కరోనా కాలంలో సీఎం జగన్‌ సంచలన నిర్ణయం

AP CM YS Jagan Key Decision On 400 Cr Insurance Money - Sakshi

విపత్తు సమయంలో సీఎం జగన్‌ పెద్ద మనసు

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ కష్ట సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ బీమా క్లెయిములు మంజూరు చేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే చెల్లించాలని సీఎం నిర్ణయించారు. గడచిన నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిముల కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం (రేపటి) నుంచి డబ్బులను ఆయా కుటుంబాలకు అందించాలని సీఎం సూచనలతో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లాక్‌డౌక్‌ కారణంగా ప్రజలెవ్వరూ ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి సదుపాయాల్లేని వాళ్లు, కూలిపనులు, చిన్న జీతాలతో నెట్టుకొస్తున్న వాళ్లు సహజ మరణం చెందినా, లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌ఐసీ కలిసి బాధితులకు బీమాను అందించేవి. వయస్సుల వారీగా, సహజ మరణానికి ఒక తరహా బీమా ప్రమాదవశాత్తూ మరణిస్తే మరో రకమైన బీమాను చెల్లించేవి. అయితే గడచిన నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు పరిష్కారం నిలిచిపోయింది. ఈ అంశంపై వెంటనే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలుమార్లు లేఖ రాశారు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ సమస్కను వెంటనే పరిష్కరించాలని కోరతూ ఎల్‌ఐసీకి లేఖ కూడా రాశారు. అయినా సరే ఇప్పటివరకూ క్లెయిమ్‌లను మంజూరు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. (కరోనా టెస్ట్‌ చేయించుకున్న సీఎం జగన్‌)

సహజ మరణాలు, ప్రమాదాల వల్ల పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం భావించారు. క్లెయిమ్‌ల మంజూరు కోసం పోరాటం చేస్తూనే, దానితో ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాలని సంకల్పించారు. ఒకవేళ బీమా సంస్థ తాను ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకపోతే బీమా సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాంటి విపత్తు నెలకొన్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఆదాయం పడిపోయినా పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top