వైఎస్సార్‌ నవశకానికి ‘స్పందన’తో నాంది | AP Government Successfully Running SPANDANA Programme | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ నవశకానికి ‘స్పందన’తో నాంది

Dec 6 2019 4:40 AM | Updated on Dec 6 2019 4:47 AM

AP Government Successfully Running SPANDANA Programme - Sakshi

సాక్షి, అమరావతి :  ప్రజల సమస్యలు సత్వరమే తీర్చాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ప్రారంభించిన ‘స్పందన’ కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతుల నేపథ్యంలో ‘వైఎస్సార్‌ నవశకం’ ఆవిర్భవించింది. రాష్ట వ్యాప్తంగా స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అత్యధికంగా రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్ల కోసం ఎక్కువగా వినతులు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అర్హత కలిగి ఉండి కూడా పింఛన్, ఇల్లు, రేషన్‌ కార్డు లేని వారు ఎంత మంది ఉన్నారో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్‌ నవశకం పేరుతో రాష్ట్రమంతటా ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే.

ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ ఏడాది జూన్‌ 24న కలెక్టర్లు, ఎస్పీలతో తొలి కాన్ఫరెన్స్‌ నిర్వహించినప్పుడు ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రతి సోమవారం కొనసాగుతోంది. సోమవారం వచ్చిన వినతుల్లో చాలా వరకు శనివారంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పని చేస్తోంది. ఈ కార్యక్రమంపై క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి కూడా ప్రతి మంగళవారం సమీక్షిస్తూ అధికార యంత్రాంగంలో సీరియస్‌నెస్‌ తీసుకొచ్చారు.

యథాలాపంగా కాకుండా ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం దిశగా స్పందన కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారు. తక్షణ స్పందన కోసం కలెక్టర్లకు నిధులనూ కేటాయించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచాలని ఆదేశించారు. ప్రజలు రోజుల తరబడి సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండరాదని, ఏ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వినతులు ఇచ్చే ప్రజలకు రశీదు ఇప్పించారు. ఆ సమస్య పరిష్కారం కాగానే తెలియజేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

ఏదైనా వినతి పరిష్కారానికి నోచుకోకపోతే అందుకు గల సహేతుక కారణాలతో వివరణ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉంటే.. దాని పరిష్కారానికి నిర్ణీత సమయం చెప్పాలనే జవాబు దారీ తనాన్ని అధికార యంత్రాంగానికి అలవాటుగా మారుస్తున్నారు. ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై స్పందనలో ఇప్పటి దాకా లక్షల కొద్దీ వినతులు వచ్చాయి. వీటి పరిష్కారంలో నాణ్యత పెంచడానికి సీఎం ఆదేశాల మేరకు అధికారులకు పెద్ద ఎత్తున వర్క్‌షాపులు నిర్వహించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

చిరునవ్వుతో స్వాగతించాలి
స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా పనిచేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతామని ప్రతి సమీక్షలో  ఆయన అధికారులకు స్పష్టం చేస్తున్నారు. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలని సూచిస్తూ వస్తున్నారు. దీంతో అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement