
సాక్షి, అమరావతి: గత ఏడాది ఖరీఫ్ (2019–20) నుంచే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
► రైతులకు పథకం కింద రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు పథకం వర్తిస్తుంది.
► ఇప్పటికే అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలు ఉంటాయి.
► రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పొందే సౌకర్యం ఉన్న రైతుల ఖాతాలకు జమ చేస్తుంది.
► తుది గడువులోగా రైతులు అసలు, వడ్డీ చెల్లించాలి. సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తుంది. అసలు, వడ్డీని రైతు చెల్లించినట్టు జాబితాలు తయారు చేసి ఆయా బ్యాంకులు లేదా నోడల్ బ్యాంకు శాఖలు వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్ కార్యాలయానికి పంపుతాయి. వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ కమిషనర్ వడ్డీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా http:// ysrsvpr.ap.gov.in వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది.
► వాస్తవ సాగుదార్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఇ–పంటలో నమోదైన వాస్తవ సాగుదార్లకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.