‘సచివాలయ’ పరీక్షలు.. తప్పు ప్రశ్నలకు మార్కుల కేటాయింపు

AP Grama Sachivalayam Category 1 Exam Officials Decide To Add Two Marks - Sakshi

కేటగిరీ–1, డిజిటల్‌ అసిస్టెంట్‌ ప్రశ్నపత్రాల్లో తప్పులు

ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ రెండేసి మార్కుల కేటాయింపు

వీటి తుది కీ విడుదల చేసిన సర్కారు

సాక్షి, అమరావతి: ఈనెల ఒకటో తేదీ ఉదయం జరిగిన కేటగిరి–1 ‘సచివాలయ’ ఉద్యోగాల రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ రెండు మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ.. ఇలా మొత్తం నాలుగు రకాల పోస్టులకు కలిపి నిర్వహించిన ఒకే పరీక్షలో రెండు ప్రశ్నలలో తప్పులు దొర్లడంతో వాటికి కేటాయించిన మార్కులను ఆ రోజు పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కలపాలని నిర్ణయించారు.

4,465 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 11,62,164 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్‌ ‘కీ’ని అధికారులు శనివారం విడుదల చేశారు. ఏ–సిరీస్‌ ప్రశ్నపత్రంలో 47, 98 ప్రశ్నలకు.. బీ–సిరీస్‌ ప్రశ్నపత్రంలో 30, 84 ప్రశ్నలకు.. సీ– సిరీస్‌ ప్రశ్నపత్రంలో 13, 147 ప్రశ్నలకు.. డీ–సిరీస్‌ ప్రశ్నపత్రంలో 3, 118 ప్రశ్నలకు పూర్తి మార్కులు కలుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవి కాకుండా.. పరీక్ష జరిగిన రోజు ప్రకటించిన ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో అందులోని ఒక ప్రశ్నకు సంబంధించిన జవాబును కూడా ఫైనల్‌ ‘కీ’లో మార్చారు.

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పరీక్షకు 86.83 శాతం హాజరు
ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు శనివారం జరిగిన పరీక్షకు 86.63 శాతం మంది హాజరయ్యారు. గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో కలిపి మొత్తం 14,759 ఉద్యోగాలకు 1,33,832 మంది దరఖాస్తు చేసుకోగా, శనివారం జరిగిన పరీక్షకు 1,16,208 మంది హాజరయ్యారు. అలాగే, సాయంత్రం 400 విలేజీ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు జరిగిన పరీక్షకు 5,047 మందికి గాను 4,034 మంది హాజరయ్యారు. 

‘డిజిటల్‌ అసిస్టెంట్‌’ అభ్యర్థులకు కూడా..
సెప్టెంబర్‌ 1న జరిగిన డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల ప్రశ్నపత్రంలోనూ 2 ప్రశ్నలలో తప్పులు దొర్లడంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ కూడా 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్ష ఫైనల్‌ ‘కీ’ని కూడా శనివారం రాత్రి ప్రకటించారు. ఎ–సిరీస్‌లో 57, 72 ప్రశ్నలకు.. బి–సిరీస్‌లో 56, 141, సి–సిరీస్‌లో 118, 133, డి–సిరీస్‌లో 77, 92 ప్రశ్నలకు పూర్తి మార్కులు కేటాయిస్తారు.అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు ప్రాథమిక కీలో పేర్కొన్న 7 ప్రశ్నల సమాధానాలను ఫైనల్‌ కీలో మార్చారు. వీటిలో 5 ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో రెండేసి సమాధానాలున్నట్లు అధికారులు గుర్తించారు. అభ్యర్థులు ఈ రెండింటిలో ఏది జవాబుగా పేర్కొన్నా మార్కులివ్వనున్నట్లు ఫైనల్‌ ‘కీ’లో పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top