ఆక్వా వ్యవసాయ హోదా : పుల్లారావు | Aqua Farm status: pullarao | Sakshi
Sakshi News home page

ఆక్వా వ్యవసాయ హోదా : పుల్లారావు

Jun 30 2014 2:06 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఆక్వా రంగానికి వ్యవసాయరంగంతో సమానంగా హోదా కల్పించడానికి కృషిచేస్తామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు.

కైకలూరు : ఆక్వా రంగానికి వ్యవసాయరంగంతో సమానంగా హోదా కల్పించడానికి కృషిచేస్తామని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. స్థానిక సీఎన్నార్ గార్డెన్‌లో రాష్ట్ర చేపల రైతుల సంఘం ఆధ్వర్యంలో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మంత్రి పుల్లారావు, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావుకు సన్మానం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 20 వేల మందికిపైగా ఆక్వారైతులు ఉన్నారని, ఈ రంగం నుంచి ప్రభుత్వానికి రూ.20 కోట్ల ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. చేపల ముడిసరుకులకు విధిస్తున్న 4 శాతం పన్ను తగ్గించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జూలై 13, 14 తేదీల్లో అటవి, పర్యావరణశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కొల్లేరు తీసుకొచ్చి సమస్యలను వివరిస్తానని ప్రకటించారు.

ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆక్వా రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఫిషరీస్ కమిషనర్ జె.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. అనంతరం 8 మంది ఆక్వా రైతులకు ప్రోత్సాహకాలుగా రూ.25 లక్షల చెక్కులను మంత్రులు అందించారు.

మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, రైతాంగ సమైఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, జిల్లా చేపల రైతు సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, డెల్టా ఫిష్‌పార్మర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రామచంద్రరాజు, జిల్లా మత్స్యశాఖ డీడీ కల్యాణం, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు. తెలుగు దేశం పార్టీ నాయకులు పలువురుపాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement