హైక్లాస్‌ గురుకులాలు

AP Government Establishment Of Virtual Classrooms In 105 Gurukul Schools - Sakshi

రాష్ట్రంలోని 105 విద్యాలయాల్లో వర్చ్యువల్‌ క్లాస్‌రూంల ఏర్పాటు

గురుకుల సొసైటీ కార్యాలయంలోని స్టూడియో నుంచి పాఠాల బోధన

సీసీ కెమెరాల సాయంతో గురుకుల స్కూళ్లలో భద్రత, వసతుల పర్యవేక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ఒకేసారి బోధించేందుకు అత్యాధునికమైన వర్చ్యువల్‌ క్లాస్‌రూంల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ వర్చ్యువల్‌ క్లాస్‌రూంల విధానంలో పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా.. వివిధ జిల్లాల్లోని విద్యార్థులతో ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా మాట్లాడే అవకాశముంటుంది. అలాగే గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో.. తాడేపల్లిలోని కంట్రోల్‌ కేంద్రం నుంచే ఎప్పటికప్పుడు తనిఖీ చేసే అవకాశం ఏర్పడింది.

105 గురుకులాల్లో వర్చ్యువల్‌ క్లాస్‌రూంలు
రాష్ట్రంలో గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం 189 విద్యాసంస్థల్ని నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం 105 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వర్చ్యువల్‌ క్లాస్‌ రూంలను ఏర్పాటు చేశారు. గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయం నుంచి వర్చ్యువల్‌ క్లాస్‌ రూంలతో మాట్లాడేందుకు స్టూడియో నిర్మించారు. ఈ స్టూడియో నుంచే రాష్ట్రంలోని అన్ని గురుకుల  విద్యాసంస్థల్లోని  విద్యార్థులకు ఒకేసారి పాఠాలు బోధించడంతో పాటు.. నేరుగా మాట్లాడవచ్చు. రాష్ట్రంలోని విశాఖపట్నం, యర్రగొండపాలెం, కురుపాం, పార్వతీపురం, శ్రీకాళహస్తి, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, తనకల్లు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి, అధికారులు మాట్లాడారు. వసతులు, విద్యా బోధనపై మంత్రి స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
విద్యార్థుల రక్షణ, విద్యాసంస్థల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని గిరిజన విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలల్లో నాలుగు కెమెరాలు అమర్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ పి.రంజిత్‌ బాషా వెల్లడించారు. ఈ కెమెరాల సాయంతో పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, ఇతర వసతుల్ని, విద్యార్థుల భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.

సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యాసంస్థల్లోని బాలికలకు రక్షణ ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడే అవకాశముంటుందని రంజిత్‌ బాషా పేర్కొన్నారు. ఈ కెమెరాలను క్షేత్రస్థాయిలో ఆపేందుకు వీలులేకుండా తాడేపల్లిలోని కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. విద్యాసంస్థల్లోని ఆర్థిక లావాదేవీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసేందుకు, టీచర్లు, విద్యార్థుల హాజరును నిర్ధారించుకొని ఆ మేరకు సరుకులు, ఇతర వస్తువులు విడుదల చేయడానికి ఫైనాన్షియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top