కడలి వైపు కృష్ణమ్మ పరవళ్లు

AP State Govt high alert in coastal areas of Krishna - Sakshi

ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 2.51 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల

‘కృష్ణా’ తీర ప్రాంతాల్లో సర్కార్‌ హైఅలర్ట్‌ 

నిండుకుండల్లా శ్రీశైలం,నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు

సాక్షి, అమరావతి/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్‌: గోదావరి సముద్రం వైపు కదలిపోతుంటే దానికి దీటుగా కృష్ణమ్మ కూడా కడలి వైపు పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మంగళవారం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 21.74 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్న వరద పరిమాణాన్ని అధికారులు పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సర్కార్‌ హైఅలర్ట్‌ను ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి నుంచి 57.89 టీఎంసీలు.. నారాయణపూర్‌ నుంచి 50.98 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా ఉపనది భీమాలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో ఉజ్జయిని జలాశయం నుంచి 0.94 టీఎంసీని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 64.37 టీఎంసీల ప్రవాహం వస్తుండగా 65 గేట్లు ఎత్తి దిగువకు 63.21 టీఎంసీల ప్రవాహాన్ని కిందకు వదిలారు.

తుంగభద్ర జలాశయం నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 10.02 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 76.30 టీఎంసీల వరద ప్రవాహం వస్తుండగా.. 76.37 టీఎంసీల వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. దాంతో సాగర్‌ 26 గేట్లు ఎత్తి 46.31 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 23.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బుధవారం సాయంత్రానికి నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా దిగువకు 36.67 టీఎంసీల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ భద్రత దృష్టా వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,36,873 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 30,767 క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు.
 
వరద నీటిలో చిక్కుకున్న పోలీసులు 
కంచికచర్ల (నందిగామ): కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు లంక భూముల్లో నివాసముంటున్న రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లిన పోలీస్‌ అధికారులు మంగళవారం వరదనీటిలో చిక్కుకున్నారు. కృష్ణానది లంక భూముల్లో సుమారు 40 కుటుంబాల రైతులు ఉంటున్నారు. లంక భూముల్లో నివాసముంటున్న రైతులను గ్రామానికి చేరవేసేందుకు నందిగామ రూరల్‌ సర్కిల్‌ సీఐ కె.సతీశ్, ఎస్‌ఐ జి.శ్రీహరిబాబు కొంతమంది విలేకరులతో కలసి వెళ్లారు. వారు వెళ్లే సమయంలో కృష్ణానదికి వరదనీరు రాకపోవటంతో ఎక్కువమంది రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మిగిలిన ఐదు కుటుంబాల రైతులను తరలించే సమయంలో వరద ఉధృతి తీవ్రరూపం దాల్చింది. దీంతో వారు వరదల్లో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ వి.రాజకుమారి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇబ్రహీంపట్నం నుంచి మూడు బోటులను తెప్పించి వారిని కాపాడేందుకు వెళ్లారు. దీంతో అక్కడున్న రైతులు, సీఐ, ఎస్‌ఐలతోపాటు విలేకరులు గుదే వరప్రసాద్, తోట క్రాంతికుమార్‌లను బోట్‌లపై సురక్షితంగా గ్రామానికి తీసుకువచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top