అడియాసే | ap budget release | Sakshi
Sakshi News home page

అడియాసే

Mar 16 2017 9:43 AM | Updated on Jul 12 2019 6:01 PM

‘ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి’ అనే నినాదం ప్రగల్భాలుగానే మిగిలి పోయేట్లుగా ఉంది. రాజధాని నిర్మాణం కోసం నామమాత్రపు నిధుల కేటాయింపు నిర్ఘాంతపరిచింది.

అమరావతిలో తొలి పద్దులోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రగతికి పొద్దుపొడుపు లేకుండా చేసింది.  ఎన్నో ఆశలతో అమరావతిలో తొలి రాష్ట్ర బడ్జెట్‌ కోసం నిరీక్షించిన ప్రజలకు అడియాసే మిగిల్చింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ఆసాంతం మాటల కనికట్టు... అంకెల గారడీతో బురిడీ కొట్టించింది. కీలకమైన రాజధాని నిర్మాణానికి నామమాత్రపు నిధులు విదిల్చి చేతులు దులుపుకుంది. సాగునీటి రంగంపై నిర్లక్ష్యం... రుణమాఫీపై దొంగాట... మెట్రో రైలుపై ప్లేటు ఫిరాయింపు... సర్క్యులర్‌ రైలు పేరుతో కనికట్టు... స్మార్ట్‌సిటీకి అత్తెసరు నిధులు.. ప్రకటనలే తప్ప నిధుల ఊసు లేని ఇతర రంగాలు... ఇలా బడ్జెట్‌లో ఆసాంతం అమరావతికి అన్యాయమే చేశారు. 
సాక్షి, అమరావతి బ్యూరో :
‘ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి’ అనే నినాదం ప్రగల్భాలుగానే మిగిలి పోయేట్లుగా ఉంది. రాజధాని నిర్మాణం కోసం నామమాత్రపు నిధుల కేటాయింపు నిర్ఘాంతపరిచింది. లక్షల కోట్లతో నిర్మిస్తామన్న రాజధానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.1,061కోట్లు. అందులోనూ రూ.వెయ్యి కోట్లు కేంద్రం తన వాటాగా ఇస్తామని కేంద్ర బడ్జెట్‌లో పేర్కొంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.61కోట్లు విదిల్చిందన్నమాట. మౌలిక సదుపాయాల కల్పనకే రూ.5,500కోట్లు అవసరం.
 
మాస్టర్‌ప్లాన్లో‌ చూపించిన రంగుల ప్రపంచంలో పేర్కొన్నట్లుగా లెజిస్లేచర్‌ సిటీ, అడ్మినిస్ట్రేషన్‌ సిటీ, జస్టిస్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ, ఇండస్ట్రియల్‌ సిటీ, ఐటీ సిటీ, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, ఫ్‌లై ఓవర్లు... ఇలా నిర్మించాలంటే ఎన్ని లక్షల నిధు లు కావాలో కదా...
 హడ్కో రూ.7వేల కోట్ల రుణ సహాయానికి ఒప్పందం కుదిరిందని ఆర్థిక మంత్రి యనమల చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరుగుతున్నాయని కూడా అన్నారు... అంటే ఆ నిధులపై ఎలాంటి స్పష్టత లేదని స్పష్టమవుతోంది. మరోవైపు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోనేలేదు. 
 
సాగునీటిపై నిర్లక్ష్యం ...
ఎన్నడూలేని రీతిలో కృష్ణా డెల్టాలో సాగునీరు లేక ఈ ఏడాది రైతులు పంటలు వేయకుండా భూములు విడిచిపెట్టేశారు. రైతుల పరిస్థితి ఇంత దైన్యంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మనసు మాత్రం కరగలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో అమరావతిలో సాగునీటి రంగానికి సరైన కేటాయింపులే చేయలేదు. కీలకమైన పులిచింతల ప్రాజెక్టు పూర్తికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద కనీసం రూ.150 కోట్లు అవసరమని అంచనా. కానీ ప్రభుత్వం కేవలం రూ.43.41 కోట్లు మాత్రమే కేటాయించడం విస్మయపరిచింది. ఇక కృష్ణా డెల్టా ఆధునీకరణ మీద కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. గత బడ్జెట్‌లో డెల్టా ఆధునీకరణ కోసం కేటాయించిన రూ.112.89 కోట్లను విడుదల చేయనేలేదు. ఈ బడ్జెట్‌లో మరోసారి అవే రూ.112.89కోట్లను కేటాయిస్తున్నట్లు చూపిస్తూ కనికట్టు చేసింది. అన్నదాతను ఆదుకునే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహరించింది
స్మార్ట్‌ ప్రగతి పరుగులేవీ..!
విజయవాడ, గుంటూరులను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం గతంలో ఘనంగా ప్రకటించిం ది. కానీ నిధుల కేటాయింపు వచ్చేసరికి ప్లేటు ఫిరాయించింది. కేంద్రం గుర్తించిన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలకు రూ.450 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజయవాడతోపాటు 13 నగరాలకు కేవలం రూ.150 కోట్లు ఇస్తున్నట్లు మంత్రి యనమల ప్రకటించారు. అంటే సగటున రూ.11.50కోట్లు మాత్రమే ఇస్తారన్న మాట. ఈ నిధులతో మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమని అధికారులు పెదవి విరుస్తున్నారు. 
 
మెట్రో మాయే..!
విజయవాడకు మెట్రో రైలు గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనేలేదు. డీపీఆర్‌సిద్ధమైందని చెబుతూ అది కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అన్నట్లుగా మంత్రి యనమల చెప్పుకొచ్చారు. ఇక కొత్తగా విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలి లను కలుపుతూ సరŠుక్యలర్‌ రైలు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ అది కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని తేల్చేశారు. సర్వే కోసం కూడా నిధులు కేటాయించనే లేదు. 
 
పరిశ్రమలపై చిన్నచూపు 
రాజధానిలో ఉపాధి కల్పన దిశగా పారిశ్రామిక రంగానికి ప్రాధన్యమివ్వనే లేదు. అమరావతి పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో స్పష్టం చేయలేదు. ఇక ఐటీ రంగంపై కూడా శీతకన్ను వేశారు. విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్లు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి  తెలిపారు తప్ప అమరావతి గురించి ప్రస్తావించనే లేదు. పెద్ద నోట్ల రద్దుతో దెబ్బతిన్న రియల్‌ ఎస్టేట్, ఇతర రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు.  
 
రుణమాఫీ హామీ విషయంలో ప్రభుత్వం మరోసారి అన్నదాతను దొంగదెబ్బ తీసింది. బడ్జెట్‌లో కేటాయింపుల ప్రకారం జిల్లా రైతులకు ఈ ఏడాది రూ.300కోట్లు మాత్రమే విడుదలయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి జిల్లాలో 4,44,972మంది రైతులకు రూ.1,519 కోట్లు రుణాన్నీ దశలవారీగా మాఫీ చేస్తామని ప్రభుత్వం 2014లో ప్రకటించింది. మొదటి విడతగా 2015–16లో రూ.577 కోట్లు, రెండో విడతగా 2016–17లో రూ.232.11కోట్లు మొత్తం మీద రూ.809కోట్లు దశలవారీగా ఇచ్చింది. దాతో వడ్డీలు పెరిగి రైతులపై రుణభారం పెరిగిపోయింది. ప్రభుత్వం ఇచ్చింది వడ్డీలకే సరిపోయింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో కూడా కేవలం రూ.300 కోట్లతో సరిపుచ్చడం అన్నదాతను నిరాశకు గురిచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement