వంద రోజులు..వేల వెలుగులు 

AP CM YS Jagan Mohan Reddy Hundred Days Ruling - Sakshi

నగరానికి ప్రత్యేక వరాల జల్లు

వీఎంఆర్‌డీఏకు పునరుత్తేజం..

పట్టణాభివృద్దికి చేయూత

చిట్టివలస జూట్‌ మిల్‌ కార్మికుల సమస్యలకు పరిష్కారం

పంచగ్రామాల  భూ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

గంజాయిపై  ఉక్కుపాదం 

సాక్షి, విశాఖ సిటీ:  ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ప్రధానం.. ఇదే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నినాదం. రాజన్న రాజ్యం నిజంగా తిరిగి వచ్చిందన్న నమ్మకాన్ని.. ప్రతీ కుటుంబానికి నవరత్నాల వెలుగులు నింపుతానన్న భరోసాని కేవలం వంద రోజుల పాలనలోనే ఆయన కలిగించారు. ముఖ్యంగా జిల్లా పరంగా చూసుకుంటే ‘విశాఖ వికాసమే నా లక్ష్యం’ అన్నట్టుగా ఆయన జిల్లా వాసులపై వరాలు కురిపించారు. పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అనేక ప్రాజెక్ట్‌లను కేటాయించారు. దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. పరిశ్రమలకు చేయూతనిచ్చారు. మరెన్నో సంస్థలకు అండగా నిలిచారు. మొత్తంగా జిల్లా ప్రజలకు ‘నేనున్నా’అంటూ వరాల జల్లు కురిపించారు. 

తండ్రి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి గిరిపుత్రులంటే వల్లమాలిన అభిమానం. ఆయన పంథాను కొనసాగిస్తూ గిరిబిడ్డల ఆరోగ్యమే ప్రధానంగా పాడేరు కేంద్రంగా గిరిజన మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు. ఏజెన్సీ వాసులు జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసేందుకు, తమ జేబులు నింపుకునేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్‌ తవ్వకాల జీవో 97ను తక్షణమే రద్దు చేయించారు. సబ్బవరం కేంద్రంగా మూడు జిల్లాల జీవనాడి...మహానేత వైఎస్సార్‌ కలల ప్రాజెక్ట్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై కమ్ముకున్న నీలినీడలను పటాపంచలు చేస్తూ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేశారు. దాదాపు 40 వేల కుటుంబాల జీవితాలను బాగుచేసే ఉద్దేశంతో రెండున్నర దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సింహచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశారు. అధికారం చేపట్టిన వెంటనే పింఛన్‌ మొత్తం పెంచి..వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు.

రోడ్డున పడ్డ దాదాపు వేలాది మంది కార్మిక కుటుంబాలను ఆదుకునే దిశగా భీమిలి సమీపంలోని చిట్టివలస జ్యూట్‌ మిల్లు కార్మికులను ఆదుకున్నారు. వారి సమస్యలను కేవలం 45 రోజుల్లో పరిష్కారించారు. ఇక నగరాభివృద్ధికి కేంద్ర బింధువైన విశాఖపట్నం మెట్రోరీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ)కు పునర్జీవం పోశారు. చైర్మన్, కమిషనర్‌లను తక్షణమే నియమించి సంస్థను గాడిలో పెట్టారు. నగరానికి మరిన్ని సొగబులు అద్దె దిశగా అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఇక రైతు, గిరిజన, మత్స్యకార, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కల నెరవేర్చారు. అంగన్‌వాడీ, ఆశ, మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన ‘చరిత్ర’ సృష్టించింది అనడంలో అతిశయోక్తి లేదు. 

లక్షన్నర మంది మత్స్యకారులకు భరోసా..
సముద్రంలోకి వేటకు వెళితే బతుకులపై భరోసా లేదు. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబాలకు దిక్కులేదు. ఆదుకునే నాథుడు లేడు. వేట నిషేధ సమయంలో పూట గడిచే పరిస్థితి లేదు. ఇలా మత్స్యకారుల జీవనం అగమ్యగోచరం. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు వరాలు కురిపించింది. నగరంలోని హార్బర్లో ప్రత్యక్షంగా..పరోక్షంగా జీవనం సాగిస్తున్న దాదాపు 20 వేల మందితో పాటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి వలస వచ్చి బతుకుతున్న దాదాపు 7 వేల మందికి, జిల్లాలో ముత్యాలమ్మపాలెం, పరవాడ, పూడిమడక, కొత్త జాలారిపేట, పెదజాలరిపేట, భీమిలి, చేపలుప్పాడ, బంగారమ్మపాలెం, రేవు పోలవరం, తీనార్ల, రాజయ్యపేట ప్రాంతాల్లోని వేలాది మంది మత్స్యకారుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైతే రూ.10లక్షల పరిహారం, వేట నిషేధ కాలంలో గతంలో ఉన్న రూ.4 వేలను రూ.10వేలకు పెంపు, డీజిల్‌పై రాయితీ గతంలో ఉన్న రూ.6.80 ని రూ.12.14 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 132 కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతంలోని 63 మత్స్యకార గ్రామాల్లో నివాసం ఉంటున్న 1.50 లక్షల మంది ఫలం పొందుతారు. వేట నిషేధ సమయంలో దాదాపు 20 వేల మందికి పరిహారం అందనుంది.

40 వేల కుటుంబాలకు సాయం..
సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూసమస్య పరిష్కారం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 40 వేల కుటుంబాలు మేలు పొందుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం జూన్‌ మొదటివారంలో జరిగిన తొలి కేబినేట్‌ సమావేశంలో సీఎం మంత్రులతో చర్చించారు. అనంతరం జూలై 17 అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ భూ సమస్య పరిష్కారం గురించి ప్రశ్న లేవనత్తగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సానుకూలంగా స్పందించారు. అదే నెల 26న సమస్య పరిష్కారం కోసం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కలెక్టర్‌ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని నియమించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ త్వరలో పని ప్రారంభిస్తుంది. 

పోలీసులకు వారాంతపు సంతోషం..
పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరితే కుటుంబంతో గడిపే అవకాశం లేనట్లే. వారాంతపు సంతోషాన్ని విడనాడాల్సిందే. కానీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందుకు భిన్నంగా ఆలోచించారు. పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పోలీసు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లా/నగర వ్యాప్తంగా పోలీసులకు వారంతపు సెలవు అమలవుతుంది. తద్వారా జిల్లాలో 2,500 మంది, నగరంలో 3 వేల మంది పోలీసులు వారంలో ఒకరోజు పూర్తిగా కుటుంబంతో గడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1300 మంది హోంగార్డులకు  ఈ సెలవు వర్తించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. 

ఆటోవాలాకు ఆనందం..
ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు వెంటాడే ఆర్‌టీఏ కేసులు.. ఇంకోవైపు ఆటో మరమ్మతులు ఇలా ఆటో కార్మికుల కష్టాలకు కొదవలేదు. జిల్లాలో ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ఆటోకార్మికులు తమ గోడు చెప్పుకున్నారు. దీనిపై ఆలోచన చేసిన సీఎం ఆటో కార్మికులందరితో పాటు సొంత వాహనం కలిగిన ట్యాక్సీ కార్మికులకు కూడా ఏటా రూ.10 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తద్వారా జిల్లాలోని దాదాపు 42 వేల మంది ఆటో కార్మికులు ఈ ప్రతిఫలం పొందనున్నారు. అలాగే మరో 6 వేల మంది ట్యాక్సీవాలాలు ఈ నగదు అందుకోనున్నారు. 

అందరికీ ఆరోగ్యం..
పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందని ద్రాక్ష. అలాంటి దైన్యం నుంచి పేదలను విముక్తి చేసింది డాక్టర్‌ వైఎస్సార్‌ పాలన. మళ్లీ ఆ పాలన గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ వంద రోజుల పాలనలో ఆరోగ్యశాఖపై ప్రత్యేక కసరత్తు చేశారు. ఆరోగ్యశ్రీకి ఊపిరి పోస్తూ రూ.1000 వైద్య ఖర్చు దాటితే ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొం దించారు. అదే సమయంలో వార్షికాదాయం రూ.40 కాకుండా రూ.5 లక్షలు ఉన్నవారిని ఈ పథకంలోకి ప్రవేశపెట్టారు. దీంతో జిల్లాలో 12,87,187 మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నారు.

అంగన్‌వాడీలకు మరింత లబ్ధి..
అప్పుడు రూ.10,500 వేతనంతో అంగన్‌వాడీ కార్యకర్తలు పని చేస్తున్నారు. ఆ సమయంలో తమకు వేతనాలు పెంచాలని జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. వారి వినతిని పరిశీలించిన ఆయన అధికారంలోకి రాగానే.. అంగన్‌వాడీలందరికీ రూ.11,500 వేతనం చేస్తూ జీవో జారీ చేశారు. దీనివలన జిల్లాలోని 25 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 4,952 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 4,786 మంది సిబ్బందికి మేలు జరిగింది.

పారిశుధ్య కార్మికుల బతుకులు బాగు..
మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. గత ప్రభుత్వాలు కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు. వారి ఆలోచనకు భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ కార్మికులను ఆదుకున్నారు. వారి బతుకుల బాగును కాంక్షిస్తూ హెల్త్‌ అలవెన్స్‌లను ఇవ్వడంతో పాటు వేతనాలను పెంచారు. అలవెన్స్‌ కింద రూ.6వేలు ఇవ్వడంతో పాటు వేతనాలను రూ.18 వేలకు పెంచారు. తద్వారా జీవీఎంసీ పరిధిలోని 5,130 మంది, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో 200 మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. 

బాక్సైట్‌ ముప్పు తొలగింది..
టీడీపీ ప్రభుత్వం అక్రమార్జన కోసం జీవో నంబర్‌ 97 ద్వారా బాక్సైట్‌ తవ్వకాలకు తెరతీసే ప్రయత్నం చేసింది. అయితే గిరిజనులతో పాటు ప్రజాసంఘాలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా తవ్వకాల కుట్రకు బ్రేక్‌ వేసింది. కానీ జీవోను రద్దు చేయకుండా ఏజెన్సీ గుండెలపై భారాన్ని అలాగే ఉంచింది. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ జీవోను రద్దు చేస్తూ బాక్సైట్‌ తవ్వకాల ఆలోచనే లేకుండా చేసి గిరిజనులకు భారీ ఊరట కలిగించారు.

సుజల స్రవంతికి జీవం..
ఉత్తరాంధ్ర జిల్లాల భూములను సస్యశ్యామలం చేసే కలతో మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టారు. సబ్బవరం కేంద్రంగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్‌ ఆయన మరణానంతరం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలి బడ్జెట్‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు ఊపిరి పోసే దిశగా రూ.170.06 కోట్లు కేటాయించారు. 

కుల వృత్తిదారులకు వెన్నుదన్ను..
సామాజిక న్యాయం చేస్తూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ వివిధ కుల వృత్తిదారులకు ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచారు. దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఏటా రూ.10 వేలు అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 76,667 మంది రజకులు, 38,472 మంది నాయీ బ్రాహ్మణులు, 22,584 మంది దర్జీలు లబ్ధి పొందనున్నారు.  

గంజాయి రవాణాకు చెక్‌..
రాష్ట్రంలోనే గంజాయి సాగుకు జిల్లాకు రాకూడని పేరుంది. టీడీపీ హయాంలో గత ఐదేళ్లు జిల్లాలోని ఓ మంత్రే స్వయంగా గంజాయి సాగుకు తనవంతు సహకారం అందించారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతంతో పండిన గంజాయి పంట నగరంలో గుప్పుమంది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ వంద రోజుల్లో నేరుగా గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపింది. రవాణాపై ఎక్కడిక్కడ నిఘా పెట్టి స్మగ్లర్లకు చెక్‌ పెట్టారు. సాగు చేయకుండా గిరిజన ప్రాంతాల్లో వీధి నాటికలు, బుర్రకథలు, అవగాహన సదస్సుల ద్వారా చైతన్య పరుస్తున్నారు. తద్వారా గతంలో 10 వేల ఎకరాల్లో ఉన్న గం జాయి సాగును 4 వేల ఎకరాలకు పరిమితం చేశారు. అంతేకాకుం డా దాన్ని కూడా నాశనం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

వైఎస్సార్‌ వైద్య కళాశాల.. మన్యానికి ప్రత్యేకం.. 
పాడేరు:
విశాఖ మన్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం వైఎస్సార్‌ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వైద్య కళాశాల ఏర్పాటుతో గిరిజనుల వైద్యారోగ్య సేవలకు భరోసా లభించనుంది. మన్యానికి ఇప్పటి వరకు వైద్య నిపుణులు అందుబాటులో లేరు. ఏటా గిరిజనులను అనేకమైన ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రక్తహీనత వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించడం లేదు. వైద్యుడిని చూడని గిరిజన పల్లెలు ఎన్నో ఉన్నాయి. రహదారుల సౌకర్యం, రక్షిత మంచినీరు అందుబాటులో లేని వందలాది గిరిజనులు నాటు వైద్యం, సంచి డాక్టర్లపైనే వైద్య సేవలకు ఆధారపడుతున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేయనుండడంతో ఆదివాసీలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వైద్య కళాశాల ఏర్పాటుతో పాడేరు జిల్లా ఆస్పత్రికి అన్ని విభాగాల వైద్య నిపుణులు అందుబాటులోకి రానున్నారు. ఇక గిరిజనులు వైద్య సేవల కోసం కేజీహెచ్‌ వరకు పోవాల్సిన అవసరం ఉండదు.        

సీఎం వైఎస్‌ జగన్‌ పాలన అద్భుతం..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వందరోజుల పాలన అద్భుతంగా ఉంది. పేద, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ పాలన సాగుతోంది. 100 రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ముస్లిం మైనారిటీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులిచ్చి అన్ని కులాలకు సమన్యాయం చేశారు. ఆశ వర్కర్ల నుంచి పారిశుధ్య కార్మికుల వరకు జీతాలు పెంచి వారికి భరోసా కల్పించారు. ప్రజలంతా వందరోజుల్లో సుఖసంతోషాలతో ఉన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా వంద రోజుల పాలన సాగింది. 
– ఎంవీవీ సత్యనారాయణ,  ఎంపీ, విశాఖపట్నం

చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన చక్కని పాలనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత పాలన వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. నవరత్న పథకాల హామీలు నెరవేర్చేందుకు ఆయన నిధులు కేటాయించడంతో ప్రజలకు సంపూర్ణ నమ్మకం ఏర్పడింది. పేదలందరికీ ఏదో ఓ రూపంలో లబ్ధి చేకూర్చడం హర్షించదగ్గ విషయం.
– ఎస్‌.చంద్రశేఖర్, అయ్యప్పనగర్‌

సంతృప్తినిచ్చిన వందరోజుల పాలన..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అవినీతి లేని పాలనకు ప్రాధాన్యమిస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం, రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా దోపిడీని అరికట్టేందుకు ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎంపీగా తాము పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పార్లమెంట్‌లో ఎన్నో అంశాలపై మాట్లాడేందుకు అవకాశం దక్కింది. ముఖ్యంగా రైల్వే సమస్యలపై సంబంధిత శాఖామంత్రి స్పందించి కోరిన వినతులకు సానుకూలంగా సమాధానాలు పంపించారు. కీలకమైన బిల్లులపై చర్చించేందుకు అవకాశం వచ్చిందంటే అది సీఎం జగన్‌ చలవే. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలు ఇచ్చిన వినతులకు స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటున్నాం. ఇచ్చే మాటకు కట్టుబడే వ్యక్తిగా సీఎం జగన్‌కు పేరుందని చెప్పేందుకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే ఉదాహరణ. 100 రోజుల పాలనలో ప్రజలకు చేరువవడంతో సంతోషంగా ఉంది. 
– బి.సత్యవతి, ఎంపీ అనకాపల్లి

బాక్సైట్‌ తవ్వకాల రద్దు..గిరిజనులకు మేలు
గత ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిచ్చిన 97 జీవోకు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడి ఆదివాసీలకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో రద్దుకు నిర్ణయం తీసుకుని గిరిజనులకిచ్చిన హామీను వెంటనే నెరవేర్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వందరోజుల పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు.
– గొడ్డేటి మాధవి, ఎంపీ, అరకు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top