‘ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏం ఉంటుంది?’

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

సాక్షి, అమరావతి: రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్‌ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసిందని, ఆ సూచనలను గతంలో చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఆరోపించారు. సానుభూతి కోసమే రాజధాని పేరిట చంద్రబాబు భిక్షాటన అంటూ నాటకమాడుతున్నారంటూ విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ది విషయంలో చంద్రబాబుకు ఉన్న దురుద్ధేశాన్ని ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఇక నిబంధనల బుక్‌ పట్టుకొని తిరిగే యనమల రామకృష్ణుడు ఆ నిబంధనలు పాటించాలని తెలియదా అని ప్రశ్నించారు. యనమల తప్పుడు సలహాలతో టీడీపీ గోతిలో పడిందన్నారు. 

‘రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిస్తే.. ఆ భూములు అమ్ముకోమని చంద్రబాబు సలహాలు ఇస్తున్నారు. సెలెక్ట్‌ కమిటీని చూసి తాము భయపడాల్సిన అవసరం లేదు. రూల్‌ 71 వర్తించదని మండలి సమావేశాల్లో స్పష్టంగా చెప్పాం. అయితే ఛైర్మన్‌ విచక్షణాధికారాలతో అనుమతించామని అన్నారు. ఛైర్మన్‌ ఆదేశాలను గౌరవించాలనే 71పై చర్చించాం. పాలసీ కాకుండా రూల్‌ 71ను వర్తింపజేయలేం. ఏదైనా విషయం సందిగ్దంలో ఉన్నప్పుడే విచక్షణాధికారం ఉపయోగించాలి. ఓటింగ్‌ ద్వారా ఏ కమిటీ వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. బాల్‌ కొట్టకుండానే రిఫరీ పాయింట్‌ ఇచ్చినట్లుగా ఉంది. ఛైర్మన్‌ తన అధికారాలను దుర్వినియోగం చేసినట్లే. ఓటింగ్‌ జరపాలని అసెంబ్లీ రూల్స్‌ చెబుతున్నాయి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. గ్యాలరీలో కూర్చుని కను సైగలతో ఆదేశాలిచ్చారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏం ఉంటుంది?. అసెంబ్లీ సెక్రటరీని సస్పెండ్‌ చేసే అధికారం టీడీపీకీ లేదు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో యనమల ఉన్నారు’అని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top