చేతల్లో మార్పు

AP CM Jagan Implementing Revolutionary Changes in the medical field - Sakshi

ప్రజారోగ్య రంగంలో ఈ రోజు సువర్ణాధ్యాయం

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కాంప్రహెన్సివ్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేసే తొలి కాంప్రహెన్సివ్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్‌  

ఈ సెంటర్‌ ఏర్పాటుతో రాష్ట్రానికి రెండు పీజీ ఆంకాలజీ రేడియాలజిస్ట్‌ సీట్లు  

అత్యాధునిక పరికరాలతో కూడిన 108, 104 అంబులెన్స్‌లు ప్రారంభం

ప్రజా సేవలో 1,088 కొత్త అంబులెన్స్‌లు.. ఈ సర్వీసుల ఉద్యోగులకు జీతాల పెంపు

రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పౌరుల హెల్త్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌ నమోదు 

గుంటూరులోని కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా మెడికల్, సర్జికల్‌ ఆంకాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఏఇఆర్బీ (ఆటమిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్‌) అనుమతి ఉన్న మొట్టమొదటి యూనిట్‌ ఇది. ఇటువంటిదే కర్నూలులో నిర్మిస్తున్నాం. మరో ఏడాదిలో అది కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.  

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. 104 ద్వారా ఐదు లేదా ఏడు గ్రామాల ప్రజల ఆరోగ్య బాధ్యతను ఒక డాక్టర్‌కు అప్పగిస్తున్నాం. తద్వారా విదేశాలలో మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్‌ అనే భావనను ఆయా కుటుంబాలకు కలిగిస్తాం. 

ఒక్కోసారి సకాలంలో వైద్యం అందక పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్లడం బాధాకరం. ఆ పరిస్థితి రాకుండా పసిపిల్లల కోసం నియోనేటల్‌ అంబులెన్స్‌లను జిల్లాకు రెండు చొప్పున కేటాయించాం. ఇది మనసుకు ఆనందం కలిగించే అంశం.  
–సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ప్రజారోగ్య రంగంలో ఈ రోజు సువర్ణ అధ్యాయం.. మార్పు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాం.. గతానికి ఇప్పటికీ తేడాను ప్రజలందరూ ఒకసారి గమనించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఒకేరోజు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించడం ద్వారా దేశంలోనే కొత్త రికార్డును సృష్టించామని స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన.. ప్రభుత్వ రంగంలో పనిచేసే తొలి కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. 

గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించాలి 
► వైద్య రంగంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సంబంధించి ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా ఏమిటీ అనేది అందరూ గమనించాలి. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే.. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోతున్నారనే కథనాలు పత్రికల్లో వచ్చాయి. సెల్‌ ఫోన్‌ వెలుగుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే కథనాలు చూశాం.

► గతంలో పేరుకే 104 ఉండేది. 108 అంబులెన్స్‌లు అరకొరగా నడిచేవి. 108 అంబులెన్సులు నడిచే కండిషన్‌ లో వున్నవి 336 మాత్రమే. అంత దారుణంగా అంబులెన్స్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేవి. 

► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను చేతల్లో చూపించాను. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండేలా తీర్చి దిద్దుతున్నామని గర్వంగా చెబుతున్నా.

► విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలు ఉండేలా రూపురేఖలు మారుస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరో 16 టీచింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. 

► ఆగస్టు 15న వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక టీచింగ్, నర్సింగ్‌ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో 7 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నాం. క్యాన్సర్, కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రలను ఏర్పాటు చేయబోతున్నాం.

ప్రతి పౌరుడికీ ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్స్‌ 
► ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీ సెంటర్లను నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్లోనూ కనీసం ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ప్రతి మండలానికి కేటాయించిన 104 వాహనంలో మరో డాక్టర్‌ ఉంటారు.

► ప్రతి మండలంలో కనీసం 30 ఊళ్లు వుంటాయని అనుకుంటే.. వాటిని ఈ రెండు పీహెచ్‌సీలు సమానంగా పంచుకుంటాయి. ఒక డాక్టర్‌ 104లో కూర్చుని కనీసంగా 5 నుంచి 7 గ్రామాల బాధ్యత తీసుకుంటారు. ఆ డాక్టర్‌ ప్రతినెలా కచ్చితంగా ఒకరోజు తన పరిధిలోని గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది.

► ఆ గ్రామాల్లోని రోగుల వైద్య సంబంధ వివరాలను, పరీక్షలను, ఇచ్చిన మందులను ఎలక్ట్రానిక్‌ డేటా రికార్డ్‌లో నమోదు చేస్తారు.  
► రాష్ట్రంలో మొట్టమొదటి సారి పౌరుల ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ డేటాను ప్రభుత్వం నమోదు చేస్తోంది.  క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా హెల్త్‌ రికార్డులను చెక్‌ చేయవచ్చు. 

► ప్రతి పేషెంట్‌కు సంబంధించిన డిజిటల్‌ ఎలక్ట్రికల్‌ డేటా రికార్డ్స్‌ను 104, పీహెచ్‌సీలు, రాబోయే రోజుల్లో వచ్చే విలేజ్‌ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తాం. 

సకాలంలో 108 అంబులెన్స్‌ వస్తుందనే నమ్మకం కలిగించాం
► రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు 1,088 కొత్త వాహనాలు ప్రారంభించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఇందులో 412.. 108 అంబులెన్స్‌లు, 676 కొత్త 104 వాహనాలు ఉన్నాయి. 

► ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఫోన్‌ చేస్తే సకాలంలో 108 అంబులెన్స్‌ వస్తుందనే నమ్మకాన్ని కలిగించాం.

► పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 వాహనం వస్తుందని ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. గత ప్రభుత్వ హయాంలో లైఫ్‌ సపోర్ట్‌ ఉన్న వాహనాలు కేవలం 86 మాత్రమే. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. 432 అంబులెన్స్‌లలో 300 పై చిలుకు బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ ఉంది. 104 వాహనాలన్నింటిలో అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ ఉంది. వీటితో పాటు 26 నియోనేటల్‌ అంబులెన్స్‌లను నిర్వహిస్తున్నాం. 

► ఈ అంబులెన్సుల్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశాం. మల్టీప్యార మానిటర్, అత్యాధునిక వెంటిలేటర్లు, నియోనేటల్‌లో మొట్ట మొదటిసారిగా ఇంక్యుబేటర్‌లతో కూడిన వెంటిలేటర్ల వంటి పరికరాలను అమర్చాం. 

► మొదటిసారిగా అంబులెన్స్‌ల్లో కెమెరాలు కనిపిస్తున్నాయి. పేషెంట్‌ 108 వాహనంలో ఎక్కిన వెంటనే రోగి పరిస్థితిని ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌లో ఉన్న వైద్యులు ఈ కెమెరా ద్వారా పరిశీలిస్తారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. అడ్వాన్స్‌డ్‌ వెహికిల్‌ లొకేషన్‌ సిస్టమ్, టువే కనెక్టివిటీ, జీపీఎస్‌ వంటి సదుపాయాలు కూడా కల్పించాం. తద్వారా ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి, వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించే పరిస్థితి తీసుకువచ్చాం.    

108 సర్వీసుల సిబ్బందికి జీతాల పెంపు
► గతంలో 108 వాహనం డ్రైవర్లకు రూ.10 వేలు జీతం ఉండేది. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.18 వేల  నుంచి రూ.28 వేల వరకు పెంపు. 

► ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌కు గతంలో రూ.12 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంపు. ఇది ఈ రోజు (బుధవారం) నుంచే అమలులోకి వస్తుంది.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం
► రాష్ట్రంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం రూపురేఖలను పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తున్నాం. వైద్యం అందించిన మూడు వారాల్లో బిల్లులు చెల్లిస్తున్నాం. దీనివల్ల ఆరోగ్య శ్రీ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తులకు అక్కడ సిబ్బంది చిరునవ్వుతో వైద్యం అందిస్తున్నారు. పేదవాడికి వైద్యం ఎలా అందించాలన్న ఆరాటంతో ఆరోగ్యశ్రీని మెరుగు పరుస్తున్నాం. 

► ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయడంతో పాటు ఆ తర్వాత విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నాం.  

► ఈ నెల 8వ తేదీన ఆరు జిల్లాల్లో 2059 ప్రోసీజర్లకు (వ్యాధులు) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించే కార్యక్రమం చేపడుతున్నాం. నవంబర్‌ 14 నాటికి దీనిని అన్ని జిల్లాలకు విస్తరింప చేస్తాం. వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులు చెల్లిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లోని 130 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. 

ఖరీదైన క్యాన్సర్‌ చికిత్స ఉచితం
► గుంటూరు లోని కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ కోసం నిధులను అందించడం పట్ల నాట్కో ట్రస్ట్‌ సీఎండీ నన్నపనేని వెంకయ్య చౌదరి, ఇతర ట్రస్ట్‌ ప్రతినిధులకు అభినందనలు. ప్రజల ఆరోగ్యం కోసం నాట్కో ట్రస్ట్‌ ఈ రకంగా ముందుకు రావడం సంతోషం.  

► ఈ క్యాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుతో పేదలకు ఉచితంగానే ఖరీదైన క్యాన్సర్‌ చికిత్సను అందించడానికి వీలు పడుతుంది. ఈ సెంటర్‌ కారణంగా రాష్ట్రానికి రెండు పీజీ ఆంకాలజీ రేడియాలజిస్ట్‌ పోస్టులు కూడా రావడం మరింత సంతోషం కలిగిస్తోంది.  

మీరు చల్లగా ఉండాలయ్యా
అయ్యా మాది మచిలీపట్నం. నేను గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్నాను. ప్రభు త్వమే ఉచితంగా చికిత్స అంది స్తుండటంతో పాటు మందులు సమకూరు స్తోంది. నాలా గా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎంతో మంది కోసం మీరు (సీఎం) అధునాతన ప్రమాణాలతో ఆసుపత్రి నిర్మించారు. ఇలాంటి ఆసుపత్రి ఎంతో అవసరం. మాలాంటోళ్లను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. నిత్యావసరాలు అందజేస్తు న్నారు. నా భర్తకు పింఛన్‌ ఇస్తున్నారు. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. 
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో లక్ష్మి

అంబులెన్స్‌ వ్యవస్థకు జీవం పోశారు
‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం 108 అంబులెన్స్‌ వ్యవస్థ నీరుగారి పోయింది. ఏ ప్రభుత్వమొచ్చినా పట్టించుకోలేదు.  చివరకు మాకు వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణం చేశాక.. మాకు, ఈ పథకానికి జీవం పోశారు. కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. మాకు వేతనాలు రెట్టింపు చేశారు. బాధితులకు ఎలా భరోసా ఇచ్చారో మా జీవితాల్లోనూ అలాగే సంతోషం నింపారు’ అని 108 అంబులెన్స్‌ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. 

నిర్వీర్యమైన వ్యవస్థను బతికించారు
వాహనాలు మూలనపడ్డాయి. బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతం. అలాంటి వ్యవస్థను ముఖ్యమంత్రి బతికించారు. ఇక రోగులకు, క్షతగాత్రులకు సకాలంలో సేవలందుతాయి.
–బి.కిరణ్‌కుమార్, అధ్యక్షుడు, 108 ఉద్యోగుల సంఘం

ప్రజలకు భరోసా ఇచ్చారు
ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ వస్తుందో రాదోనన్న అనుమానం లేదు. ఏ సమయంలో ఫోన్‌ చేసినా అంబులెన్సు వస్తుందన్న భరోసా ఇ చ్చారు. పైగా ఎన్నో అధునాతన సదుపాయాలు కల్పించడం గొప్ప విషయం. 
– కేవీవీ నరసింహారావు, పైలట్, తూర్పుగోదావరి

నేను విన్నాను అన్నది నిజమైంది
పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మీ అందరికీ అండగా నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి ధైర్యాన్నిచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవస్థలో మార్పు చేశారు. 
–ఎం.శ్రీనివాసరావు, పైలట్, విశాఖపట్నం

అంబులెన్స్‌లకు స్వర్ణయుగం
చెదలు పట్టిన అంబులెన్స్‌ వ్యవస్థకు స్వర్ణయుగం వచ్చింది. బాధి తులకు భరోసా ఇవ్వడమే కాదు, వేతనాలు పెంచి మాకూ అండగా నిలిచారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా అందరం పని చేస్తాం. 
– ఎన్‌. మహేష్, పైలట్, గుంటూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top