గ్రూప్‌–2 మెరిట్‌ జాబితా విడుదల | APPSC releases merit list for Group-II exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 మెరిట్‌ జాబితా విడుదల

Dec 16 2017 3:31 AM | Updated on Dec 16 2017 3:31 AM

APPSC releases merit list for Group-II exam - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలో మెరిట్‌ మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున (1:2 విధానంలో) 1,925 మందిని ఎంపిక చేస్తూ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచింది. మెరిట్‌ జాబితా ప్రకారం అభ్యర్థుల ధ్రువ పత్రాలను జనవరి 3 నుంచి 20 వరకు పరిశీలిస్తారు. పోస్టుల కోడ్‌ల వారీగా ధ్రువ పత్రాలను పరిశీలించే సమయం, తేదీని త్వరలోనే తెలియజేస్తారు.

అభ్యర్థులు వారు ఇచ్చిన ప్రిఫరెన్స్‌ ఆధారంగా కోడ్‌ల వారీగా ఆయా పోస్టులకు వారికి కేటాయించిన సమయంలో తమ ధ్రువ పత్రాలతో సహా హాజరుకావాలని ఎపీపీఎస్సీ సూచించింది. ఒకవేళ  హాజరుకాకపోతే మెరిట్‌ జాబితాలోని తర్వాత అభ్యర్థికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. అభ్యర్థులు ఎస్సెస్సీ సర్టిఫికెట్, వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం(క్రిమిలేయర్‌తో సహా), తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చి ఉంటే మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. అభ్యర్థులు వారికి కేటాయించిన సమయంలో ధ్రువీకరణ పత్రాలను సమర్పించడడం విఫలమైతే.. వారిని పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది. ధ్రువ పత్రాల పరిశీలనకు గడువు పొడగించలేమని తేల్చిచెప్పింది.

కంప్యూటర్‌ నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే...
దివ్యాంగులైన అభ్యర్థులకు విశాఖపట్నంలోని మెడికల్‌ బోర్డు పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష నిర్వహించే తేదీని, సమయాన్ని త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలతో సంబంధం ఉన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆయా శాఖల అధికారులు ఆ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిని నిర్వహించే తేదీ, సమయాన్ని త్వరలోనే తెలియజేస్తామని కమిషన్‌ పేర్కొంది. కోడ్‌ నెంబర్‌ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 13, 14, 15, 16, 33, 34 పోస్టులు మినహా మిగతా కోడ్‌ నెంబర్లలోని పోస్టులకు మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్‌ నైపుణ్య పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఆ పరీక్షలు నిర్వహించే తేదీ సమయాన్ని త్వరలోనే తెలిజేస్తామని పేర్కొంది. కంప్యూటర్‌ నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే పోస్టులకు ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement