కుటుంబ సభ్యులను మంత్రులు ఓదార్చారు. అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ, బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొని కిడారి మృతదేహానికి నివాళులు అర్పించారు. 

సోమకు తుది వీడ్కోలు
పోస్టుమార్టం అనంతరం సోమ మృతదేహాన్ని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. తొలుత హెలికాప్టర్‌లో అరకు చేరుకున్న మంత్రులు సోమ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమ కుటుంబసభ్యులను పరామర్శించారు. మందకృష్ణ మాదిగ, కారెం శివాజి, అరకులోయ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శెట్టి పాల్గుణ తదితరులు సోమ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని పురవీధుల్లో ఊరేగించి స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.   

భద్రతా వైఫల్యాలపై విచారణ: చినరాజప్ప 
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనలో భద్రతాపరమైన వైఫల్యాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పాడేరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన నాయకుల్ని మావోయిస్టులు చంపడం విచారకరమని, ఉనికిని చాటుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. నాయకుల్ని కాపాడే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద కిడారి, సోమలను మావోలు చంపిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, ఇంటిలిజెన్స్‌ డీసీపీ ఫకీరప్ప సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉనికిని చాటుకోవడానికి, పోలీసులపై ప్రతీకార చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు చంపారన్నారు. ఒడిశా రాష్ట్రం నందపూర్‌ కమిటీ దళ సభ్యులు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. కూంబింగ్‌ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, శర్మ, ఫకీరప్ప అరకులోయ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘటన స్థలానికి బైక్‌పై వెళ్లారు.    

ఎస్సై సస్పెన్షన్‌..
విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ వై.అమ్మనరావుని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో వైఫల్యం కారణంగా ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

ముగ్గురు మావోల గుర్తింపు 
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను కాల్చి చంపిన మావోయిస్టుల్లోని ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు గుర్తుపట్టిన ఆ ముగ్గురు మావోల ఫొటోలు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాకు విడుదల చేశారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌ పరిధి దబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌ అలియాస్‌ రైనో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్‌ స్వరూప అలియాస్‌ సింద్రి, అలియాస్‌ రింకి, విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకటరవి చైతన్య అలియాస్‌ అరుణ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఈ ముగ్గుర్ని గుర్తుపట్టారని, ఈ ఘటనలో పాల్గొన్న మిగిలిన వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని ఎస్పీ తెలిపారు. పోలీసులకు సమాచారం లేకుండా ఏజెన్సీలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు బయటకు వెళ్లరాదని, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే భీమవరానికి చెందిన కామేశ్వరి ఈ కాల్పుల్లో పాల్గొనడం జిల్లాలో చర్చనీయాంశమైంది. నిజానికి కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, భీమవరానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వారు విడిపోయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం బస్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేసింది. 2008–09 సమయంలో మావోలతో పరిచయం అయ్యి వారితో కలసి వెళ్లినట్లు సమాచారం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top