సమరానికి సై.. | Sakshi
Sakshi News home page

సమరానికి సై..

Published Mon, Mar 18 2019 10:51 AM

AP Elections YSRCP Candidates In West Godavari - Sakshi

ఎన్నికల సమరానికి వైఎస్సార్‌ సీపీ సై అంది. జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఒకే విడతలో ప్రకటించింది. అనుభవానికి, నమ్మకానికి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. అన్ని సామాజిక వర్గాలకు సమతూకంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారు. అభ్యర్థుల్లో ఎక్కువమంది ఉన్నత చదువులు చదివిన వారు, యువతే కావడం విశేషం. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంపై వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : వచ్చే నెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సై అంది. ఒకే విడతలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితాను అ«ధినేత జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రెండు విడతల్లో 12 సీట్లు ప్రకటించగా, జనసేన మూడు, బీజేపీ 10 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించగలిగాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలా జాబితాను ప్రకటించింది. ఏలూరు ఎంపీని వెలమ సామాజికవర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్‌కు, నరసాపురం పార్లమెంట్‌ స్థానాన్ని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కనుమూరి రఘురామ కృష్ణంరాజుకు, రాజమండ్రి పార్లమెంట్‌ స్థానాన్ని ముందుగానే ప్రకటించిన విధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మార్గాని భరత్‌ను ఎంపిక చేశారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా దాదాపుగా అనుభవం ఉన్నవారికే పెద్దపీట వేసింది. తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలు బరిలోకి దిగనున్నారు. అందులో ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఆళ్ల నాని కూడా ఏలూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అన్నివర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ప్రకటించారు. 


పాదయాత్రలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌న్‌ మాట్లాడుతూ రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే రాజమండ్రి స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన మార్గాని భరత్‌కు కేటాయించారు. జిల్లాలోని అసెంబ్లీ  అభ్యర్థుల ప్రకటనలో కాపు, క్షత్రియ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను కాపు సామాజిక వర్గానికి, మూడు స్థానాలతో పాటు నరసాపురం లోక్‌సభ స్థానాన్ని క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించారు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలకు ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ ఆరంభం నుంచి తన వెంటే ఉన్న ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజులకు మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల్లో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. పశ్చిమలో ఇప్పటికే నాలుగు సీట్లను కమ్మ సామాజిక వర్గానికి కేటాయించిన తెలుగుదేశం పార్టీ నిడదవోలు అసెంబ్లీ స్థానానికి కూడా అదే వర్గానికి కేటాయించనుంది. డెల్టాలో ఎక్కువ ప్రభావం చూపే క్షత్రియ సామాజిక వర్గానికి కేవలం ఒక్క సీటు మాత్రమే కేటాయించారు. వైఎస్సార్‌ సీపీ బీసీలకు రాజమండ్రి ఎంపీ, తణుకు అసెంబ్లీ సీటు కేటాయించగా, తెలుగుదేశం పార్టీ ఒక్క ఆచంట మాత్రమే బీసీలకు కేటాయించింది.

కాపులకు మూడు స్థానాలు మాత్రమే ఇచ్చింది. మొత్తం 15 మందిలో వైఎస్సార్‌ సీపీ యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. 60 ఏళ్లు దాటిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. చింతలపూడి అభ్యర్థి ఎలీజా ఐఆర్‌ఎస్‌ కాగా, ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, దెందులూరు అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరి, కొవ్వూరు అభ్యర్థి తానేటి వనిత, నిడదవోలు అభ్యర్థి జీఎస్‌ నాయుడు  ఉన్నత చదువులు చదివిన వారే. పాలకొల్లులో డాక్టర్‌కు టిక్కెట్‌ ఇచ్చింది. అన్ని వర్గాలకు సమన్యాయం చేయడంతో జిల్లాలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

Advertisement
Advertisement