మహిళల రక్షణ చేతల్లో చూపించిన సీఎం 

AP Home Minister Sucharita Appreciated About Disha Act - Sakshi

‘దిశ’ చట్టం అక్కచెల్లెమ్మలకు కానుక అని హోం మంత్రి సుచరిత ప్రశంసలు

ఏ ఆడపిల్లకూ కష్టం కలగకూడదనే ఈ చట్టం : తానేటి వనిత

అంతర్జాతీయంగా అరుదైన చట్టం : డీజీపీ గౌతం సవాంగ్‌

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : ఎన్నో సంవత్సరాలుగా మహిళ రక్షణ, భద్రత కోసం నేతలు చెబుతున్న మాటలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతల ద్వారా నిజం చేశారని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రశంసించారు. ఒక దళిత మహిళను హోం మంత్రి చేయడం ద్వారా సీఎం మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం దిశ యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు అండగా ఉండేలా దిశ చట్టాన్ని కానుకగా తీసుకువచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందని చెప్పారు. మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో జరిగింది తమకెందుకులే.. అని అనుకోకుండా రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అటువంటి అన్యాయం జరగకుండా ఉండాలని ఈæ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాలను ఆరికట్టడానికి సీఎం దిశ చట్టాన్ని తీసుకువచ్చారని, రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక ప«థకాలకు మంచి స్పందన లభించిందన్నారు.  

చరిత్రగా నిలిచిపోతుంది..
ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం తీసుకురావడం ఒక చరిత్రగా నిలిచిపోతుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 1349 పోలీసుస్టేషన్లు ఒక యూనిట్‌గా పని చేస్తాయన్నారు. అంతర్జాతీయంగా కూడా చాలా అరుదైన చట్టంగా నిలుస్తుందన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకు వచ్చిందని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (టెక్నికల్‌ సర్వీస్‌) జి.పాలరాజ్‌ పేర్కొన్నారు. ఐపీసీలో 354(ఇ) సెక్షన్‌ను చేర్చామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు సుభాష్‌చంద్రబోస్, పుష్ప శ్రీవాణి, మంత్రులు మోపిదేవి, పినిపే విశ్వరూప్, కన్నబాబు, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, నందిగం సురేష్, చింతా అనురాధ, వంగా గీత, గొడ్డేటి మాధవి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ,  ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి, కంగాటి శ్రీదేవి, రజిని, పద్మావతి, ఉషా శ్రీచరణ్, జక్కంపూడి రాజా, సీఎం ప్రోగ్రామ్స్‌ సమన్వయ కర్త తలశిల రఘురాం, మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ అమ్మాజీ, దిశ ప్రత్యేకాధికారులు దీపికా పటేల్, కృతికా శుక్లా, నన్నయ వీసీ జగన్నాథరావు, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top