అధిక కేసులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

AP Govt to Give Rs 2000 Aid to Each Poor Person Completing Quarantine - Sakshi

కోవిడ్‌–19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌

తొలుత హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మాస్క్‌లు పంపిణీ చేయాలి

మాస్క్‌ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి

నేటి నుంచి డెలివరీ ప్రారంభం..

ప్రతి ఒక్కరికీ మూడు మాస్క్‌లు 

గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా, మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితా

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా నిబంధనలను మరింత కఠినతరంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలందరికీ మాస్క్‌ల పంపిణీ, క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి ఇంటికి పంపే సమయంలో పేదలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ తదితర అంశాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.  

► క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలి. తొలుత హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో మాస్క్‌లను పంపిణీ చేయాలి. ప్రతి ఒక్కరికీ మూడు మాస్క్‌లు ఇవ్వాలి.
► నేటి నుంచి మాస్క్‌ల డెలివరీ ప్రారంభం. రెండు మూడు రోజుల తర్వాత విస్తృతంగా పంపిణీ. మాస్క్‌ల తయారీ పని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి.

రైతు భరోసా కేంద్రంగా మార్కెటింగ్‌
►  వైఎస్సార్‌ రైతు భరోసా, మత్య్సకార భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ ఉండేలా చూసుకోవాలి. కియోస్క్‌లు ఏర్పాటు చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రంగా మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాలి.
► ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.
► ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తూ పేదలకు రూ.2 వేలు ఇవ్వాలి. లేదంటే.. సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం ఇచ్చే డబ్బుతో పాలు, గుడ్లు, కూరగాయలు లాంటి పౌష్టికాహారం తీసుకోవడానికి వీలుంటుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top