ఉగాదిలోగా ఇళ్లస్థల పట్టాలు 

AP CM YS Jagan Said House Site Pattas Will Be Given To Poor By Ugadi In West godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : ఏలూరు నియోజకవర్గంలో అర్హత గల పేద ప్రజలకు ఉగాదిలోగా ఇళ్లస్థల పట్టాలు అందజేయడానికి 500 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు  ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మండల అధికారులతో ఆయన సమీక్షించారు.సమాజంలో పేదరికం కారణంగా ఎన్నో వేల కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధించలేకపోతున్నాయని కనీసం సొంత ఇల్లు లేక అద్దె చెల్లించలేక వేలాది మంది బాధపడుతున్నారని, అటువంటి వారందరికీ ఉగాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్లస్థల పట్టాలను పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని, ఈ మేరకు ఏలూరు నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబా నికి సొంత ఇంటి కలను సాకారం చేయాలంటే కనీసం 500 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఏలూరు పరిసర గ్రామాలలో భూసేకరణకు వారం రోజుల్లో తగు ప్రతిపాదనలు సమర్పించాలని తహసీల్దార్‌ పి.సోమశేఖర్‌ను మంత్రి ఆదేశించారు.

వెంకటాపురం పంచాయతీలోనే ఇప్పటికే 6 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఏ గ్రామంలో చూసినా సొంత ఇల్లు లేక బాధపడే ప్రజలు ఉన్నారని, ఈసారి అందరికీ సొంత ఇల్లు నిర్మించి తీరతామని చెప్పారు. పోణంగిలోని డంపింగ్‌ యార్డ్‌ను మరో వైపుకు మళ్లించి డంపింగ్‌ యార్డు స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించే అవకాశాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారపుపేట, చొదిమెళ్ళ, వెంకటాపురం, కొమడవోలు, వట్లూరు, హనుమాన్‌నగర్‌లోని గ్రీన్‌సిటీ వెనుక తదితర గ్రామాల్లో భూములను సేకరించి తగు చర్యలు తీసుకోవాలని నగరంలోని పేదలందరికీ కూడా ఈ చుట్టు ప్రక్కల అందుబాటులో ఉన్న భూములను ఇళ్ల స్ధలాలుగా కేటాయించాలని అందుకు తక్షణమే సర్వే నిర్వహించి ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించగలమో ఒక అంచనాకు రావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

వచ్చే బడ్జెట్‌లో మెడికల్‌ కాలేజీకి నిధులు 
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి జీఓనూ జారీ చేసిందని, కనీసం  నిబంధనలు కూడా పాటించకుండా ఎంత భూమి కావాలో కూడా తెలుసుకోకుండా  హడావిడిగా ఏలూరు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తూ.. రూ.266 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించిందని,  కానీ కార్యరూపం దాల్చలేదని ఆళ్ల నాని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో మెడికల్‌ కాలేజీకి అవసరమైన నిధులు కేటాయిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.   

అర్హులైన పేదలకు పెన్షన్లు  
ఏలూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవానికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చెప్పారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని పలువురు మహిళలు మంత్రి నానిని కలిసి తమకు పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరారు. మంత్రి ఆళ్ళనాని స్పందిస్తూ  అర్హత కలిగిన పేదలందరికీ నూరు శాతం పెన్షన్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇంకా ఎవరైనా ఉంటే వారంతా దరఖాస్తు చేసుకోవాలని మండల అధికారులకు సమర్పించాలని, ఆన్‌లైన్‌ చేయించి అందరికీ పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. పోణంగి, వైఎస్సార్‌ కాలనీలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఏలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రతీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలోని ప్రతీ పేద కుటుంబం ఆరోగ్యంగా జీవించాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైనా లంచాలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని, అవినీతి రహిత పాలన అందించటమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, మంచెం మైబాబు, బొద్దాని శ్రీనివాస్, ఎన్‌.సుధీర్‌బాబు, కిలాడి దుర్గారావు, నెరుసు చిరంజీవి, సుంకర చంద్రశేఖర్‌ ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top