సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

AP CM YS Jagan Review Meeting With BC Community Officials - Sakshi

నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారి అభ్యున్నతికి కృషి

సంచార వర్గాల వారి అభ్యున్నతి కోసం కార్పొరేషన్లు

బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ మంత్రులుతో సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి : వెనుకబడిన బీసీ సామాజిక వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. ఈ మేరకు బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ మంత్రులు, ఆ సామాజిక వర్గాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల సమస్యలపై జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చలు, పరిశీలన అనంతరం కమిటీ నివేదినకు సమర్పించింది. దీంతో నేటి సమీక్షలో నివేదిక, అందులోని అంశాలపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ నిర్ణయించారు.

బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. 10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరిగా, లక్ష నుంచి 10 లక్షల వరకు ఉ‍న్న బీసీ వర్గాల వారిని రెండో కేటగిరిగా, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరిగా విభజించి.. ఆ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా వర్గాల అభ్యున్నతి కోసం  కార్పొరేషన్ల ద్వారా విస్తృత చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పదివేల లోపు ఉన్న సంచారజాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపునిచ్చి.. వారు కూడా సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాల్సిన చర్యలపై సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు.

గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగాలని, అవసరమైన మరోసారి విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సమాజిక వర్గాల ప్రతినిధులతో విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోసారి నిర్వహించే సమావేశంలో.. బీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించాలని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్‌ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, బీసీ వర్గాల ప్రతినిధులు పొల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top